లూకా 1:30-38
లూకా 1:30-38 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అయితే ఆ దూత ఆమెతో, “మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు. నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు. ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు. మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది. అందుకు ఆ దూత, “పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. కనుక పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన ముసలితనంలో గర్భం ధరించింది, పిల్లలు పుట్టరు అని ఎవరి గురించైతే అనుకున్నారో, ఆమెకు ఇప్పుడు ఆరో నెల నిండింది. ఎందుకంటే దేవుని నుండి వచ్చే ఏ మాట నెరవేరక మానదు” అన్నాడు. అందుకు మరియ, “నేను ప్రభువు దాసురాలను, నీవు చెప్పిన ప్రకారం నాకు జరుగును గాక” అని అన్నది. తర్వాత దూత వెళ్లిపోయాడు.
లూకా 1:30-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దూత, “మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది. ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని ఆమెతో చెప్పాడు. మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది. ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు. పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల. దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు. అందుకు మరియ, “నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక” అంది. అప్పుడా దూత వెళ్ళిపోయాడు.
లూకా 1:30-38 పవిత్ర బైబిల్ (TERV)
ఇది చూసి దేవదూత ఆమెతో యిలా అన్నాడు: “భయపడకు మరియా! దేవుడు నిన్ను అనుగ్రహించాడు. నీవు గర్భం దాల్చి మగ శిశువును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయన చాలా గొప్ప వాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకు యిస్తాడు. యాకోబు వంశానికి చెందిన వాళ్ళందర్ని ఈయన చిరకాలం పాలిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ అంతరించదు.” “నా కింకా పెండ్లి కాలేదే! ఇది ఎట్లా సాధ్యమవుతుంది?” అని మరియ దేవదూతను అడిగింది. ఆ దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పవిత్రాత్మ నీ మీదికి వచ్చునప్పుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందువలన నీకు పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉంటాడు. ఆ శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. నీ బంధువు ఎలీసబెతు తన వృద్ధాప్యంలో తల్లి కాబోతోంది. గొడ్రాలని పిలవబడే ఆమె యిప్పుడు ఆరు నెలల గర్భంతో ఉంది. దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు.” మరియ, “నేను దేవుని సేవకురాలను. మీరన్న విధంగానే జరుగనీ!” అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు.
లూకా 1:29-38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి–ఈ శుభవచన మేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత – మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత–పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము; దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాటచొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.