యెహోషువ 2:4-13

యెహోషువ 2:4-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అయితే ఆమె ఆ ఇద్దరిని తీసుకెళ్లి దాచిపెట్టి, వారి కోసం వచ్చిన వారితో, “అవును, నా దగ్గరకు మనుష్యులు వచ్చారు, కానీ వారెక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు. చీకటి పడుతుండగా పట్టణ ద్వారం మూసివేసే సమయంలో వారు వెళ్లిపోయారు. వారు ఏ మార్గాన వెళ్లారో నాకు తెలియదు. మీరు త్వరగా వెళ్తే వారిని పట్టుకోవచ్చు” అని చెప్పింది. (కాని నిజానికి ఆమె వారిని మిద్దె మీదికి తీసుకెళ్లి అక్కడ వరుసగా పేర్చి ఉన్న జనపకట్టెల్లో దాచిపెట్టింది.) కాబట్టి రాజు మనుషులు ఆ గూఢచారులను పట్టుకోడానికి యొర్దాను రేవులకు వెళ్లే మార్గంలో వెళ్లారు. వారు బయటకు వెళ్లిన వెంటనే ద్వారం మూసివేశారు. ఆ వేగులవారు రాత్రి పడుకునే ముందు రాహాబు వారున్న మిద్దె మీదికి వెళ్లి, వారితో, “యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు చాలా భయం, ఈ దేశంలో నివసించే వారందరూ మీరంటే భయంతో క్రుంగిపోతున్నారు. మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మీ కోసం ఎర్ర సముద్రపు నీటిని ఎలా ఆరిపోయేలా చేశారో, మీరు పూర్తిగా నాశనం చేసిన యొర్దానుకు తూర్పున ఉన్న ఇద్దరు అమోరీయుల రాజులైన సీహోను, ఓగుల గురించి విన్నాము. ఈ విషయాలు విన్నప్పుడు, మా గుండెలు భయంతో క్రుంగి, మిమ్మల్ని బట్టి ఎవరికి ఏమాత్రం ధైర్యం లేదు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలోను క్రింద భూమి మీద కూడా దేవుడే. “ఇప్పుడు, దయచేసి మీరు నా కుటుంబం మీద దయ చూపిస్తారని యెహోవా మీద ప్రమాణం చేయండి. ఎందుకంటే నేను మీ పట్ల దయ చూపించాను కాబట్టి మీరు నా తల్లిదండ్రుల, నా అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ల, అలాగే వారికి సంబంధించిన వారినందరిని ప్రాణాలతో కాపాడతారని నాకొక నిజమైన సూచన ఇవ్వండి” అని అడిగింది.

యెహోషువ 2:4-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తీసుకెళ్ళి దాచిపెట్టి, ఆ వచ్చిన వారితో “మనుషులు నా దగ్గరికి వచ్చిన మాట నిజమే, వాళ్ళెక్కడ నుండి వచ్చారో నాకు తెలీదు, చీకటి పడేటప్పుడు కోట తలుపులు మూసే వేళ వాళ్ళు బయటికి వెళ్లిపోయారు, వాళ్ళెక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, మీరు వాళ్ళను తొందరగా తరిమితే పట్టుకుంటారు” అని చెప్పింది. అంతకుముందు ఆమె ఆ ఇద్దరినీ తన మిద్దె మీదికి ఎక్కించి దాని మీద రాశివేసి ఉన్న జనపకట్టల్లో వాళ్ళని దాచి పెట్టింది. రాజు పంపిన ఆ మనుషులు యొర్దాను నది దాటే రేవుల వెంబడి వాళ్ళను పట్టుకోవడానికి వెళ్లారు. తరమడానికి వెళ్ళిన మనుషులు బయటికి వెళ్ళగానే కోట తలుపులు మూసేశారు. ఆ గూఢచారులు పడుకొనే ముందు, ఆమె వాళ్ళున్న మిద్దె ఎక్కి వాళ్ళతో ఇలా అంది, “యెహోవా ఈ దేశాన్ని మీకిస్తున్నాడనీ, మీవల్ల మాకు భయం కల్గుతుందనీ నాకు తెలుసు. మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ హడలి పోతారు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రజలం ఎలా ఆరిపోయేలా చేశాడో, యొర్దాను తీరాన ఉన్న సీహోను, ఓగు అనే ఇద్దరు అమోరీయ రాజులకు మీరేమి చేశారో, అంటే మీరు వాళ్ళని ఎలా నిర్మూలం చేశారో ఆ సంగతులన్నీ మేము విన్నాం. వినగానే మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలో, కింద భూమి మీదా దేవుడే. మీ ముందు ఎలాంటి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. కాబట్టి ఇప్పుడు దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి. నేను మీకు ఉపకారం చేసినట్టే మీరూ నా తండ్రి కుటుంబానికి ఉపకారం చేయండి. నా తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ కుటుంబాలన్నిటినీ చావు నుండి రక్షిస్తామని నాకు కచ్చితమైన ఒక ఆనవాలు ఇవ్వండి” అంది.

