యెహోషువ 5:1-9
యెహోషువ 5:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇశ్రాయేలీయులు దాటే వరకు యెహోవా యొర్దానును వారి ముందు ఆరిపోయేలా చేశారని యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులందరూ, మధ్యధరా తీరం వెంబడి నివసించిన కనానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు కరిగి నీరై ఇశ్రాయేలు ప్రజలను ఎదుర్కొనే ధైర్యం వారికి లేకపోయింది. ఆ సమయంలో యెహోవా యెహోషువతో, “చెకుముకిరాతి కత్తులు చేయించి ఇశ్రాయేలీయులకు మళ్ళీ సున్నతి చేయించు” అని చెప్పారు. కాబట్టి యెహోషువ చెకుముకిరాతి కత్తులు చేయించి గిబియత్ హారలోతు దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు. యెహోషువ వారికి సున్నతి చేయించడానికి కారణం ఏంటంటే ఈజిప్టు నుండి బయటకు వచ్చిన వారిలో సైనిక వయస్సుగల పురుషులంతా ఈజిప్టును విడిచిన అరణ్య మార్గంలోనే చనిపోయారు. బయటకు వచ్చిన వారందరూ సున్నతి పొందిన వారే, కానీ ఈజిప్టు నుండి ప్రయాణం చేస్తుండగా అరణ్యమార్గంలో పుట్టిన వారందరూ సున్నతి పొందనివారే. యెహోవా మాట వినలేదు కాబట్టి, ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచినప్పుడు సైనిక వయస్సులో ఉన్న పురుషులందరు చనిపోయే వరకు వారు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. ఎందుకంటే మనకు ఇస్తానని వారి పూర్వికులకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు చూడరని యెహోవా వారితో ప్రమాణం చేశారు. కాబట్టి ఆయన వారి స్థానంలో వారి కుమారులను లేవనెత్తారు, యెహోషువ సున్నతి చేయించింది వీరికే. దారిలో వారికి సున్నతి జరుగలేదు కాబట్టి వారు సున్నతిలేనివారిగానే ఉన్నారు. దేశంలోని మగవారంతా సున్నతి పొందిన తర్వాత, వారు స్వస్థత పొందేవరకు శిబిరంలోనే ఉన్నారు. తర్వాత యెహోవా యెహోషువతో, “ఈ రోజు నేను మీ నుండి ఈజిప్టు అవమానాన్ని తొలగించాను” అని చెప్పారు. అందుకని ఈనాటి వరకు ఆ స్థలాన్ని గిల్గాలు అని పిలువబడుతుంది.
యెహోషువ 5:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు యొర్దానును దాటినంతసేపూ యెహోవా ఇశ్రాయేలీయుల ముందు ఉండి ఆ నదిలో నీళ్లను ఆరిపోయేలా చేసిన సంగతి యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులూ, మహాసముద్రం తీరాన ఉన్న కనానీయుల రాజులూ విన్నప్పుడు, వారి గుండెలు అదిరిపోయాయి. ఇశ్రాయేలీయుల భయంతో వారు అధైర్యపడ్డారు. ఆ సమయంలో యెహోవా “రాతికత్తులు చేయించి మళ్లీ ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు” అని యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ రాతి కత్తులు చేయించి “గిబియత్ హరాలోత్” అనే స్థలం దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు. యెహోషువ సున్నతి చేయించటానికి కారణం, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధసన్నద్ధులైన వారందరూ ఐగుప్తు మార్గంలో అరణ్యంలోనే చనిపోయారు. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గంలో పుట్టిన వారిలో ఎవ్వరూ సున్నతి పొందలేదు. యెహోవా మాట వినకపోవడం వల్ల వారికి ఏ దేశాన్ని ఇస్తానని వారి పితరులతో యెహోవా ప్రమాణం చేశాడో, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తాను వారికి ఇంక చూపించనని ప్రమాణం చేసినందువల్ల ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ నశించే వరకూ ఇశ్రాయేలీయులు నలభై సంవత్సరాలు అరణ్యంలో సంచరిస్తూ ఉండిపోయారు. ఆయన వారికి స్థానంలో పుట్టించిన వారి కుమారులు సున్నతి పొందలేదు కాబట్టి వారికి ఇప్పుడు సున్నతి చేయించాడు, ఎందుకంటే మార్గంలో వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ప్రజలందరికీ సున్నతి చేయించిన తరువాత వారు బాగుపడే వరకూ శిబిరం లోనే ఉండిపోయారు. అప్పుడు యెహోవా “ఈ రోజు నేను ఐగుప్తు అవమానాన్ని మీ మీద నుండి దొర్లించి వేశాను” అని యెహోషువతో అన్నాడు. అప్పటినుండి నేటివరకూ ఆ స్థలానికి “గిల్గాలు” అని పేరు.
