లూకా 1:39-55
లూకా 1:39-55 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కొన్ని రోజుల తర్వాత మరియ సిద్ధపడి యూదయ కొండప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్లింది, అక్కడ ఆమె జెకర్యా ఇంటికి వెళ్లి ఎలీసబెతుకు వందనాలు చెప్పింది. ఎలీసబెతు మరియ చెప్పిన వందనాలను వింటున్నప్పుడు, ఆమె గర్భంలోని శిశువు గంతులేసాడు, మరియు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆమె పెద్ద స్వరంతో: “స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీవు గర్భంలో మోస్తున్న శిశువు ధన్యుడు! నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? నీవు చెప్పిన వందనం నా చెవిని చేరగానే, నా గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేసాడు. ప్రభువు తనకు చేసిన వాగ్దానం తప్పక నెరవేరుతుందని నమ్మిన స్త్రీ ధన్యురాలు!” అని చెప్పింది. అందుకు మరియ: “నా ప్రాణం ప్రభువును మహిమపరుస్తుంది. నా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది. తన సేవకురాలి దీనస్థితిని ఆయన గమనించారు. ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు, ఎందుకంటే మహాఘనుడు నా కొరకు గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు. తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. ఆయన తన బాహువుతో గొప్ప కార్యాలను చేస్తారు; తమ అంతరంగాల్లో గర్వించు వారిని ఆయన చెదరగొట్టారు. సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు, కాని, దీనులను పైకి లేవనెత్తారు. ఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు, కాని, ధనవంతులను వట్టి చేతులతో పంపారు. ఆయన అబ్రాహాముకూ అతని సంతతివారికీ నిత్యం దయగలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ, మన పితరులకు వాగ్దానం చేసినట్లు, తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు.”
లూకా 1:39-55 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇది జరిగిన కొద్దికాలానికే మరియ లేచి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని ఇంట్లోకి పోయి ఎలీసబెతుకు వందనం చేసింది. ఎలీసబెతు ఆ అభివందనం వినగానే, ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది. “స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందినది. నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం! నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు. ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుందని నమ్మిన ఆమె ధన్యురాలు” అంది. అప్పుడు మరియ ఇలా అంది, “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది. ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది. సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం. ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది. ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు. బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు. అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి, వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు, ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు.”
లూకా 1:39-55 పవిత్ర బైబిల్ (TERV)
మరియ వెంటనే యూదా పర్వత ప్రాంతం లోని ఒక గ్రామానికి వెళ్ళటానికి ప్రయాణమైంది. ఆ గ్రామంలోనున్న జెకర్యా యింటికి వెళ్ళి ఎలీసబెతును కలుసుకొని ఆమె క్షేమ సమాచారాలు అడిగింది. ఎలీసబెతు ఆమె మాటలు విన్న తక్షణమే, ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసాడు. ఎలీసబెతు పవిత్రాత్మతో నిండిపోయింది. ఆమె బిగ్గరగా, “దేవుడు ఏ స్త్రీని దీవించనంతగా నిన్ను దీవించాడు. అదే విధంగా నీ గర్భంలో నున్న శిశువు కూడా ధన్యుడు. కాని దేవుడు నా మీద యింత దయ ఎందుకు చూపుతున్నాడు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటమా? నీ మాటలు నా చెవిలో పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు. ప్రభువు చెప్పినట్లు జరుగుతుందని విశ్వసించావు. ధన్యురాలవు” అని అన్నది. మరియ ఈ విధంగా అన్నది: “నా ఆత్మ ప్రభువును కొలిచింది. దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు. దీనురాల్ని నేను! ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు! ఇకనుండి అందరూ నన్ను ధన్యురాలంటారు! దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం! తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు. తన బలమైన హస్తాన్ని జాపి గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు. రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు. దీనులకు గొప్ప స్థానాలిస్తాడు. పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు. ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు. తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో, అతని సంతతితో చెప్పినట్లు దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”
లూకా 1:39-55 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను. ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను – స్ర్తీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియ యిట్లనెను– నా ప్రాణము ప్రభువు ను ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలనియందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెనువారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.