యెహోషువ 3:14-17
యెహోషువ 3:14-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కోతకాలమంతా యొర్దాను దాని గట్లన్నిటి మీదా పొర్లి పారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు ప్రజలకు ముందు వెళ్లగా యొర్దాను దాటడానికి ప్రజలు తమ గుడారాల్లో నుండి బయలుదేరారు. అప్పుడు ఆ మందసాన్ని మోసే యాజకులు యొర్దానులో దిగిన తరువాత వారి కాళ్లు నీటి అంచున మునగగానే పై నుండి పారే నీళ్లు చాలా దూరంగా సారెతాను దగ్గర ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికో దగ్గర ఆవలి తీరం చేరారు. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద యొర్దాను దాటడం అయ్యే వరకూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో ఆరిన నేల మీద నిలబడ్డారు.
యెహోషువ 3:14-17 పవిత్ర బైబిల్ (TERV)
యాజకులు ఒడంబడిక పెట్టె మోయగా, ప్రజలుతాము గుడారాలు వేసిన చోటునుండి బయల్దేరారు. ప్రజలు యొర్దాను నది దాటడం ప్రారంభించారు. (కోతకాలంలో యొర్దాను నది దాని గట్లు మీద పొర్లి పారుతుంది. అందుచేత నది పొంగుతూ ఉంది.) పెట్టెను మోస్తున్న యాజకులు నది ఒడ్డుకు వచ్చారు. నీళ్లలో వారు నిలిచిపోయారు. సరిగ్గా అప్పుడే నీరు ప్రవహించటం ఆగిపోయింది. (ఆ స్థలం వెనుక నీళ్లు ఆనకట్ట కట్టినట్టు నిలిచిపోయాయి.) నది పొడవునా ఆదాం వరకు (సారెతాను దగ్గర ఒక ఊరు.) నీరు ఎత్తుగా నిలబడ్డాయి. ప్రజలు యెరికో దగ్గర నది దాటారు. ఆ చోట నేల ఆరిపోయింది. యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను ఆ నది మధ్యవరకు మోసుకొని వెళ్లి, అక్కడ నిలిచిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ యొర్దాను నదిలో ఆరిన నేలమీద నడచి, ఆవలికి దాటేవరకు యాజకులు అక్కడ వేచి ఉన్నారు.
యెహోషువ 3:14-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును; నిబంధనమందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలోనుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగినతరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచునమునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో యెదుటను దాటగా యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరు యొర్దానును దాటుట తుద ముట్టువరకు ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి.
యెహోషువ 3:14-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి యాజకులు ప్రజలకు ముందుగా నిబంధన మందసం మోస్తూ నడుస్తుండగా ప్రజలు వారి శిబిరాల నుండి యొర్దాను దాటడానికి బయలుదేరతారు. కోతకాలమంతా యొర్దాను నది పొంగుతూ ఉంటుంది. మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది దగ్గరకు వచ్చి వారి పాదాలు ఆ నీటికి తగలగానే పైనుండి వచ్చే నీళ్లు ఆగిపోయాయి. ఆ నీళ్లు ఆగిపోయి చాలా దూరంలో సారెతాను ప్రక్కన ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఎత్తైన రాశిలా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రమనే అరాబా సముద్రం అంటే మృత సముద్రంలోకి ప్రవహించే నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి. కాబట్టి ప్రజలు యెరికోకు ఎదురుగా నదిని దాటారు. ఇశ్రాయేలీయులంతా పొడినేల మీద యొర్దాను నది దాటే వరకు యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో పొడినేల మీద నిలబడి ఉన్నారు. ఆ విధంగా ఇశ్రాయేలు జనాంగమంతా పొడినేల మీద యొర్దాను నదిని దాటారు.