యోనా 1:4-6
యోనా 1:4-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, –ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను.
యోనా 1:4-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది. అప్పుడు ఆ ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కడూ తన దేవునికి మొర్రపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి అందులో ఉన్న సరకులను సముద్రంలో పారేశారు. అయితే యోనా ఓడ లోపలి భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రపోతున్నాడు. అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి “నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు! ఒకవేళ నీ దేవుడు మనలను గమనించి మనం నాశనం కాకుండా చూస్తాడేమో” అన్నాడు.
యోనా 1:4-6 పవిత్ర బైబిల్ (TERV)
కాని యెహోవా సముద్రంలో పెనుతుఫాను లేవదీశాడు. గాలివల్ల సముద్రం అల్లకల్లోలంగా అయింది. తుఫాను తీవ్రంగా రేగింది. ఓడ పగిలిపోవటానికి సిధ్ధమైంది. ఓడ మునగకుండా అందులో ఉన్నవారు దానిని తేలిక చేయదల్చారు. అందుచేత వారు సరుకును సముద్రంలో పారవేయడం మొదలుపెట్టారు. నావికులు చాలా భయపడ్డారు. ఓడలోనున్న ప్రతీవాడు తన దేవుని ప్రార్థించసాగాడు. యోనా మాత్రం పడుకోటానికి ఓడ క్రింది భాగంలోకి వెళ్లాడు. యోనా నిద్రపోతూ ఉన్నాడు. ఓడ అధికారి యోనాను చూసి ఇలా అన్నాడు: “నిద్రలే! నీవు ఎందుకు నిద్రపోతున్నావు? నీ దేవుణ్ణి ప్రార్థించు! బహుశః నీ దైవం నీ ప్రార్థన ఆలకించి మనల్ని రక్షించవచ్చు.”
యోనా 1:4-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు యెహోవా సముద్రం మీద పెనుగాలిని పంపగా బలమైన తుఫాను లేచింది, అది ఓడను బద్దలు చేసేంత భయంకరంగా ఉంది. ఆ నావికులందరు భయపడ్డారు, ప్రతివాడు తన దేవునికి మొరపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి దానిలో ఉన్న సరుకులు సముద్రంలో పారవేశారు. అయితే యోనా ఓడ దిగువ భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రలోకి వెళ్లాడు. ఓడ నాయకుడు అతని దగ్గరకు వెళ్లి, “నీవు ఎలా పడుకోగలుగుతున్నావు? లేచి నీ దేవునికి మొరపెట్టు! ఒకవేళ ఆయన మనల్ని గమనించి మనం నశించకుండా చేస్తారేమో” అని అన్నాడు.