యెహోషువ 6:15-23
యెహోషువ 6:15-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఏడవ రోజున వారు ఉదయాన చీకటితోనే లేచి ఏడుసార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగారు. ఆ రోజు మాత్రమే వారు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరిగారు. ఏడవసారి యాజకులు బూరలు ఊదగానే యెహోషువ ప్రజలకి ఇలా ఆజ్ఞాపించాడు “కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు.” “ఈ పట్టణాన్నీ, దీనిలో ఉన్నవాటన్నిటినీ యెహోవా శపించాడు. రాహాబు అనే వేశ్య మనం పంపిన వేగులవారిని దాచిపెట్టింది కాబట్టి ఆమె, ఆ ఇంట్లో ఉన్న వారందరు మాత్రమే బ్రదుకుతారు. శాపానికి గురైన దానిలో కొంచెమైనా మీరు తీసికొంటే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల శిబిరానికి శాపం తెప్పించి దానికి బాధ కలిగించిన వారవుతారు కాబట్టి శపించిన దాన్ని మీరు ముట్టుకోకూడదు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితాలవుతాయి. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి.” యాజకులు బూరలు ఊదగానే ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల శబ్దం విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినపుడు ఆ ప్రాకారం కూలిపోయింది. ప్రజలంతా నేరుగా చక్కగా ఆ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు. వారు పురుషులనూ స్త్రీలనూ చిన్న పెద్దలనందరినీ యెద్దులనూ గొర్రెలనూ గాడిదలనూ ఆ పట్టణంలోని సమస్తాన్నీ కత్తితో చంపి వేశారు. అయితే యెహోషువ “ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసిన విధంగా ఆమెను, ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తీసుకు రండి” అని ఆ దేశాన్ని వేగు చూసిన ఆ ఇద్దరు మనుషులతో చెప్పాడు. వారు వెళ్ళి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సోదరులను, ఆమె బంధువులందరిననీ బయటికి తోడుకుని వచ్చారు. వారందరినీ తెచ్చి ఇశ్రాయేలీయుల శిబిరం బయట వారికి నివాసం ఏర్పాటు చేశారు.
యెహోషువ 6:15-23 పవిత్ర బైబిల్ (TERV)
ఏడో రోజు సూర్యోదయాన్నే వారు మేల్కొన్నారు. వారు పట్టణం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణాలు చేసారు. అంతకు ముందు రోజులలో నడచినట్టే నడిచారు, కాని ఆ రోజు పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు. పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు వేయండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు! ఈ పట్టణం, ఇందులో ఉన్న సమస్తం యెహోవాదే. వేశ్య రాహాబు, ఆమె ఇంటిలో ఉన్న వారు మాత్రమే బ్రతకాలి. మనం పంపిన ఇద్దరికీ రాహాబు సహాయం చేసింది గనుక వారిని చంపకూడదు. మరియు మిగిలిన వాటన్నింటినీ మనం నాశనం చేసివేయాలని జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని తీసుకోవద్దు. మీరు వాటిని తీసుకొని, మన పాళెములోనికి గనుక తీసుకొని వస్తే మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు. పైగా మీరు మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరికీ కష్టం తెచ్చి పెడ్తారు. వెండి, బంగారం మరియు ఇత్తడి, ఇనుముతో చేసిన వస్తువులన్నీ మొత్తం యెహోవాకే చెందుతాయి. వాటన్నింటినీ ఆయన కోసం దాచిపెట్టాలి.” యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలువిని కేకలు వేయటం మొదలుబెట్టారు. గోడలు కూలి పోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలో జొరబడి పోయారు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని ఓడించేసారు. ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్ని ప్రజలు నాశనం చేసారు. అక్కడ ప్రాణంతో ఉన్న సమస్తాన్ని వాళ్లు నాశనం చేసారు. పడుచు కుర్రాళ్లను పెద్ద మగవాళ్లను, పడుచు పిల్లల్ని, స్త్రీలను పశువుల్ని, గొర్రెల్ని, గాడిదల్ని వారు చంపేశారు. ఆ దేశాన్ని చూసేందుకు తాను పంపించిన ఇద్దరు మనుష్యులతో యోహోషువ మాట్లాడాడు: “ఆ వేశ్య ఇంటికి వెళ్లండి. ఆమెను బయటకు తీసుకొని రండి. మరియు ఆమెతో ఉన్న వాళ్లందరినీ బయటకు తీసుకొని రండి. మీరు ఆమెతో చేసిన వాగ్దానం ప్రకారం మీరు ఇలా చేయండి.” కనుక ఆ ఇద్దరు మనుష్యులూ ఆ ఇంట్లోకి వెళ్లి, రాహాబును బయటకు తీసుకొని వచ్చారు. ఆమె తండ్రి, తల్లి, సోదరులు, ఆమె కుటుంబం మొత్తం, ఆమెతో ఉన్న వాళ్లందర్నీ వారు బయటకు తీసుకొనివచ్చారు. ఆ మనుష్యులందరినీ ఇశ్రాయేలీయుల పాళెము వెలుపల క్షేమకరమైన చోట వారు ఉంచారు.
యెహోషువ 6:15-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఏడవదినమునవారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆప్రకారముగానే పట్టణముచుట్టు తిరిగిరి; ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–కేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారందరును మాత్రమే బ్రదుకుదురు. శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనినయెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్రలును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరిని యెద్దులను గొఱ్ఱెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ–ఆ వేశ్యయింటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగినవారినందరిని అక్కడనుండి తోడుకొని రండని దేశమును వేగుచూచిన యిద్దరు మనుష్యులతో చెప్పగా వేగులవారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగినవారినందరిని వెలుపలికి తోడుకొని వచ్చిరి; ఆమె యింటివారినందరిని వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెమువెలుపట వారిని నివసింపజేసిరి.
యెహోషువ 6:15-23 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఏడవ రోజున వారు తెల్లవారుజామున లేచి, రోజూలాగే పట్టణం చుట్టూ తిరిగారు. అయితే ఆ రోజు ఆ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు. ఏడవసారి తిరుగుతూ ఉండగా, యాజకులు బూరధ్వని చేయగానే యెహోషువ, “అరవండి! యెహోవా మీకు ఈ పట్టణాన్ని ఇచ్చారు! పట్టణం, దానిలో ఉన్నవన్నీ యెహోవా వలన శపించబడ్డాయి. అయితే మనం పంపిన దూతలను దాచిపెట్టిన వేశ్యయైన రాహాబును, ఆమెతో పాటు ఆమె ఇంట్లో ఉన్నవారిని మాత్రం మనం విడిచిపెట్టాలి. శపించబడిన వాటికి దూరంగా ఉండండి, లేకపోతే వాటిలో ఏదైనా తీసుకుని మీ సొంత నాశనాన్ని మీరు తెచ్చుకుంటారు! ఇశ్రాయేలీయుల శిబిరాన్ని నాశనానికి గురిచేసి దాని మీదికి కష్టాలు తెచ్చిన వారవుతారు. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుప వస్తువులు అన్నీ యెహోవాకు పవిత్రమైనవి, వాటిని ఆయన ఖజానాలోనికి చేర్చాలి.” బూరలు ఊదగానే సైన్యం కేకలు వేసింది. బూర శబ్దానికి పురుషులు పెద్దగా అరవడంతో గోడ కూలిపోయింది; కాబట్టి అందరు నేరుగా లోపలికి ప్రవేశించి వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు పట్టణాన్ని యెహోవా కోసం ప్రత్యేకపరచి, పురుషులను, స్త్రీలను, చిన్నవారిని, పెద్దవారిని, పశువులను, గొర్రెలను, గాడిదలను దానిలోని ప్రతి జీవిని ఖడ్గంతో నాశనం చేశారు. ఆ దేశాన్ని వేగు చూసిన ఇద్దరు వ్యక్తులతో యెహోషువ ఇలా అన్నాడు: “మీరు వేశ్య ఇంటికి వెళ్లి మీరు ఆమెతో చేసిన ప్రమాణం ప్రకారం ఆమెను, ఆమెకు చెందిన వారందరినీ బయటకు తీసుకురండి.” కాబట్టి వేగు చూసిన యువకులు లోపలికి వెళ్లి రాహాబును, ఆమె తండ్రిని, తల్లిని, ఆమె సోదరులు, సోదరీమణులను, ఆమెకు చెందిన వారందరినీ బయటకు తీసుకువచ్చారు. వారు ఆమె కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి ఇశ్రాయేలు శిబిరం బయట ఒకచోట ఉంచారు.