లూకా 1:56-66

లూకా 1:56-66 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

మరియ దాదాపు మూడు నెలలు ఎలీసబెతుతో ఉండి తన ఇంటికి తిరిగి వెళ్లింది. ఎలీసబెతుకు నెలలు నిండినప్పుడు, ఆమె ఒక కుమారుని కన్నది. ప్రభువు ఆమెపై ఈ గొప్ప కరుణను చూపించాడన్న సంగతిని విన్న ఇరుగుపొరుగువారు మరియు బంధువులు, ఆమెతో కలిసి సంతోషించారు. ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతి చేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా, తల్లి, “వద్దు! బాబును యోహాను అని పిలవాలి” అని చెప్పింది. అందుకు వారు ఆమెతో, “మీ బంధువులలో ఎవ్వరికి ఆ పేరు లేదు కదా” అన్నారు. వారు ఈ బాబుకు ఏ పేరు పెట్టాలని తండ్రికి సైగ చేసి అడిగారు. అందుకతడు ఒక పలకను అడిగి, “బాబు పేరు యోహాను” అని దానిపై వ్రాసినప్పడు వారందరు ఆశ్చర్యపడ్డారు. వెంటనే అతని నోరు తెరుచుకుంది మరియు అతని నాలుక సడలింది, అతడు మాట్లాడుతూ దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఇరుగుపొరుగు వారందరు భయంతో నిండిపోయారు, యూదయ కొండ ప్రాంత ప్రజలందరు ఈ సంగతుల గురించి చెప్పుకొన్నారు. ఇది విన్న ప్రతి ఒక్కరు దాని గురించి ఆశ్చర్యపడి, “ఈ బిడ్డ ఏమవుతాడో?” అనుకున్నారు. ఎందుకంటే ప్రభువు హస్తం బిడ్డకు తోడుగా ఉన్నది.

షేర్ చేయి
Read లూకా 1

లూకా 1:56-66 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, ఆ పైన తన ఇంటికి వెళ్ళిపోయింది. ఎలీసబెతు నెలలు నిండి కొడుకుని కన్నది. అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు, బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు. వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా తల్లి, “అలా కాదు. ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి” అంది. అందుకు వారు, “నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ లేరు గదా” అని, “వాడికి ఏ పేరు పెట్టాలి?” అని తండ్రిని సైగలతో అడిగారు. అతడు పలక తెమ్మని, “బాబు పేరు యోహాను” అని రాశాడు. అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు. వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు. అది చూసి చుట్టుపక్కల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది. ఈ సమాచారం యూదయ మన్యంలో అంతటా చెప్పుకోసాగారు. జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి, “ఈ బిడ్డ ఎలాటి వాడవుతాడో!” అనుకున్నారు.

షేర్ చేయి
Read లూకా 1

లూకా 1:56-66 పవిత్ర బైబిల్ (TERV)

మరియ ఎలీసబెతు యింట్లో మూడు నెలలుండి, ఆ తర్వాత యింటికి తిరిగి వెళ్ళిపోయింది. ఎలీసబేతుకు నెలలు నిండి మగశిశువును ప్రసవించింది. బంధువులు మరియు ఇరుగు పొరుగు వాళ్ళు ప్రభువు ఆమెను కనికరించినందుకు ఆనందించారు. ఎనిమిదవ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి చేయటానికి వచ్చి అతనికి జెకర్యా అని అతని తండ్రి పేరే పెట్టబోయారు. కాని తల్లి వారిస్తూ, “ఆ పేరు వద్దు! యోహాను అని పేరు పెట్టండి” అని అన్నది. వాళ్ళు, “మీ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు ఎవ్వరూ లేరే?” అని అన్నారు. ఆ పిల్లవాని తండ్రికి సంజ్ఞలు చేసి అతడే పేరు పెట్టదలచాడో అని అడిగారు. అతడు వ్రాయటానికి ఒక పలక నివ్వమని అడిగి దానిపై, “అతనికి యోహాను అని పేరు పెట్టండి” అని వ్రాసాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే అతని నోరు, నాలుక కదిలి బాగైపోయింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇరుగు పొరుగు వాళ్ళలో భక్తి, భయమూ నిండుకుపొయ్యాయి. యూదయ పర్వత ప్రాంతమంతా ఈ వార్త వ్యాపించింది. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, “ఈ పసివాడు ఎంతగొప్పవాడౌతాడో కదా!” అని అన్నారు. ఆ బాలునికి ప్రభువు హస్తం తోడుగా ఉంది.

షేర్ చేయి
Read లూకా 1

లూకా 1:56-66 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అంతట మరియ,యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను. ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచె నని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతోకూడ సంతోషించిరి. ఎనిమిదవదినమునవారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా తల్లి–ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను. అందుకు వారు–నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి. అతడు వ్రాతపలక తెమ్మని–వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. అందునుబట్టి వారి చుట్టుపెట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచురమాయెను. ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులనుగూర్చి వినినవారందరును –ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.

షేర్ చేయి
Read లూకా 1