యెహోషువ 3:1-17

యెహోషువ 3:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఉదయాన్నే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వెళ్లి, దానిని దాటే ముందు అక్కడ బస చేశారు. మూడు రోజుల తర్వాత అధికారులు శిబిరమంతా తిరుగుతూ, ప్రజలకిలా ఆజ్ఞలు జారీ చేశారు: “మీ దేవుడైన యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులు మోయటం మీరు చూసినప్పుడు, మీ స్థలాల నుండి బయలుదేరి దానిని వెంబడించాలి. మీరు వెళ్లే మార్గంలో ఇంతకు ముందు వెళ్లలేదు మీరు దానిని తెలుసుకోవాలి. కాబట్టి మీకు, మందసానికి మధ్య దాదాపు రెండువేల మూరల దూరం ఉండాలి; దాని దగ్గరగా నడవకూడదు.” యెహోషువ ప్రజలతో, “రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేస్తారు, కాబట్టి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి” అని చెప్పాడు. యెహోషువ యాజకులతో, “నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా వెళ్లండి” అన్నాడు. కాబట్టి వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా నడిచారు. యెహోవా యెహోషువతో, “నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉన్నానని ఇశ్రాయేలీయులందరు తెలుసుకునేలా ఈ రోజు వారి కళ్ళెదుట నిన్ను గొప్పవానిగా చేయడం ప్రారంభిస్తాను. నిబంధన మందసాన్ని మోసే యాజకులతో: ‘మీరు యొర్దాను నది నీటి అంచులకు చేరినప్పుడు, వెళ్లి నదిలో నిలబడాలి’ అని నిబంధన మందసాన్ని మోసే యాజకులతో చెప్పు.” యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు, “ఇక్కడకు వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి. ఈ విధంగా సజీవుడైన దేవుడు మీ మధ్య ఉన్నారని, ఆయన కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను మీ ముందు నుండి వెళ్లగొడతారని మీరు తెలుసుకుంటారు. చూడండి, సర్వలోక ప్రభువు యొక్క నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానులోకి వెళ్తుంది. ఇప్పుడు, ఇశ్రాయేలు గోత్రాల్లో ప్రతి గోత్రం నుండి ఒక పురుషుని చొప్పున పన్నెండుమందిని ఎన్నుకోండి. లోకమంతటికి ప్రభువైన యెహోవా మందసాన్ని మోసుకెళ్లే యాజకులు యొర్దానులో అడుగు పెట్టగానే, దిగువకు ప్రవహిస్తున్న ప్రవాహం తెగిపోయి ఒకవైపు రాశిగా నిలబడతాయి.” కాబట్టి యాజకులు ప్రజలకు ముందుగా నిబంధన మందసం మోస్తూ నడుస్తుండగా ప్రజలు వారి శిబిరాల నుండి యొర్దాను దాటడానికి బయలుదేరతారు. కోతకాలమంతా యొర్దాను నది పొంగుతూ ఉంటుంది. మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది దగ్గరకు వచ్చి వారి పాదాలు ఆ నీటికి తగలగానే పైనుండి వచ్చే నీళ్లు ఆగిపోయాయి. ఆ నీళ్లు ఆగిపోయి చాలా దూరంలో సారెతాను ప్రక్కన ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఎత్తైన రాశిలా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రమనే అరాబా సముద్రం అంటే మృత సముద్రంలోకి ప్రవహించే నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి. కాబట్టి ప్రజలు యెరికోకు ఎదురుగా నదిని దాటారు. ఇశ్రాయేలీయులంతా పొడినేల మీద యొర్దాను నది దాటే వరకు యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో పొడినేల మీద నిలబడి ఉన్నారు. ఆ విధంగా ఇశ్రాయేలు జనాంగమంతా పొడినేల మీద యొర్దాను నదిని దాటారు.

యెహోషువ 3:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోషువ వేకువనే లేచి అతడూ ఇశ్రాయేలీయులంతా షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దాన్ని దాటే ముందు అక్కడ బస చేశారు. మూడు రోజుల తరువాత నాయకులు శిబిరంలో తిరుగుతూ ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు, “మీరు మీ యెహోవా దేవుని నిబంధన మందసాన్ని యాజకులుగా ఉన్న లేవీయులు మోసుకుని వెళ్తున్నప్పుడు మీరున్న స్థలం లో నుండి బయలుదేరి దాని వెంటే వెళ్ళాలి. మీకూ దానికీ దాదాపు రెండువేల మూరల దూరం ఉండాలి. ఆ మందసానికి సమీపంగా మీరు నడవకూడదు. ఎందుకంటే మీరు వెళ్ళే దారి మీరింతకు ముందు వెళ్ళింది కాదు, మీరు ఆ దారి గుర్తుపట్టాలి.” యెహోషువ ప్రజలతో “రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి” అన్నాడు. అతడు యాజకులతో “మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడవండి” అని చెప్పాడు. వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడిచారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు. “నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకూ తోడై ఉంటానని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనేలా ఈ రోజు వారి కళ్ళ ముందు నిన్ను గొప్ప వాడిగా చేస్తాను. మీరు యొర్దాను నది దగ్గరికి వచ్చి యొర్దాను నీళ్ళలో నిలబడండని నిబంధన మందసాన్ని మోసే యాజకులకు ఆజ్ఞాపించు.” కాబట్టి యెహోషువ “మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి” అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి, వారితో ఇలా చెప్పాడు. “సర్వలోక నాధుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానుని దాటబోతుంది కాబట్టి జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనీ, ఆయన కచ్చితంగా మీ దగ్గరనుండి కనానీయులనూ హిత్తీయులనూ హివ్వీయులనూ పెరిజ్జీయులనూ గిర్గాషీయులనూ అమోరీయులనూ యెబూసీయులనూ వెళ్ళగొడతాడని దీని వల్ల మీరు తెలుసుకుంటారు. కాబట్టి గోత్రానికి ఒక మనిషి చొప్పున ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి పన్నెండుమంది మనుషులను ఏర్పరచుకోండి. సర్వలోకనాధుడైన యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను తాకగానే యొర్దాను నీళ్లు, అంటే పై నుండి పారే నీళ్లు ఆగి ఏకరాశిగా నిలిచిపోతాయి.” కోతకాలమంతా యొర్దాను దాని గట్లన్నిటి మీదా పొర్లి పారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు ప్రజలకు ముందు వెళ్లగా యొర్దాను దాటడానికి ప్రజలు తమ గుడారాల్లో నుండి బయలుదేరారు. అప్పుడు ఆ మందసాన్ని మోసే యాజకులు యొర్దానులో దిగిన తరువాత వారి కాళ్లు నీటి అంచున మునగగానే పై నుండి పారే నీళ్లు చాలా దూరంగా సారెతాను దగ్గర ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికో దగ్గర ఆవలి తీరం చేరారు. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద యొర్దాను దాటడం అయ్యే వరకూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో ఆరిన నేల మీద నిలబడ్డారు.

యెహోషువ 3:1-17 పవిత్ర బైబిల్ (TERV)

మరునాడు ఉదయం పెందలాడే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ లేచి, షిత్తీము విడిచి పెట్టారు. యొర్దాను నదికి వారు ప్రయాణం చేసారు. నది దాటి అవతలికి వెళ్లకముందు వారు యొర్దాను నది దగ్గర గుడారాలు వేసారు. మూడు రోజుల తర్వాత నాయకులు పాళెమునంతా తిరిగి చూసారు. నాయకులు ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు, “మీ యెహోవా దేవుని ఒడంబడిక పెట్టెను యాజకులు, లేవీయులు మోయటం మీరు చూస్తారు. ఆ సమయంలో మీరు ఉన్న చోటు విడిచి, వాళ్లను వెంబడించాలి. కాని, మరీ సమీపంగా వెంబడి పోకూడదు. ఒక 1,000 గజాలు వారికి వెనుకగా ఉండండి. ఈ మార్గంలో మీరు ఇదివరకు ఎన్నడూ ప్రయాణం చేయలేదు. అందుచేత వారిని వెంబడిస్తే, ఎక్కడికి వెళ్లాల్సిందీ మీకు తెలుస్తుంది” అని వారు చెప్పారు. అప్పుడు యెహోషువ, “మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపు యెహోవా అద్భుత కార్యాలు చేయటానికి మిమ్మల్ని వాడుకొంటాడు” అని ప్రజలతో చెప్పాడు. తర్వాత యెహోషువ, “ఒడంబడిక పెట్టెను తీసుకొని ప్రజలకు ముందుగా నదిని దాటండి” అని యాజకులతో చెప్పాడు. కనుక యాజకులు ఆ పెట్టెను ఎత్తుకొని, ప్రజలకు ముందు మోసుకొనిపోయారు. అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “ఈ వేళ ఇశ్రాయేలీయులందరి దృష్టిలో నిన్ను ఒక గొప్పవానిగా చేస్తాను. నేను మోషేకు తోడుగా ఉన్నట్టే, నీకూ తోడుగా ఉన్నానని అప్పుడు వాళ్లు తెలుసుకొంటారు. యాజకులు ఒడంబడిక పెట్టె మోస్తారు. యాజకులతో ఇలా చెప్పు, ‘యొర్దాను నదీ తీరానికి నడవండి, సరిగ్గా మీరు నీళ్లలో కాలుపెట్టే ముందు ఆగండి.’” అంతట ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు: “రండి, మీ యెహోవా దేవుని మాటలు వినండి. జీవంగల దేవుడు మీతో నిజంగా ఉన్నాడు అనేందుకు ఇదే ఋజువు. నిజంగా ఆయన మీ శత్రువుల్ని ఓడించేస్తాడు అనేందుకు ఇదే ఋజువు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, గెర్గేషీ ప్రజలు, అమోరీ ప్రజలు, యెబూసీ ప్రజలు అందరినీ ఆయన ఈ దేశంనుండి వెళ్ల గొట్టేస్తాడు. ఇదే ఋజువు. మీరు యొర్దాను దాటేటప్పుడు, సర్వలోకాధిపతి ఒడంబడిక పెట్టె మీకు ముందుగా వెళ్తుంది. ఇప్పుడు మీలో 12 మందిని ఏర్పాటు చేయండి. ఇశ్రాయేలీయుల 12 వంశాల్లో ఒక్కోదాని నుండి ఒక్కో వ్యక్తిని ఏర్పాటు చేసుకొనండి. సర్వలోకాధికారి అయిన యెహోవా ఒడంబడిక పెట్టెను యాజకులు మోస్తారు. వారు ఆ పెట్టెను మీకు ముందు యొర్దాను నదిలోనికి మోసుకొని వెళ్తారు. వారు నీళ్లలో ప్రవేశించగానే యొర్దాను నదీ ప్రవాహం నిలిచిపోతుంది. నీరు నిలిచిపోయి, ఆ స్థలానికి వెనుక ఆనకట్ట వేసినట్టు నిలిచిపోతాయి.” యాజకులు ఒడంబడిక పెట్టె మోయగా, ప్రజలుతాము గుడారాలు వేసిన చోటునుండి బయల్దేరారు. ప్రజలు యొర్దాను నది దాటడం ప్రారంభించారు. (కోతకాలంలో యొర్దాను నది దాని గట్లు మీద పొర్లి పారుతుంది. అందుచేత నది పొంగుతూ ఉంది.) పెట్టెను మోస్తున్న యాజకులు నది ఒడ్డుకు వచ్చారు. నీళ్లలో వారు నిలిచిపోయారు. సరిగ్గా అప్పుడే నీరు ప్రవహించటం ఆగిపోయింది. (ఆ స్థలం వెనుక నీళ్లు ఆనకట్ట కట్టినట్టు నిలిచిపోయాయి.) నది పొడవునా ఆదాం వరకు (సారెతాను దగ్గర ఒక ఊరు.) నీరు ఎత్తుగా నిలబడ్డాయి. ప్రజలు యెరికో దగ్గర నది దాటారు. ఆ చోట నేల ఆరిపోయింది. యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను ఆ నది మధ్యవరకు మోసుకొని వెళ్లి, అక్కడ నిలిచిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ యొర్దాను నదిలో ఆరిన నేలమీద నడచి, ఆవలికి దాటేవరకు యాజకులు అక్కడ వేచి ఉన్నారు.

యెహోషువ 3:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరును షిత్తీమునుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి. మూడుదినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి –మీరు మీ దేవుడైన యెహోవా నిబంధనమందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములోనుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను. మీకును దానికిని దాదాపు రెండువేల కొలమూరల యెడముండవలెను. మీరు వెళ్లుత్రోవ మీరింతకుముందుగా వెళ్లి నది కాదు, మీరు దానిని గురుతుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ–రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. –మీరు నిబంధనమందసమును ఎత్తికొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవియ్యగా వారు నిబంధనమందసమును ఎత్తికొని ప్రజలముందర నడచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను– నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను. మీరు యొర్దాను నీళ్లదరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధనమందసమును మోయు యాజకులకు ఆజ్ఞా పించుము. కాబట్టి యెహోషువ–మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో యిట్లనెను–సర్వలోక నాధుని నిబంధనమందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయులను గిర్గాషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసికొందురు. కాబట్టి ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచు కొనుడి. సర్వలోక నాధుడగు యెహోవా నిబంధనమందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును. కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును; నిబంధనమందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలోనుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగినతరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచునమునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో యెదుటను దాటగా యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరు యొర్దానును దాటుట తుద ముట్టువరకు ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి.