లేవీయకాండము 16:5-10
లేవీయకాండము 16:5-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను. అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను. ఏ మేకమీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. ఏ మేకమీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను.
లేవీయకాండము 16:5-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతడు ఇశ్రాయేలు సమాజం నుండి పాపం కోసం బలిగా రెండు మేక పోతులనూ దహనబలిగా ఒక పొట్టేలునూ తీసుకురావాలి. తరువాత అహరోను పాపం కోసం బలిగా కోడెదూడని మొదట తన కోసం అర్పించి తనకూ తన కుటుంబానికీ పరిహారం చేయాలి. ఆ తరువాత ఆ రెండు మేకపోతులను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలో ఉంచాలి. అప్పుడు అహరోను రెండు చీటీలు వేయాలి. ఒకటి యెహోవా కోసం రెండోది విడిచి పెట్టబోయే మేక కోసం వేయాలి. ఆరెండు చీటీలను ఆ రెండు మేకల పైన వేయాలి. యెహోవా కోసం రాసిన చీటీ ఏ మేక పైన పడుతుందో ఆ మేకని తెచ్చి పాపం కోసం బలిగా అర్పించాలి. ఏ మేకమీద ‘విడిచి పెట్టాలి’ అనే చీటీ పడుతుందో ఆ మేకని యెహోవా సమక్షంలోకి ప్రాణంతో తీసుకుని రావాలి. దాని మూలంగా ప్రజల పాపాలకు పరిహారం కలిగేలా దాన్ని అడవిలో వదిలిపెట్టాలి.
లేవీయకాండము 16:5-10 పవిత్ర బైబిల్ (TERV)
“మరియు పాపపరిహారార్థ బలికోసం రెండు మగ మేకలను, దహనబలికోసం ఒక పొట్టేలును ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుండి అహరోను తీసుకోవాలి. అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించాలి. ఈ పాపపరిహారార్థ బలి తనకోసమే. అప్పుడు అతనిని, అతని కుటుంబాన్ని పవిత్రంచేసే ఆచారాన్ని అహరోను జరిగించాలి. “తర్వాత, అహరోను ఆ రెండు మేకలను సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి. ఆ రెండు మేకలకు అహరోను చీట్లు వేయాలి. ఒకచీటి యెహోవాకు, ఇంకొకటి విడిచిపెట్టే అజాజేలుకు. “అప్పుడు అహరోను చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను యెహోవాకు అర్పించాలి. ఈ మేకను అహరోను పాపపరిహారార్థ బలిగా చేయాలి. అయితే విడిచి పెట్టేందుకు చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను ప్రాణంతోనే యెహోవా ఎదుటికి తీసుకొని రావాలి. దాన్ని పవిత్రం చేసే క్రమాన్ని యాజకుడు జరిగించాలి. తర్వాత ఈ మేక అర్యణంలో విడిచిపెట్టబడాలి.
లేవీయకాండము 16:5-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అతడు ఇశ్రాయేలు సమాజం నుండి పాపపరిహారబలి కోసం రెండు మేకపోతులను, దహనబలి కోసం ఒక పొట్టేలును తీసుకోవాలి. “అహరోను తనకు, తన ఇంటివారికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఎద్దును తన పాపపరిహారబలిగా అర్పించాలి. తర్వాత అతడు రెండు మేకపోతులు తీసుకుని సమావేశ గుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుట వాటిని సమర్పించాలి. అహరోను ఆ రెండు మేకపోతుల మధ్య చీట్లు వేయాలి ఎందుకంటే వాటిలో ఒకటి యెహోవా భాగం, మరొకటి విడిచిపెట్టబడే మేక. అప్పుడు అహరోను యెహోవా పేరిట చీటి వచ్చిన మేకను తీసుకుని పాపపరిహారబలిగా అర్పించాలి. విడిచిపెట్టాలి అనే చీటి వచ్చిన మేకను దాని వలన ప్రాయశ్చిత్తం కలిగేలా దాన్ని అడవిలో విడిచిపెట్టడానికి యెహోవా ఎదుట సజీవంగా నిలబెట్టాలి.