యెహోషువ 1:1-16
యెహోషువ 1:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా తన సేవకుడు మోషే చనిపోయిన తరువాత, నూను కుమారుడు, మోషే పరిచారకుడు అయిన యెహోషువకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. “నా సేవకుడు మోషే చనిపోయాడు. కాబట్టి నీవు లేచి, నీవూ ఈ ప్రజలందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న దేశానికి వెళ్ళండి. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్నీ మీకు ఇచ్చాను. ఈ అరణ్యం, లెబానోను నుండి యూఫ్రటీసు మహానది వరకూ, హిత్తీయుల దేశమంతా, పడమట మహాసముద్రం వరకూ మీకు సరిహద్దు. నీవు జీవించే రోజులన్నిటిలో ఎవ్వరూ నీ ముందు నిలవలేరు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడుగా ఉంటాను. నిన్ను విడిచి పెట్టను, వదిలెయ్యను. నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు. అయితే నీవు నిబ్బరంగా, ధైర్యంగా, అతి జాగ్రత్తగా నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతా శ్రద్ధగా పాటించాలి. నీవు వెళ్ళే ప్రతి చోటా విజయం సాధించేలా నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.” అప్పుడు యెహోషువ ప్రజల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు “మీరు శిబిరంలోకి వెళ్లి ప్రజలతో ఈ మాట చెప్పండి, ‘మీరు స్వంతం చేసుకోడానికి మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోడానికి మూడు రోజుల్లోపు ఈ యొర్దాను నది దాటాలి. కాబట్టి ఆహారం సిద్ధపరచుకోండి.’” రూబేనీయులకు గాదీయులకు మనష్షే అర్థగోత్రపువారికి యెహోషువ ఇలా ఆజ్ఞాపించాడు, “యెహోవా సేవకుడు మోషే మీ కు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. అదేమంటే, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలిగించబోతున్నాడు, ఆయన ఈ దేశాన్ని మీకిస్తాడు. మీ భార్యలూ మీ పిల్లలూ మీ పశువులూ యొర్దాను అవతల మోషే మీకిచ్చిన దేశంలో నివసించాలి. అయితే పరాక్రమ వంతులు, శూరులైన మీరంతా యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకూ విశ్రాంతి దయచేసే వరకూ, అంటే మీ దేవుడైన యెహోవా వారికిచ్చే దేశాన్ని స్వాధీనపరచుకొనే వరకూ మీరూ సహాయం చేయాలి. ఆ తరువాతే తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడు మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశంలోకి మీరు తిరిగి వచ్చి దాన్ని స్వంతం చేసుకుంటారు.” దానికి వారు “నీవు మా కాజ్ఞాపించినదంతా చేస్తాం. నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపినా అక్కడికి వెళ్తాం.
యెహోషువ 1:1-16 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా సేవకుడు మోషే. నూను కుమారుడైన యెహోషువ, మోషేకు సహాయకుడు. మోషే చనిపోయాక యెహోషువతో యెహోవా మాట్లాడాడు. యెహోషువతో యెహోవా అన్నాడు: “నా సేవకుడు మోషే మరణించాడు. ఇప్పుడు నీవు, ఈ ప్రజలు వెళ్లి, యొర్దాను నది దాటండి. ఇశ్రాయేలు ప్రజలైన మీకు నేను ఇస్తున్న దేశంలోకి మీరు వెళ్లాలి. ఈ దేశాన్ని నేను మీకు ఇస్తానని మోషేకు వాగ్దానం చేసాను. కనుక మీరు వెళ్లే ప్రతి చోటునూ నేను మీకు ఇస్తాను. హిత్తీ ప్రజల దేశం అంతా, అంటే ఎడారి, లెబానోను మొదలుకొని మహానది (యూఫ్రటీసు) వరకునున్న దేశమంతా మీదే. మరియు ఇక్కడ నుండి పశ్చిమాన (అది సూర్యాస్తమయ దిశ) మధ్యధరా సముద్రం వరకు మీ సరిహద్దు. నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా వుంటాను. నీ జీవితాంతం నిన్నెవ్వరూ అడ్డగించలేరు. నేను నిన్ను విడిచి పెట్టను. ఎన్నటికీ నిన్ను నేను ఎడబాయను. “యెహోషువా, నీవు బలంగా, ధైర్యంగా ఉండాలి! ఈ ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగేటట్టు నీవు ఈ ప్రజలను నడిపించాల్సి ఉంటుంది. వారి పితరులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశం ఇది. అయితే నీవు మరో విషయంలో కూడ బలంగా, ధైర్యంగా ఉండాలి. నా సేవకుడు మోషే నీకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించే విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. అతని ప్రబోధాలను నీవు సరిగ్గా పాటిస్తే, నీవు చేసే ప్రతి పనిలోనూ నీకు విజయం కలుగుతుంది. ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఆ గ్రంథాన్ని రాత్రి, పగలు ధ్యానించు. అప్పుడు అందులో వ్రాయబడిన విషయాలను పాటించగలుగుతావు. నీవు ఇలా చేస్తే, నీవు చేసే ప్రతీదీ తెలివిగా, విజయవంతంగా చేయగలుగుతావు. నీవు బలంగా ధైర్యంగా ఉండాలని నేను ఆజ్ఞాపించినట్టు జ్ఞాపకం ఉంచుకో. అందుచేత భయపడవద్దు. ఎందుచేతనంటే, నీవు వెళ్లే ప్రతిచోటా నీ యెహోవా దేవుడు నీకు తోడుగా ఉంటాడు గనుక.” కనుక యెహోషువ ప్రజానాయకులకు ఆదేశాలు ఇచ్చాడు. అతడు చెప్పాడు: “గుడారాల్లోనికి వెళ్లి ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పండి. ప్రజలతో ఇలా చెప్పండి, ‘భోజనం తయారు చేసుకోండి. మూడు రోజుల్లో మనం యొర్దాను నది దాటాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మనం వెళ్లి తీసుకొందాము.’” తర్వాత రూబేను, గాదు, మనష్షే వంశంలో సగభాగం వారితో యెహోషువ మాట్లాడాడు. యెహోషువ చెప్పాడు: “యెహోవా సేవకుడు మోషే మీతో ఏమి చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. మీకు విశ్రాంతి కోసం మీ దేవుడైన యెహోవా మీకు ఒక స్థలం ఇస్తాడు అని అతడు చెప్పాడు. ఆ దేశాన్ని యెహోవా మీకు యిస్తాడు. ఇప్పుడు యొర్దాను నదికి తూర్పున ఉన్న ఈ దేశాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు ఈ దేశంలో నివసించవచ్చు. అయితే యుద్ధం చేసే మీ పురుషులంతా మీ సోదరులతో కలిసి యొర్దాను నది దాటాలి. మీరు యుద్ధానికి సిద్ధపడి మీ సోదరులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు సహాయపడాలి. విశ్రాంతి కోసం యెహోవా మీకు ఒక స్థలం ఇచ్చాడు. మీ సోదరుల కోసం కూడా యెహోవా అలాగే చేస్తాడు. అయితే యెహోవా దేవుడు వారికి ఇస్తున్న దేశాన్ని మీ సోదరులు స్వాధీనం చేసుకొనేంతవరకు మీ సోదరులకు మీరు సహాయం చేయాలి. అప్పుడు యొర్దానుకు తూర్పున ఉన్న మీ దేశానికి మీరు వెళ్లిపోవచ్చు. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం అది.” అప్పుడు ప్రజలు యెహోషువాకు బదులు చెప్పారు: “మమ్మల్ని ఏమి చేయమని నీవు ఆజ్ఞాపిస్తే, మేము అలా చేస్తాము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్తాము.
