యెహోషువ 6:1-21

యెహోషువ 6:1-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల భయం వల్ల ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేశారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “చూడూ, నేను యెరికోను దాని రాజును అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగిస్తున్నాను. మీరంతా యుద్ధసన్నద్ధులై పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి. అలా ఆరు రోజులు చేయాలి. ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని ముందుగా నడవాలి. ఏడవ రోజున మీరు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ యాజకులు బూరలు ఊదాలి. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూండగా మీరు ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలిపోతుంది. యోధులు ప్రతి ఒక్కరూ ఎవరి ముందు వారు చక్కగా ఎక్కుతూ దాని మీద దాడి చెయ్యాలి” అన్నాడు. నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిపించి “మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని మోయండి. ఏడుగురు యాజకులు యెహోవా మందసానికి ముందుగా ఏడు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి” అని వారితో చెప్పాడు. తరువాత అతడు “మీరు ముందుకు వెళ్ళి పట్టణం చుట్టూ ముట్టడి వేయండి, యోధులు యెహోవా మందసానికి ముందుగా నడవండి” అని ప్రజలతో చెప్పాడు. యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు, ఏడు పొట్టేలు కొమ్ము బూరలు యెహోవా సన్నిధిని పట్టుకుని ముందుకు వెళ్తూ, ఆ బూరలు ఊదుతుండగా యెహోవా నిబంధన మందసం కూడా వారి వెంట నడిచింది. యోధులు బూరలు ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచారు. సైన్యం వెనక భాగం మందసం వెంట వచ్చింది. యాజకులు వెళ్తూ బూరలు ఊదుతున్నారు. యెహోషువ “మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకూ మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి” అని ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విధంగా యెహోవా మందసం ఆ పట్టణం చుట్టూ ఒకసారి తిరిగిన తరువాత వారు శిబిరంలోకి వెళ్ళి రాత్రి గడిపారు. యెహోషువ ఉదయాన్నే లేచిన వెంటనే యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తికుని మోశారు. ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలుకొమ్ము బూరలు పట్టుకుని, ఆపకుండా యెహోవా మందసానికి ముందుగా నడుస్తూ బూరలు ఊదుతూ వచ్చారు. యోధులు వారికి ముందు నడిచారు. వెనక ఉన్న సైనికులు యెహోవా మందసాన్ని వెంబడిస్తూ వచ్చారు. యాజకులు వెళ్తూ మానకుండా బూరలు ఊదుతూ వచ్చారు. ఆ విధంగా రెండవ రోజు వారు ఒకసారి పట్టణం చుట్టూ తిరిగి వారి శిబిరానికి మరలి వచ్చారు. ఆరు రోజులు వారు ఆ విధంగా చేస్తూ వచ్చారు. ఏడవ రోజున వారు ఉదయాన చీకటితోనే లేచి ఏడుసార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగారు. ఆ రోజు మాత్రమే వారు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరిగారు. ఏడవసారి యాజకులు బూరలు ఊదగానే యెహోషువ ప్రజలకి ఇలా ఆజ్ఞాపించాడు “కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు.” “ఈ పట్టణాన్నీ, దీనిలో ఉన్నవాటన్నిటినీ యెహోవా శపించాడు. రాహాబు అనే వేశ్య మనం పంపిన వేగులవారిని దాచిపెట్టింది కాబట్టి ఆమె, ఆ ఇంట్లో ఉన్న వారందరు మాత్రమే బ్రదుకుతారు. శాపానికి గురైన దానిలో కొంచెమైనా మీరు తీసికొంటే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల శిబిరానికి శాపం తెప్పించి దానికి బాధ కలిగించిన వారవుతారు కాబట్టి శపించిన దాన్ని మీరు ముట్టుకోకూడదు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితాలవుతాయి. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి.” యాజకులు బూరలు ఊదగానే ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల శబ్దం విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినపుడు ఆ ప్రాకారం కూలిపోయింది. ప్రజలంతా నేరుగా చక్కగా ఆ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు. వారు పురుషులనూ స్త్రీలనూ చిన్న పెద్దలనందరినీ యెద్దులనూ గొర్రెలనూ గాడిదలనూ ఆ పట్టణంలోని సమస్తాన్నీ కత్తితో చంపి వేశారు.

