యోనా 2:1-10

యోనా 2:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ మత్స్యము కడుపులోనుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. –నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసి యున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి. నీ సన్నిధిలోనుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాల యముతట్టు మరల చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపు నాచు నా తలకుచుట్టుకొని యున్నది. నేను మరెన్న టికిని ఎక్కిరాకుండ భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను, నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములోనుండి పైకి రప్పించియున్నావు. కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసికొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులనర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కివేసెను.

షేర్ చేయి
Read యోనా 2

యోనా 2:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ చేప కడుపులోనుంచి యోనా యెహోవాకు ఇలా ప్రార్థించాడు, “నా ఆపదలో నేను యెహోవాకు మొర్రపెట్టాను. ఆయన నాకు జవాబిచ్చాడు. మృత్యులోకం నుంచి నేను కేకలు వేస్తే నువ్వు నా స్వరం విన్నావు. నువ్వు నన్ను అగాధంలో, సముద్రగర్భంలో పడవేశావు. ప్రవాహాలు నన్ను చుట్టుకున్నాయి. నీ అలలూ తరంగాలూ నా మీదుగా వెళ్తున్నాయి. నీ సన్నిధినుంచి నన్ను తరిమి వేసినా, నీ పరిశుద్ధాలయం వైపు మళ్ళీ చూస్తాను అనుకున్నాను. నీళ్ళు నన్ను చుట్టుకోవడంతో నేను కొనప్రాణంతో ఉన్నాను. సముద్రాగాధం నన్ను ఆవరించి ఉంది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది. నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు నన్ను మూసివేశాయి. పర్వతాల పునాదుల్లోకి నేను దిగిపోయాను. నా దేవా, యెహోవా, నువ్వు నా జీవాన్ని అగాధంలో నుంచి పైకి రప్పించావు. నా ప్రాణం నాలో కృశిస్తూ ఉంటే నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను. నీ పరిశుద్ధాలయంలోకి నీదగ్గరికి నా ప్రార్థన చేరింది. వ్యర్థమైన విగ్రహ దేవుళ్ళ మీద లక్ష్యం ఉంచేవాళ్ళు తమ కొరకైన నీ విశ్వాస్యతను నిరాకరిస్తున్నారు. నా మట్టుకు నేను కృతజ్ఞతాస్తుతులతో నీకు బలి సమర్పిస్తాను. నేను మొక్కుకున్న దాన్ని తప్పక నెరవేరుస్తాను. యెహోవా దగ్గరే రక్షణ దొరుకుతుంది.” అప్పుడు యెహోవా చేపకు ఆజ్ఞాపించగానే అది యోనాను పొడి నేల మీద కక్కి వేసింది.

షేర్ చేయి
Read యోనా 2

యోనా 2:1-10 పవిత్ర బైబిల్ (TERV)

చేప కడుపులో ఉన్నంతకాలం యోనా తన దేవుడైన యెహోవాను ప్రార్థించాడు. యోనా ఇలా అన్నాడు: “నేను తీవ్రమైన కష్టంలో ఉన్నాను. నేను యెహోవా సహాయం అర్థించాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు! నేను పాతాళపు లోతుల్లో ఉన్నాను. యెహోవా, నేను నీకు మొరపెట్టుకొనగా నీవు నా మొరాలకించావు! “నీవు నన్ను సముద్రంలోకి విసరివేశావు. తీవ్రమైన నీ అలలు నన్ను ముంచెత్తాయి. నేనీ అగాధ సముద్రం లోతులదాకా పోయాను. నా చుట్టూ జల ప్రళయం. ‘ఇక నేను చూడలేని స్థలానికి తోయబడ్డాను’ అని అనుకున్నాను. కాని సహాయం కొరకు నేను నీ పవిత్ర ఆలయం వైపు చూస్తూనే ఉన్నాను. “సముద్రజలం నన్ను ముంచివేసింది. నీరు నా నోటిని మూసివేసింది, నేను శ్వాస పీల్చుకోలేకుండా ఉన్నాను. ఈ సముద్రపు లోతులలోకి నేను వెళ్లాను. సముద్రపు మొక్కలు నా తలకు చుట్టుకున్నాయి. పర్వతాల పునాదులున్న చోట, సముద్రపు అట్టడుగున నేను ఉన్నాను. ఈ చెరలో నేను శాశ్వతంగా మూయబడి ఉన్నాననుకున్నాను. కానీ నా దేవుడైన యెహోవా నన్ను నా సమాధినుండి బయటకు లేపాడు! ఓ నా దేవా, నీవు నాకు మళ్లీ ప్రాణం పోశావు! “నా ఆత్మ నిరాశ చెందింది, అప్పుడు నేను యెహోవాను తలచుకొన్నాను. యెహోవా, నిన్ను నేను ప్రార్థించాను. నీ పవిత్రాలయంలో నీవు నా ప్రార్థనలు విన్నావు. “కొంతమంది ప్రజలు పనికిరాని విగ్రహాలను పూజిస్తారు. కానీ ఆ విగ్రహాలు వారికి ఎన్నడూ సహాయం చేయలేవు. యెహోవానుండి మాత్రమే రక్షణ లభిస్తుంది! యెహోవా, నీకు నేను బలులు అర్పిస్తాను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీకు నేను ప్రత్యేక మొక్కులు మొక్కుతాను. నా మొక్కుబడులు నేను చెల్లిస్తాను.” అప్పుడు యెహోవా చేపతో మాట్లాడాడు. తరువాత ఆ చేప తన కడుపులో ఉన్న యోనాను పొడిగా ఉన్న నేలమీదకు కక్కివేసింది.

షేర్ చేయి
Read యోనా 2

యోనా 2:1-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

చేప కడుపులో నుండి యోనా తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. అతడు ఇలా ప్రార్థించాడు: “నా ఆపదలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు జవాబిచ్చారు. మృత్యులోకంలో ఉండి సహాయం కోసం అడిగాను, మీరు నా మొర విన్నారు. మీరు నన్ను అగాధంలో సముద్ర గర్భంలో పడవేశారు. ప్రవాహాలు నన్ను ఆవరించాయి, మీ అలలు, తరంగాలు నన్ను ముంచి వేశాయి. ‘నేను మీ సన్నిధి నుండి నన్ను తరిమివేసినా మరలా నేను పరిశుద్ధ ఆలయం వైపు తిరిగి చూస్తాను’ అనుకున్నాను. ముంచివేసే నీళ్లు నన్ను భయపెట్టాయి, అగాధం నన్ను ఆవరించింది; సముద్రంలో ఉన్న నాచు నా తలకు చుట్టుకుంది. పర్వతాల పునాదుల వరకు నేను మునిగాను, క్రిందున్న భూమి గడియలు నన్ను శాశ్వతంగా బంధించాయి. అయితే నా దేవా! యెహోవా, మీరు నా ప్రాణాన్ని గోతిలో నుండి పైకి తీసుకువచ్చారు. “నా ప్రాణం క్షీణిస్తూ ఉంటే, యెహోవా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. నా ప్రార్థన మీ దగ్గరకు వచ్చింది, మీ పరిశుద్ధ ఆలయానికి చేరింది. “విలువలేని విగ్రహాలను పూజించేవారు, తమ పట్ల దేవునికున్న ప్రేమకు దూరమవుతారు. నేనైతే కృతజ్ఞత స్తుతులు చేస్తూ మీకు బలి అర్పిస్తాను. నేను చేసిన మ్రొక్కుబడి చెల్లిస్తాను, ‘రక్షణ యెహోవా నుండి వస్తుంది’ అని అంటాను.” యెహోవా ఆ చేపకు ఆజ్ఞాపించగా అది యోనాను పొడినేల మీద కక్కివేసింది.

షేర్ చేయి
Read యోనా 2