యోనా 1:1-4
యోనా 1:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా వాక్కు అమిత్తయి కొడుకు యోనాకు ప్రత్యక్షమై ఇలా తెలియజేశాడు. “నువ్వు లేచి నీనెవె మహాపట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం నా దృష్టికి ఘోరంగా ఉంది.” కానీ యోనా యెహోవా సన్నిధినుంచి పారిపోయి తర్షీషు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. యొప్పేకు వెళ్లి తర్షీషుకు వెళ్ళే ఒక ఓడ చూశాడు. ప్రయాణానికి డబ్బులిచ్చి, యెహోవా సన్నిధినుంచి దూరంగా తర్షీషు వెళ్లి పోవడానికి ఆ ఓడ ఎక్కాడు. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది.
యోనా 1:1-4 పవిత్ర బైబిల్ (TERV)
అమిత్తయి కుమారుడైన యోనాతో యోహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా అన్నాడు: “నీనెవె ఒక మహానగరం. అక్కడి ప్రజలు చేస్తున్న అనేక నీచ కార్యాలను గురించి నేను విన్నాను. కనుక నీవు ఆ నగరానికి వెళ్లి, వారు చేసే చెడు పనులు మానుకోమని చెప్పు.” దేవుని సలహా యోనా పాటించదలచలేదు. కనుక యెహోవాకు దూరంగా యోనా పారిపోవటానికి ప్రయత్నించాడు. యోనా యొప్పే పట్టణానికి వెళ్లాడు. బహుదూరానగల తర్షీషు నగరానికి వెళ్లే ఒక ఓడను యోనా చూశాడు. యోనా తన ప్రయాణానికయ్యే ఖర్చు చెల్లించి ఓడలోనికి వెళ్లాడు. తర్షీషుకు వెళ్లే ఈ ఓడలోనున్న జనంతో కలిసి యోనా ప్రయాణం చేసి, యెహోవాకు దూరంగా పారిపోదలిచాడు. కాని యెహోవా సముద్రంలో పెనుతుఫాను లేవదీశాడు. గాలివల్ల సముద్రం అల్లకల్లోలంగా అయింది. తుఫాను తీవ్రంగా రేగింది. ఓడ పగిలిపోవటానికి సిధ్ధమైంది.
యోనా 1:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. –నీనెవెపట్ట ణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్ని ధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.
యోనా 1:1-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు వచ్చింది: “నీవు లేచి నీనెవె మహా పట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటించు, ఎందుకంటే దాని చెడుతనం నా దృష్టిలో ఘోరంగా ఉంది.” అయితే యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోదామని తర్షీషు వైపు వెళ్లాడు. అతడు యొప్పేకు వెళ్లి అక్కడ తర్షీషుకు వెళ్లే ఓడను చూశాడు. అతడు డబ్బు చెల్లించి, యెహోవా నుండి పారిపోవడానికి ఓడ ఎక్కి తర్షీషుకు ప్రయాణమయ్యాడు. అప్పుడు యెహోవా సముద్రం మీద పెనుగాలిని పంపగా బలమైన తుఫాను లేచింది, అది ఓడను బద్దలు చేసేంత భయంకరంగా ఉంది.