యెహోషువ 5:1-9 పవిత్ర బైబిల్ (TERV)
కనుక ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నది దాటి వెళ్లేంతవరకు యెహోవా దానిని ఎండి పోయేటట్టు చేసాడు. యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న రాజులు, మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న కనానీ ప్రజలు ఇది విని చాల భయపడిపోయారు. అంతటితో ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించే ధైర్యం వారికి లేక పోయింది. ఆ సమయంలో యెహోవా, “మొనగల రాళ్లతో కత్తులు చేసి, ఇశ్రాయేలు ప్రజలకు మరల సున్నతి చేయి” అని యెహోషువతో చెప్పాడు. కనుక యెహోషువ మొనగల రాళ్లతో కత్తులు చేసాడు. తర్వాత గిబియత్ హార్లత్ దగ్గర అతడు వారికి సున్నతి చేసాడు. ఆ మగవాళ్లకు యెహోషువ ఎందుకు సున్నతి చేసాడంటే; ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు వదిలి పెట్టిన తర్వాత, సైన్యానికి తగిన వాళ్లందరికీ సున్నతి చేయబడింది. అరణ్యంలో ఉన్నప్పుడు ఆ వీరులు చాల మంది యెహోవా మాట వినలేదు. అందుచేత “పాలు, తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని” ఆ మనుష్యులు చూడరని యెహోవా ప్రమాణం చేసాడు. ఆ దేశాన్ని మనకు ఇస్తానని యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం చేసాడు కానీ ఆ మనుష్యుల మూలంగా ప్రజలంతా 40 సంవత్సరాలపాటు అరణ్యంలోనే సంచరించాల్సి వచ్చింది. అలా ఆ సైన్యం, వాళ్లంతా చావాల్సి ఉంది. పోరాడే ఆ మనుష్యులంతా చనిపోయారు. వారి కుమారులు వారి స్థానాలు వహించారు. అయితే ఈజిప్టునుండి వచ్చేటప్పుడు అరణ్యంలో పుట్టిన బాలురకు ఎవ్వరికి సున్నతి జరగలేదు. అందుచేత యెహోషువ వారికి సున్నతి చేసాడు. ప్రజలందరికీ యెహోషువ సున్నతి చేయటం ముగించాడు. తర్వాత వాళ్లంతా స్వస్థత పడేంతవరకు ఆ గుడారాలలోనే ఉండిపోయారు. ఆ సమయంలో యెహోవా, “మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్నప్పుడు అవమానం పొందారు కానీ నేడు ఆ అవమానాన్ని నేను తొలగించివేసాను” అని యెహోషువతో చెప్పాడు. అందుచేత ఆ స్థలానికి గిల్గాలు అని యెహోషువ పేరు పెట్టాడు. నేటికీ ఆ చోటు గిల్గాలు అనే పిలువబడుతోంది.
యెహోషువ 5:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యొర్దానుకు పడమటిదిక్కుననున్న అమోరీయుల రాజులందరును సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరును వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను. ఇశ్రాయేలీయుల భయముచేత వారికిక ధైర్యమేమియు లేక పోయెను. ఆ సమయమున యెహోవా–రాతికత్తులు చేయించుకొని మరల ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతికత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులోనుండి బయలుదేరినవారందరిలో యుద్ధసన్నద్ధులైన పురుషులందరు ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరు సున్నతి పొందినవారే కాని ఐగుప్తులోనుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొందియుండలేదు. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమాణముచేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి యుండెను గనుక ఐగుప్తులోనుండి వచ్చిన ఆ యోధులందరు యెహోవా మాట వినకపోయినందునవారు నశించువరకు ఇశ్రాయేలీయులు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది యుండలేదు గనుక వారికి సున్నతి చేయించెను; ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరుగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడువరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా–నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహోషువతోననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గా లను పేరు.
యెహోషువ 5:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)