యెహోషువ 1:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను–నా సేవకుడైన మోషే మృతినొందెను. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదియైన యూఫ్రటీసు నదివరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహా సముద్రమువరకును మీకు సరిహద్దు. నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెను–మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి –మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై మూడుదినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని యెహోషువ యీలాగు ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోషే మీ కాజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసికొనుడి; ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు; ఆయన ఈ దేశమును మీకిచ్చును. మీ భార్యలును మీ పిల్లలును మీ ఆస్తియు యొర్దాను ఇవతల మోషే మీకిచ్చిన యీ దేశమున నివసింపవలెనుగాని, పరాక్రమవంతులును శూరులునైన మీరందరు యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయువరకు, అనగా మీ దేవుడైన యెహోవావారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొనువరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచుకొందురు. అందుకు వారు–నీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసెదము, నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము
యెహోషువ 1:1-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత యెహోవా నూను కుమారుడు, మోషే సహాయకుడైన యెహోషువతో ఇలా అన్నారు: “నా సేవకుడైన మోషే చనిపోయాడు. కాబట్టి నీవు, నీతో పాటు ఈ ప్రజలందరూ బయలుదేరి యొర్దాను నదిని దాటి, నేను ఇశ్రాయేలీయులకు ఇవ్వబోతున్న దేశానికి వెళ్లడానికి సిద్ధపడండి. నేను మోషేకు వాగ్దానం చేసినట్లు, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకిస్తాను. మీ భూభాగం ఎడారి నుండి లెబానోను వరకు యూఫ్రటీసు అనే గొప్ప నది నుండి హిత్తీయుల దేశం అంతా, పశ్చిమాన మధ్యధరా సముద్రం వరకు విస్తరిస్తుంది. నీ జీవితకాలమంతా ఎవ్వరూ నీకు వ్యతిరేకంగా నీ ముందు నిలబడలేరు, నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉంటాను; నేను నిన్ను విడువను ఎడబాయను. దృఢంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను వారసత్వంగా ఇస్తానని వారి పూర్వికులతో ప్రమాణం చేసిన దేశానికి నీవు వారిని నడిపిస్తావు. “నీవు నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమంతటిని జాగ్రత్తగా పాటించాలి, నీవు వెళ్లే ప్రతి మార్గంలో నీవు విజయం పొందేలా దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగవద్దు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఎప్పుడు నీ పెదాల మీద ఉండాలి; పగలు రాత్రి దానిని ధ్యానించాలి, తద్వార నీవు దానిలో వ్రాయబడి ఉన్న ప్రతిదీ శ్రద్ధగా చేయగలవు. అప్పుడు నీవు విజయవంతంగా వర్ధిల్లుతావు. బలంగా ధైర్యంగా ఉండమని నేను నీకు ఆజ్ఞాపించలేదా? భయపడవద్దు; నిరుత్సాహపడవద్దు; ఎందుకంటే నీవు ఎక్కడికి వెళ్లినా నీ దేవుడైన యెహోవా నీతో ఉంటారు.” కాబట్టి యెహోషువ ప్రజల అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు శిబిరం గుండా వెళ్తూ ప్రజలతో, ‘మీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోడానికి మీరు మూడు రోజుల్లో యొర్దాను నదిని దాటాలి కాబట్టి భోజన ఏర్పాట్లు చేసుకోండి’ అని చెప్పండి.” అయితే రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రానికి, యెహోషువ ఇలా చెప్పాడు, “యెహోవా సేవకుడైన మోషే, ‘మీ దేవుడైన యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చి మీకు విశ్రాంతిని ఇస్తాడు’ అని మీకిచ్చిన ఆజ్ఞను జ్ఞాపకముంచుకోండి. మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు యొర్దానుకు తూర్పున మోషే మీకిచ్చిన ప్రదేశంలో ఉండవచ్చు, అయితే యుద్ధానికి సిద్ధంగా ఉన్న మీ పోరాట పురుషులంతా, మీ తోటి ఇశ్రాయేలీయులకంటె ముందుగా దాటాలి. యెహోవా మీకు సహాయం చేసినట్టు, ఆయన వారికి విశ్రాంతినిచ్చే వరకు, వారు కూడా మీ దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకునే వరకు, మీరు కూడా వారికి సహాయం చేయాలి. ఆ తర్వాత, మీరు తిరిగివెళ్లి, యెహోవా సేవకుడైన మోషే యొర్దానుకు తూర్పున సూర్యోదయం వైపున మీకిచ్చిన మీ స్వాస్థ్యాన్ని మీరు ఆక్రమించుకోవచ్చు.” అప్పుడు వారు యెహోషువకు ఇలా జవాబిచ్చారు, “నీవు మాకాజ్ఞాపించినదంతా మేము చేస్తాము. మమ్మల్ని ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తాము.