షేర్ చేయి
Read యెహోషువ 6

యెహోషువ 6:1-21 పవిత్ర బైబిల్ (TERV)

యెరికో పట్టణం మూసివేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు దగ్గర్లోనే ఉన్నందువల్ల ఆ పట్టణం లోని ప్రజలు భయపడ్డారు. ఎవరూ పట్టణంలోనికి గాని, బయటకు గాని వెళ్లలేదు. అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “చూడు, యెరికో పట్టణాన్ని నేను నీ స్వాధీనంలో ఉంచాను. దాని రాజు, పట్టణంలోని యుద్ధ వీరులు నీ స్వాధీనంలో ఉన్నారు. నీ సైన్యంతో పట్టణం చుట్టూ రోజుకు ఒక్కసారి ప్రదక్షిణం చేయి. ఇలా ఆరు రోజులు చేయి. పొట్టేలు కొమ్ములతో చేసిన బూరలు ఊదేందుకు ఏడుగురు యాజకులను నియమించుము. పవిత్ర పెట్టెకు ముందుగా నడువుమని యాజకులతో చెప్పు. ఏడో రోజున ఏడుసార్లు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఏడోరోజున వారు ముందడుగు వేయగానే బూరలు ఊదాలని యాజకులతో చెప్పు. యాజకులు బూరలతో పెద్ద శబ్దం చేయాలి. ఆ శబ్దం నీవు వినగానే ప్రజలందర్నీ కేకలు వేయమని చెప్పు. మీరు ఇలా చేయగానే పట్టణం యొక్క గోడలు కూలిపోతాయి. అప్పుడు మీ ప్రజలు సరాసరి పట్టణం లోనికి వెళ్లిపోవాలి.” కనుక నూను కుమారుడైన యెహోషువ యాజకులందర్నీ సమావేశపర్చాడు. “యెహోవా పవిత్ర పెట్టెను మోయండి. ఏడుగురు యాజకులు బూరలు మోయాలని చెప్పండి. ఆ యాజకులు పవిత్ర పెట్టెకు ముందుగా నడవాలి” అని యెహోషువ వారితో చెప్పాడు. “ఇప్పుడు బయల్దేరండి. పట్టణం చుట్టూ నడవండి. ఆయుధాలు ధరించిన సైనికులు యెహోవా పవిత్ర పెట్టె ఎదుట నడవాలి” అని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు. యెహోషువ ప్రజలతో మాట్లాడటం ముగించగానే, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని నడవటం మొదలుబెట్టారు. ఏడు బూరలను వారు మోసుకొని వెళ్లారు. వారు నడుస్తూ ఉన్నప్పుడు బూరలు ఊదారు. యెహోవా పవిత్ర పెట్టెను మోసే వారు వారి వెనుక నడిచారు. ఆయుధాలు ధరించిన సైనికులు యాజకులకు ముందుగా నడిచారు. పవిత్ర పెట్టె వెనుక నడుస్తున్నవాళ్లు బూరలు ఊదారు. అయితే యుద్ధనాదం చేయవద్దని యెహోషువ ప్రజలతో చెప్పాడు. “కేకలు వేయకండి. నేను మీతో చెప్పే రోజు వరకు ఒక్క మాటకూడ పలుకకండి. తరువాత మీరు కేకలు వేయవచ్చు” అన్నాడు యోహోషువ. కనుక యెహోవా పవిత్ర పెట్టెను పట్టణంచుట్టూ ఒక్కసారి యాజకులచేత యెహోషువ మోయించాడు. తర్వాత వారు వారి బసకు వెళ్లి ఆ రాత్రి అక్కడే గడిపారు. మర్నాటి ఉదయాన్నే యెహోషువ లేచాడు. యాజకులు యెహోవా పవిత్ర పెట్టెను మరలా మోసారు. మరియు యాజకులు ఏడుగురు ఏడు బూరలు మోసారు. యెహోవా పవిత్ర పెట్టె ఎదుట వారు నడుస్తూ బూరలు ఊదారు. ఆయుధాలు ధరించిన సైనికులు వారికి ముందుగా నడిచారు. యెహోవా పవిత్ర పెట్టె వెనుక నడిచే యాజకులు నడుస్తూ, బూరలు ఊదారు. కనుక రెండో రోజున వాళ్లంతా పట్టణం చుట్టూ ఒక మారు ప్రదక్షిణం చేసారు. ఆ తర్వాత వాళ్లు తిరిగి వారి బసకు వెళ్లిపోయారు. ఆరు రోజులపాటు వారు ఇలానే ప్రతిరోజూ చేసారు. ఏడో రోజు సూర్యోదయాన్నే వారు మేల్కొన్నారు. వారు పట్టణం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణాలు చేసారు. అంతకు ముందు రోజులలో నడచినట్టే నడిచారు, కాని ఆ రోజు పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు. పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు వేయండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు! ఈ పట్టణం, ఇందులో ఉన్న సమస్తం యెహోవాదే. వేశ్య రాహాబు, ఆమె ఇంటిలో ఉన్న వారు మాత్రమే బ్రతకాలి. మనం పంపిన ఇద్దరికీ రాహాబు సహాయం చేసింది గనుక వారిని చంపకూడదు. మరియు మిగిలిన వాటన్నింటినీ మనం నాశనం చేసివేయాలని జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని తీసుకోవద్దు. మీరు వాటిని తీసుకొని, మన పాళెములోనికి గనుక తీసుకొని వస్తే మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు. పైగా మీరు మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరికీ కష్టం తెచ్చి పెడ్తారు. వెండి, బంగారం మరియు ఇత్తడి, ఇనుముతో చేసిన వస్తువులన్నీ మొత్తం యెహోవాకే చెందుతాయి. వాటన్నింటినీ ఆయన కోసం దాచిపెట్టాలి.” యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలువిని కేకలు వేయటం మొదలుబెట్టారు. గోడలు కూలి పోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలో జొరబడి పోయారు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని ఓడించేసారు. ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్ని ప్రజలు నాశనం చేసారు. అక్కడ ప్రాణంతో ఉన్న సమస్తాన్ని వాళ్లు నాశనం చేసారు. పడుచు కుర్రాళ్లను పెద్ద మగవాళ్లను, పడుచు పిల్లల్ని, స్త్రీలను పశువుల్ని, గొర్రెల్ని, గాడిదల్ని వారు చంపేశారు.

షేర్ చేయి
Read యెహోషువ 6

యెహోషువ 6:1-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను–చూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను. మీరందరు యుద్ధసన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దానిచుట్టు తిరుగవలెను. ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవదినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆయాజకులు బూరల నూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జనులందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి–మీరు నిబంధనమందసమును ఎత్తికొని మోయుడి; ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను. మరియు అతడు–మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధనమందసమును వారివెంట నడిచెను. యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి. మరియు యెహోషువ–మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమువరకు మీరు కేకలువేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటనుండి యే ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని యొకమారు దానిచుట్టు తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములువారు ఆలాగు చేయుచువచ్చిరి. ఏడవదినమునవారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆప్రకారముగానే పట్టణముచుట్టు తిరిగిరి; ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–కేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారందరును మాత్రమే బ్రదుకుదురు. శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనినయెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్రలును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరిని యెద్దులను గొఱ్ఱెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి.

షేర్ చేయి
Read యెహోషువ 6

యెహోషువ 6:1-21 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఇశ్రాయేలీయుల భయంతో యెరికో ద్వారాలు గట్టిగా మూసివేయబడ్డాయి. ఎవరూ బయటకు రావడానికి గాని లోపలికి వెళ్లడానికి గాని లేదు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పారు, “చూడు, యెరికోను, దాని రాజును, దానిలో ఉన్న యుద్ధవీరులతో పాటు మీ చేతికి అప్పగిస్తున్నాను. నీవు యుద్ధవీరులందరితో పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి. ఇలా ఆరు రోజులు చేయాలి. మందసం ముందు ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి. ఏడవ రోజున యాజకులు బూరలు ఊదుతూ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరగాలి. వారు మానకుండా చేస్తున్న బూరధ్వని మీరు విన్నప్పుడు, సైన్యమంతా పెద్దగా కేకలు వేయాలి; అప్పుడు ఆ పట్టణపు గోడ కూలిపోతుంది, సైన్యంలో ప్రతి ఒక్కరు పైకి ఎక్కి నేరుగా లోపలికి వెళ్తారు.” కాబట్టి నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిచి వారితో, “మీరు యెహోవా నిబంధన మందసాన్ని ఎత్తుకుని దాని ముందు ఏడుగురు