యోబు 42:1-17
యోబు 42:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు యోబు యెహోవాకు ఇలా సమాధానం ఇచ్చాడు: “నీవు సమస్తం చేయగలవని నాకు తెలుసు; నీ ఉద్దేశాలలో ఏది నిష్ఫలం కాదు. ‘తెలివిలేని మాటలతో నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు? అని నీవడిగావు.’ అవును, అర్థం చేసుకోలేని విషయాల గురించి నేను మాట్లాడాను. అవి నా బుద్ధికి మించినవి నేను గ్రహించలేనివి. “మీరు అన్నారు, ‘నేను మాట్లాడతాను, నీవు విను; నేను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబివ్వాలి.’ గతంలో నా చెవులు మీ గురించి విన్నాయి కాని ఇప్పుడైతే నా కళ్లు మిమ్మల్ని చూశాయి. కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని దుమ్ములో బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నాను.” యెహోవా యోబుతో ఈ విషయాలు చెప్పిన తర్వాత, ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో, “నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి సత్యాలను మాట్లాడలేదు. కాబట్టి నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను. కాబట్టి మీరంతా ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసుకుని, నా సేవకుడైన యోబు దగ్గరకు వెళ్లి మీ కోసం దహనబలిని అర్పించాలి. నా సేవకుడైన యోబు మీ కోసం ప్రార్థన చేస్తాడు, నేను అతని ప్రార్థన అంగీకరించి మీ అవివేకాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించను” అన్నారు. నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి సత్యాలను మాట్లాడలేదు. కాబట్టి తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశారు; అప్పుడు యెహోవా యోబు ప్రార్థన అంగీకరించారు. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించిన తర్వాత యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళీ అతనికి ఇచ్చారు. అతనికి గతంలో ఉన్నదానికన్నా రెండింతలు అధికంగా ఇచ్చారు. అప్పుడు అతని సోదరీ సోదరులందరు, గతంలో అతనికి పరిచయం ఉన్న ప్రతిఒక్కరు వచ్చి అతని ఇంట్లో అతనితో కలిసి భోజనం చేశారు. యెహోవా అతని మీదికి రప్పించిన బాధ గురించి వారు దుఃఖపడి అతన్ని ఓదార్చారు. అంతేకాక ఒక్కొక్కరు ఒక వెండి నాణాన్ని, ఒక బంగారు ఉంగరాన్ని అతనికి ఇచ్చారు. యెహోవా యోబు జీవితాన్ని గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఆశీర్వదించారు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లు, 1,000 ఆడగాడిదలు ఉన్నాయి. అలాగే అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు పుట్టారు. యోబు పెద్దకుమార్తెకు యెమీమా అని రెండవ కుమార్తెకు కెజీయా అని మూడవ కుమార్తెకు కెరెంహప్పుకు అని పేర్లు పెట్టాడు. దేశమంతటిలో యోబు కుమార్తెలంత అందమైనవారు ఎవరూ లేరు. వారి తండ్రి వారి అన్నదమ్ములతో పాటు వారికి కూడా వారసత్వాన్ని పంచి ఇచ్చాడు. దీని తర్వాత, యోబు నూట నలభై సంవత్సరాలు జీవించాడు. అతడు తన కుమారులను వారి కుమారులను నాలుగు తరాల వరకు చూశాడు. చివరికి యోబు సంవత్సరాలు నిండి పండు ముసలివాడై చనిపోయాడు.
యోబు 42:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు. నువ్వు సమస్త క్రియలను చేయగలవనీ నువ్వు ఉద్దేశించినది ఏదీ నిష్ఫలం కానేరదనీ నేనిప్పుడు తెలుసుకున్నాను. “జ్ఞానం లేని మాటలతో ఆలోచనను నిరర్థకం చేసే వీడెవడు?” అలా వివేచన లేక ఏమీ తెలియక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను. నువ్వు అన్నావు. “నేను మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి నా మాట ఆలకించు. ఒక సంగతి నిన్ను అడుగుతాను. దాన్ని నాకు తెలియజెప్పు.” నిన్ను గూర్చిన విషయాలు నేను విన్నాను. అయితే ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను. కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని, ధూళిలో, బూడిదెలో, పడి పశ్చాత్తాపపడుతున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడు ఎలీఫజుతో ఇలా చెప్పాడు. “నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కాబట్టి నా కోపం నీ మీదా నీ ఇద్దరు స్నేహితుల మీదా మండుతున్నది. కాబట్టి ఏడు ఎద్దులను ఏడు పొట్టేళ్లను తీసుకుని, నా సేవకుడు యోబు దగ్గరికి పోయి మీ నిమిత్తం దహనబలి అర్పించాలి. అప్పుడు నా సేవకుడు యోబు మీ పక్షంగా ప్రార్థన చేస్తాడు. మీ అవివేకాన్ని బట్టి నేను మిమ్మల్ని శిక్షించకుండా నేను అతని ప్రార్థన మాత్రం అంగీకరిస్తాను. ఎందుకంటే నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలక లేదు.” తేమానీయుడు ఎలీఫజు, షూహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు. యెహోవా వారి పక్షాన యోబును అంగీకరించాడు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళీ అతనికి దయచేశాడు. యోబుకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు. అప్పుడు అతని అన్నదమ్ములు, అతని అక్క చెల్లెళ్ళు అంతకుముందు అతనికి పరిచయం ఉన్న వారంతా వచ్చి, అతనితో కలిసి అతని ఇంట్లో భోజనాలు చేశారు. యెహోవా అతని మీదికి రప్పించిన బాధలన్నిటి గూర్చి ఎంత కష్టాల పాలయ్యావు అంటూ అతని కోసం దుఃఖిస్తూ అతణ్ణి ఓదార్చారు. అంతేగాక ఒక్కొక్కడు ఒక వెండి నాణెం, బంగారు ఉంగరం అతనికి ఇచ్చారు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి ఎక్కువగా ఆశీర్వదించాడు. అతనికి పద్నాలుగు వేల గొర్రెలు, ఆరు వేల ఒంటెలు, వెయ్యి జతల ఎడ్లు, వెయ్యి ఆడగాడిదలు ఉన్నాయి. అతనికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు పుట్టారు. అతడు పెద్ద కూతురికి ఎమీమా అనీ రెండవ కూతురికి కెజీయా అనీ మూడవ కూతురికి కెరెన్ హపుక్ అనీ పేర్లు పెట్టాడు. ఆ దేశమంతటా యోబు కుమార్తెలంత లావణ్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి అన్నదమ్ములతో పాటు వారికి వారసత్వాలు ఇచ్చాడు. ఆ పైన యోబు నూట నలభై సంవత్సరాలు బతికి, తన కొడుకులను, మనవళ్ళను నాలుగు తరాల వరకూ చూశాడు. తరువాత యోబు కాలం నిండిన వృద్ధుడై తనువు చాలించాడు.
యోబు 42:1-17 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు యెహోవాకు యోబు ఇలా జవాబు చెప్పాడు. “యెహోవా, నీవు అన్నీ చేయగలవని నాకు తెలుసు. నీవు పథకాలు వేస్తావు, నీ పథకాల్లో ఏదీ మార్చబడజాలదు, నిలిపివేయబడదు. ‘నా సలహాను గూర్చి ఈ వెర్రి ప్రశ్నలు అడుగుతున్న ఇతడు ఎవరు?’ అని యెహోవా, నీవు ప్రశ్నించావు. నేను (యోబును) నాకు అర్థం కాని విషయాలు యెహోవాని అడిగాను. నేను తెలిసికోలేనంత మరీ విపరీతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలను గూర్చి నేను మాట్లాడాను. “యెహోవా, ‘నీవు నాతో యోబూ, నేను నీతో మాట్లాడుతాను. నేను నిన్ను ప్రశ్నలు అడుగుతాను. నీవు నాకు జవాబు ఇవ్వాలి’ అన్నావు. యెహోవా, ఇదివరకు నిన్ను గూర్చి నేను విన్నాను. కానీ ఇప్పుడు నా స్వంత కళ్లతో నేను నిన్ను చూశాను. కనుక ఇప్పుడు, నన్ను గూర్చి నేను సిగ్గుపడుతున్నాను. యెహోవా, నేను విచారిస్తున్నాను. నేను ఈ ధూళిలో, బూడిదలో కూర్చొని ఉండగానే నేను నా జీవితం, నా హృదయం మార్చుకొంటానని వాగ్దానం చేస్తున్నాను.” యెహోవా యోబుతో మాట్లాడటం చాలించిన తర్వాత, ఆయన ఎలీఫజుతో మాట్లాడినాడు. ఎలీఫజు తేమాను పట్టణస్థుడు. ఎలీఫజుతో యెహోవా ఇలా చెప్పాడు: “నీ మీద, నీ యిద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను. ఎందుకంటే మీరు నన్ను గూర్చి సరిగా చెప్పలేదు. కానీ యోబు నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పాడు. యోబు నా సేవకుడు. కనుక ఎలీఫజూ ఇప్పుడు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను నీవే తీసుకో. వాటిని నా సేవకుడు యోబు దగ్గరకు తీసుకొని వెళ్లి, మీ నిమిత్తం దహనబలిగా వాటిని అర్పించండి. నా సేవకుడు యోబు మీ కోసం ప్రార్థిస్తాడు. అప్పుడు నేను అతని ప్రార్థనకు తప్పక జవాబు ఇస్తాను. అప్పుడు మీరు శిక్షించబడాల్సిన విధంగా నేను మిమ్మల్ని శిక్షించను. మీరు చాలా అవివేకంగా ఉన్నారు గనుక మీరు శిక్షించబడాలి. మీరు నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పలేదు. కానీ నా సేవకుడు యోబు, నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పాడు.” కనుక తేమానువాడగు ఎలీఫజు, షూహి దేశస్థుడైన బిల్దదు, నయమాతీ పట్టణస్థుడైన జోఫరు యెహోవాకు విధేయులయ్యారు. అప్పుడు యెహోవా చెప్పినట్లు వాళ్లు చేశారు. అప్పుడు యెహోవా యోబు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. కనుక యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించటం ముగించాడు. అప్పుడు యెహోవా యోబుకు మరల విజయం ఇచ్చాడు. యోబుకు అంతకు ముందు ఉన్నదానికి రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. యోబు సోదరులు, ఆడపడుచులు అందరూ తిరిగి యోబు ఇంటికి వచ్చారు. అంతకు ముందు యోబును ఎరిగిన ప్రతి ఒక్కరూ అతని ఇంటికి వచ్చారు. వాళ్లంతా యోబుతో కలిసి విందు భోజనం చేశారు. యోబుకు యెహోవా చాలా కష్టం కలిగించాడు గనుక వాళ్లంతా అతనిని ఓదార్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెండి నాణెం, ఒక బంగారు ఉంగరం యోబుకు ఇచ్చారు. యోబు జీవితంలో మొదటి భాగం కంటే రెండో భాగాన్ని యెహోవా అధికంగా ఆశీర్వదించాడు. పద్నాలుగు వేల గొర్రెలు, ఆరు వేల ఒంటెలు, రెండు వేల ఆవులు, వెయ్యి ఆడ గాడిదలు యోబుకు స్వంతంగా యిచ్చాడు. యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు మరల కలిగారు. యోబు మొదటి కుమార్తెరైకు యెమీమా అని పేరు పెట్టాడు. యోబు రెండో కుమార్తెకు కెజీయా అని పేరు పెట్టాడు. యోబు మూడో కుమార్తెకు కెరెంహప్పుకు అని పేరు పెట్టాడు. దేశం అంతటిలో యోబు కుమార్తెలు మహాగొప్ప సౌందర్యవతులు. యోబు తన కుమార్తెలకు తన ఆస్తిలో భాగం ఇచ్చాడు. వారి సోదరులు కూడ తమ తండ్రి ఆస్తిలో వాటా పొందారు. కనుక యోబు మరో నూటనలభై సంవత్సరాలు జీవించాడు. అతడు తన పిల్లలను, మనుమలు, మనుమరాండ్రను, మునిమనుమలు, మనుమరాండ్రను, వారి పిల్లలను చూచేంతవరకు నాలుగు తరాలు జీవించాడు. యోబు చనిపోయినప్పుడు అతడు కడు వృద్ధుడు. యోబు సుదీర్ఘమైన కాలం జీవించాడు.