లూకా 1:46-56
లూకా 1:46-56 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు మరియ యిట్లనెను– నా ప్రాణము ప్రభువు ను ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలనియందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెనువారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అంతట మరియ,యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను.
లూకా 1:46-56 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకు మరియ: “నా ప్రాణం ప్రభువును మహిమపరుస్తుంది. నా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది. తన సేవకురాలి దీనస్థితిని ఆయన గమనించారు. ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు, ఎందుకంటే మహాఘనుడు నా కొరకు గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు. తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. ఆయన తన బాహువుతో గొప్ప కార్యాలను చేస్తారు; తమ అంతరంగాల్లో గర్వించు వారిని ఆయన చెదరగొట్టారు. సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు, కాని, దీనులను పైకి లేవనెత్తారు. ఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు, కాని, ధనవంతులను వట్టి చేతులతో పంపారు. ఆయన అబ్రాహాముకూ అతని సంతతివారికీ నిత్యం దయగలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ, మన పితరులకు వాగ్దానం చేసినట్లు, తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు.” మరియ దాదాపు మూడు నెలలు ఎలీసబెతుతో ఉండి తన ఇంటికి తిరిగి వెళ్లింది.
లూకా 1:46-56 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు మరియ ఇలా అంది, “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది. ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది. సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం. ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది. ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు. బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు. అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి, వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు, ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు.” మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, ఆ పైన తన ఇంటికి వెళ్ళిపోయింది.
లూకా 1:46-56 పవిత్ర బైబిల్ (TERV)
మరియ ఈ విధంగా అన్నది: “నా ఆత్మ ప్రభువును కొలిచింది. దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు. దీనురాల్ని నేను! ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు! ఇకనుండి అందరూ నన్ను ధన్యురాలంటారు! దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం! తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు. తన బలమైన హస్తాన్ని జాపి గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు. రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు. దీనులకు గొప్ప స్థానాలిస్తాడు. పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు. ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు. తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో, అతని సంతతితో చెప్పినట్లు దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.” మరియ ఎలీసబెతు యింట్లో మూడు నెలలుండి, ఆ తర్వాత యింటికి తిరిగి వెళ్ళిపోయింది.