యాజకులు బూరలు పట్టుకుని నడవాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత అతడు, “పదండి ముందుకు! యెహోవా మందసం ముందు ఆయుధాలు ధరించిన వీరులు నడుస్తుండగా పట్టణం చుట్టూ తిరగాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు. యెహోషువ ప్రజలతో మాట్లాడినప్పుడు, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని ఏడు బూరలను మోస్తూ, బూరలు పట్టుకుని వాటిని ఊదుతూ ముందుకు సాగుతూ ఉండగా, యెహోవా నిబంధన మందసం వారి వెంట వెళ్లింది. ఆయుధాలు ధరించిన వీరులు బూరలు ఊదుతున్న యాజకుల ముందు నడుస్తుండగా, వెనుక ఉన్న వీరులు మందసం వెనుక నడిచారు. ఆ సమయమంతా యాజకులు బూరలు ఊదుతూనే ఉన్నారు. కానీ యెహోషువ, “యుద్ధపు కేక వేయవద్దు, మీ స్వరాలు ఎత్తవద్దు, నేను మీకు అరవమని చెప్పే రోజు వరకు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నేను చెప్పినప్పుడు అరవండి!” అని సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. అలా అతడు యెహోవా మందసాన్ని మోసుకొని పట్టణం చుట్టూ ఒకసారి తిరిగేలా చూశాడు. తర్వాత సైన్యం శిబిరానికి తిరిగివచ్చి రాత్రి అక్కడ గడిపింది. యెహోషువ మరుసటిరోజు ఉదయాన్నే లేవగా, యాజకులు, యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తుకున్నారు. ఆ ఏడుగురు యాజకులు ఏడు బూరలను పట్టుకుని యెహోవా మందసం ముందు నడుస్తూ బూరలు ఊదుతూ ఉన్నారు. బూరధ్వని వినబడుతూ ఉండగా, ఆయుధాలు ధరించిన వీరులు వారికి ముందు వెళ్తుండగా, వెనుక ఉన్న వీరులు యెహోవా మందసం వెనుక వెళ్లారు. రెండవ రోజున కూడా వారు పట్టణం చుట్టూ ఒకసారి తిరిగి, శిబిరానికి తిరిగి వచ్చారు. అలా వారు ఆరు రోజులపాటు చేశారు. ఏడవ రోజున వారు తెల్లవారుజామున లేచి, రోజూలాగే పట్టణం చుట్టూ తిరిగారు. అయితే ఆ రోజు ఆ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు. ఏడవసారి తిరుగుతూ ఉండగా, యాజకులు బూరధ్వని చేయగానే యెహోషువ, “అరవండి! యెహోవా మీకు ఈ పట్టణాన్ని ఇచ్చారు! పట్టణం, దానిలో ఉన్నవన్నీ యెహోవా వలన శపించబడ్డాయి. అయితే మనం పంపిన దూతలను దాచిపెట్టిన వేశ్యయైన రాహాబును, ఆమెతో పాటు ఆమె ఇంట్లో ఉన్నవారిని మాత్రం మనం విడిచిపెట్టాలి. శపించబడిన వాటికి దూరంగా ఉండండి, లేకపోతే వాటిలో ఏదైనా తీసుకుని మీ సొంత నాశనాన్ని మీరు తెచ్చుకుంటారు! ఇశ్రాయేలీయుల శిబిరాన్ని నాశనానికి గురిచేసి దాని మీదికి కష్టాలు తెచ్చిన వారవుతారు. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుప వస్తువులు అన్నీ యెహోవాకు పవిత్రమైనవి, వాటిని ఆయన ఖజానాలోనికి చేర్చాలి.” బూరలు ఊదగానే సైన్యం కేకలు వేసింది. బూర శబ్దానికి పురుషులు పెద్దగా అరవడంతో గోడ కూలిపోయింది; కాబట్టి అందరు నేరుగా లోపలికి ప్రవేశించి వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు పట్టణాన్ని యెహోవా కోసం ప్రత్యేకపరచి, పురుషులను, స్త్రీలను, చిన్నవారిని, పెద్దవారిని, పశువులను, గొర్రెలను, గాడిదలను దానిలోని ప్రతి జీవిని ఖడ్గంతో నాశనం చేశారు.

షేర్ చేయి
Read యెహోషువ 6