యెహోషువ 14:10-13

యెహోషువ 14:10-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“యెహోవా వాగ్దానం చేసినట్లుగా, ఆయన మోషేతో ఈ మాట చెప్పినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరిగిన ఈ నలభై అయిదు సంవత్సరాలు నన్ను బ్రతికించారు. ఇప్పుడు నాకు ఎనభై అయిదు సంవత్సరాలు! మోషే నన్ను బయటకు పంపిన రోజు ఎంత బలంగా ఉన్నానో ఈ రోజు కూడా అంతే బలంగా ఉన్నాను; నేను అప్పటిలాగే ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్లడానికి చాలా శక్తివంతంగా ఉన్నాను. ఆ రోజు యెహోవా నాకు వాగ్దానం చేసిన ఈ కొండ సీమను ఇప్పుడు నాకు ఇవ్వండి. అనాకీయులు అక్కడ ఉన్నారని, వారి పట్టణాలు కోటగోడలతో విశాలంగా ఉన్నాయని అప్పుడు నీవే స్వయంగా విన్నావు. అయితే, యెహోవా నాకు సహాయం చేస్తున్నారు, ఆయన చెప్పినట్లుగానే నేను వారిని వెళ్లగొడతాను” అని చెప్పాడు. అప్పుడు యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబును దీవించి అతనికి హెబ్రోనును వారసత్వంగా ఇచ్చాడు.

యెహోషువ 14:10-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదు సంవత్సరాలు ఆయన చెప్పినట్టే నన్ను సజీవంగా కాపాడాడు. ఇదిగో, నాకిప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు. మోషే నన్ను యుద్ధం చేయడానికీ పంపినప్పుడు నాకెంత బలముందో ఈ రోజు కూడా అంత బలం ఉంది. యుద్ధం చేయడానికీ రావడానికీ పోవడానికీ నాకు ఎప్పటిలాగా బలముంది. కాబట్టి ఆ రోజు యెహోవా వాగ్దానం చేసిన ఈ కొండ ప్రదేశాన్ని నాకు ఇవ్వు. ప్రాకారాలు గల గొప్ప పట్టణాల్లో అక్కడ అనాకీయులు ఉన్న సంగతి నీవు విన్నావు. యెహోవా నాకు తోడై ఉంటాడు కాబట్టి ఆయన చెప్పినట్టు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటాను.” యెహోషువ యెఫున్నె కుమారుడు కాలేబును దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు.

యెహోషువ 14:10-13 పవిత్ర బైబిల్ (TERV)

“ఇదిగో చూడు, యెహోవా చేస్తానని చెప్పినట్టే, అప్పటినుండి 45 సంవత్సరాలు ఆయన నన్ను బతికించి ఉంచాడు. ఆ సమయంలో మనం అంతా అరణ్యంలో సంచారం చేసాము. ఇదిగో, ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరాలు. మోషే నన్ను బయటకు పంపించిన నాడు నేను ఎంత బలంగా ఉన్నానో ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాను. అప్పటిలాగే పోరాడేందుకు ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను. కనుక చాలకాలం క్రిందట యెహోవా నాకు వాగ్దానం చేసిన ఆ కొండ చరియను ఇప్పుడు నాకు ఇవ్వు. బలాఢ్యులైన అనాకీ ప్రజలు అక్కడ నివసించినట్టు అప్పట్లో నీవు విన్నావు. మరియు ఆ పట్టణాలు చాల పెద్దవి, మంచి కాపుదలలో ఉన్నవి. కానీ ఇప్పుడు, ఒకవేళ యెహోవా నాతో ఉన్నాడేమో, యెహోవా చెప్పినట్టు నేను ఆ భూమిని తీసుకుంటాను.” యెపున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించాడు. యెహోషువ అతనికి హెబ్రోను పట్టణాన్ని స్వంతంగా ఇచ్చాడు.

యెహోషువ 14:10-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి యున్నాడు; ఇదిగో నేనిప్పుడు ఎనబదియయిదేండ్ల వాడను. మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధముచేయుటకుగాని వచ్చుచు పోవుచునుండుటకుగాని నాకెప్పటియట్లు బల మున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన యీ కొండ ప్రదేశమును నాకు దయచేయుము; అనాకీయులును ప్రాకారముగల గొప్ప పట్టణములును అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండినయెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.