యెహోషువ 2:4-13 పవిత్ర బైబిల్ (TERV)

ఆ స్త్రీ వాళ్లిద్దర్నీ దాచిపెట్టేసింది. అయితే ఆమె అంది: “ఆ ఇద్దరూ ఇక్కడికి వచ్చిన మాట నిజమే. అయితే వాళ్లు ఎక్కడ్నుండి వచ్చిందీ నాకు తెలియదు. సాయంకాలం, పట్టణ ద్వారాలు మూసివేసే వేళ వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లిందీ నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు త్వరగా వెళ్తే మీరు వాళ్లను పట్టుకోవచ్చేమో.” అయితే నిజానికి వాళ్లను అటక మీద జనుపకట్టెలో దాచిపెట్టింది. కనుక రాజుగారి మనుష్యులు ఇశ్రాయేలు వాళ్లిద్దరి కోసం వెదుక్కుంటూ వెళ్లిపోయారు. యొర్దాను నది రేవుల దగ్గరకు వారు వెళ్లారు. రాజుగారి మనుష్యులు పట్టణం నుండి బయటకు వెళ్లిన ఆ సమయంలోనే పట్టణ ద్వారాలు మూసివేయబడ్డాయి. ఆ ఇద్దరు మనుష్యులూ అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్నారు. అయితే ఆమె అటక పైకి వెళ్లి వాళ్లతో మాట్లాడింది. రాహాబు ఇలా అంది, “ఈ దేశాన్ని యెహోవా మీ ప్రజలకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు భయం. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరంటే భయమే. యెహోవా మీకు సహాయం చేసిన విధానాల్ని గూర్చి విన్నాము గనుక మాకు భయం. మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఆరిపోయేటట్టు ఆయన చేసాడని మేము విన్నాము. అమోరీ రాజులైన సీహోను, ఓగులకు మీరు చేసినదాన్ని గూర్చి కూడ మేము విన్నాము. యొర్దాను నదికి తూర్పున ఉన్న ఆ రాజులను మీరు నాశనం చేసిన సంగతి మేము విన్నాము. ఆ సంగతులు మేము విని చాల భయపడిపోయాము ఇప్పుడు మా వాళ్లెవరికీ మీతో పోరాడే ధైర్యంలేదు. ఎందుచేతనంటే పైన ఆకాశాన్ని క్రింద భూమిని మీ యెహోవా దేవుడే పాలిస్తున్నాడు గనుక. ఇప్పుడు మీరు నాతో ఒడంబడిక చేస్తామని మాట ఇవ్వండి. నేను మీకు సహాయం చేసాను, దయ చూపించాను. కనుక మీరు నా కుటుంబానికి దయ చూపిస్తామని యెహోవా ఎదుట ప్రమాణం చేయండి. ఇలా మీరు చేస్తామని దయచేసి నాకు చెప్పండి. నా తండ్రి, తల్లి, సోదరులు, సోదరీలు, వాళ్లందరి కుటుంబాల్ని, నా కుటుంబాన్ని మీరు బ్రతుకనిస్తామని నాకు మాట ఇవ్వండి. చావునుండి మీరు మమ్మల్ని రక్షిస్తామని ప్రమాణం చేయండి.”

యెహోషువ 2:4-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ స్త్రీ ఆ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి –మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్లిరి, వారెక్కడికిపోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను. ఆ మనుష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి; తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్లినతోడనే గవిని వేయబడెను. ఆ వేగులవారు పండుకొనకమునుపు, ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను. –యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరు గుదును. మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి యున్నవారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయుడనెను.