లూకా 1:66-80
లూకా 1:66-80 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఇది విన్న ప్రతి ఒక్కరు దాని గురించి ఆశ్చర్యపడి, “ఈ బిడ్డ ఏమవుతాడో?” అనుకున్నారు. ఎందుకంటే ప్రభువు హస్తం బిడ్డకు తోడుగా ఉన్నది. తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ విధంగా ప్రవచించాడు: “ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు స్తుతింపబడునుగాక, ఎందుకంటే ఆయన తన ప్రజలను దర్శించి వారిని విమోచించారు. దేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు, తన సేవకుడైన దావీదు వంశంలో మనకొరకు రక్షణ కొమ్మును మొలిపించారు. మన శత్రువుల చేతి నుండి మరియు మనలను ద్వేషించు వారి నుండి రక్షణ కలిగించారు, మన పితరులకు దయ చూపడానికి మరియు తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి: మన తండ్రియైన అబ్రాహాముకు ప్రమాణం చేసినట్లుగా, మనం భయపడకుండా ఆయనను సేవించాలని, మన శత్రువుల చేతి నుండి మనలను తప్పించి, బ్రతుకు దినాలన్ని మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధతతోను, నీతితోను జీవించడానికి విమోచించారు. “మరియు నా బిడ్డా, నీవు, మహోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు; ప్రభువుకు ముందుగా నీవు ఆయన కొరకు మార్గం సిద్ధం చేస్తావు. ఆయన ప్రజలకు వారి పాపక్షమాపణ ద్వారానే, రక్షణ కలుగుతుందని వారికి తెలియ జేస్తావు, ఎందుకంటే మన పాదాలను సమాధాన మార్గంలో నడిపించడానికి, చీకటిలో జీవిస్తున్నవారిపై మరియు మరణచ్ఛాయలో ఉన్నవారిపై ప్రకాశించడానికి పరలోకం నుండి ఉదయించే సూర్యునిలా మన దేవుని దయా కనికరం మనకొరకు అనుగ్రహించబడింది.” ఆ బాలుడు ఎదిగి ఆత్మలో బలపడ్డాడు; ఇశ్రాయేలీయులకు బహిరంగంగా కనబడే వరకు అరణ్యంలో నివసించాడు.
లూకా 1:66-80 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి, “ఈ బిడ్డ ఎలాటి వాడవుతాడో!” అనుకున్నారు. అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు, “ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు. తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు. మన శత్రువులబారి నుండీ మనలను ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు. దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు. ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను, అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు. మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది, పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో, పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే, మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం. ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు. మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి, వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా, ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు. మన పాదాలను శాంతి మార్గంలో నడిపించేలా చీకటిలోను, చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది. ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పై నుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేశాడు.” ఆ బాలుడు ఎదిగి, ఆత్మలో బలం పుంజుకుంటూ, ఇశ్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు.
లూకా 1:66-80 పవిత్ర బైబిల్ (TERV)
ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, “ఈ పసివాడు ఎంతగొప్పవాడౌతాడో కదా!” అని అన్నారు. ఆ బాలునికి ప్రభువు హస్తం తోడుగా ఉంది. ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నింపబడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు: “తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి! ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి! మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి మనకోసం పంపాడు. గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా ఈ విషయం చెప్పాడు. దేవుడు శత్రువుల బారినుండి, మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు. మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు. పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు! శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు. మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి. జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం! “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు! ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు! పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు! “మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి ఒక నీతిసూర్యుణ్ణి పంపించి, మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!” ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు.
లూకా 1:66-80 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులనుగూర్చి వినినవారందరును –ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడైయిట్లు ప్రవచించెను – ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను. దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహావాత్సల్యమునుబట్టి వారి పాపము లను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్య మునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శన మనుగ్రహించెను. శిశువు ఎదిగి, ఆత్మయందు బలముపొంది, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను.