యోబు 38:1-18
యోబు 38:1-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు. జ్ఞానం లేని మాటలు చెప్పి నా పథకాలను చెడగొడుతున్న వీడెవడు? పౌరుషంగా నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను. నాకు జవాబియ్యాలి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు. నీకు తెలిస్తే చెప్పు, దాని పరిమాణం ఎవరు నిర్ణయించారు? దానికి కొలతలు వేసిన దెవరు? దాని పునాదులు దేనిపై ఉన్నాయి? ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు చేస్తుండగా దాని మూలరాయి నిలబెట్టింది ఎవరు? సముద్రం దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపులు వేసి దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘాలకు బట్టలు తొడిగినప్పుడు గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా? సముద్రానికి నా సరిహద్దు నియమించి, దాని తలుపులను, గడియలను అమర్చినప్పుడు, “నువ్వు ఇంతవరకే మరి దగ్గరికి రాకూడదు, ఇక్కడే నీ తరంగాల గర్వం అణిగిపోవాలి” అని నేను సముద్రానికి చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా? నీ జీవితకాలమంతటిలో ఎప్పుడైనా ప్రాతఃకాలాన్ని రమ్మని ఆజ్ఞాపించావా? తెల్లవారి సూర్యోదయానికి దాని స్థానాన్ని నియమించావా? దుష్టులు దానిలో ఉండకుండా దులిపివేసేలా భూమి అంచులను అది ఒడిసి పట్టేలా ఉదయాన్ని పంపించావా? ముద్ర బంకమట్టి రూపాన్ని మార్చినట్టు భూతలం రూపాంతరం చెందుతూ ఉంటుంది. దానిపై ఉన్నవన్నీ వస్త్రం మీది మడతల్లాగా స్పష్టంగా కనబడతాయి. దుష్టుల వెలుగు వారి నుండి తొలిగిపోతుంది. వారు ఎత్తిన చెయ్యి విరగ్గొట్టబడుతుంది. సముద్రపు ఊటల్లోకి నువ్వు చొరబడ్డావా? సముద్రం అడుగున తిరుగులాడావా? మరణద్వారాలు నీకు తెరుచుకున్నాయా? మరణాంధకార ద్వారాలను నువ్వు చూశావా? భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించావా? ఇదంతా నీకేమైనా తెలిస్తే చెప్పు.
యోబు 38:1-18 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు యెహోవా తుఫానులో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు. “నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన, తెలివితక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే వీడు ఎవడు? యోబూ, మగవాడిలా గట్టిగా ఉండు. నేను నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండు. “యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? నీవు అంత తెలివిగల వాడెవైతే నాకు జవాబు చెప్పు. యోబూ, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణయించింది ఎవరు? నీకు తెలిసినట్టే ఉంది! కొలబద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు? భూమికి ఆధారాలు దేనిమీద ఉన్నాయి? భూమికి అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో వేసింది ఎవరు? అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసి పాడాయి. దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతోషించారు. “యోబూ, భూమి అగాధములో నుండి సముద్రం ప్రవహించినప్పుడు దానిని నిలిపేందుకు దాని తలుపులు మూసినవారు ఎవరు? ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో కప్పి వేశాను. మరియు సముద్రాన్ని చీకటితో చుట్టి వేశాను. సముద్రానికి హద్దులు నేనే నియమించాను. మూయబడిన ద్వారాల వెనుక నేను దానిని ఉంచాను. నీవు ఇంత మట్టుకు రావచ్చు. కాని ఇంకా ముందుకు రాకూడదు. నీ గర్వపు అలలు ఆగి పోవాల్సింది ఇక్కడే, అని నేను సముద్రంతో చెప్పాను. “యోబూ, ప్రారంభం కావాలని ఉదయంతోను, ప్రారంభం కావాలని రోజుతోను నీ జీవితంలో నీవు ఎప్పుడైనా చెప్పావా? యోబూ, ఉదయపు వెలుగు భూమిని ఆవరించాలని, దుర్మార్గులు తాము దాగుకొనే స్థలాలు విడిచిపెట్టేలా ఉదయపు వెలుగు వారిని బలవంతం చేయాలని నీవు ఎన్నడయినా దానితో చెప్పావా? ఉదయపు వెలుగు కొండలు, లోయలు కనబడేటట్టు చేస్తుంది. పగటి వెలుగు భూమి మీదికి వచ్చినప్పుడు ఆ స్థలాల ఆకారాలు చోక్కా మడతల్లా తేటగా కనబడతాయి. అచ్చు వేయబడిన మెత్తని మట్టిలా ఆ స్థలాల ఆకారాలు రూపొందుతాయి. దుర్మార్గులకు పగటి వెలుగు ఇష్టం లేదు. అది బాగా ప్రకాశించినప్పుడు, వారు వారి చెడ్డ పనులు చేయకుండా అది వారిని వారిస్తుంది. “యోబూ, సముద్రం మొదలయ్యే దాని లోతైన చోట్లకు నీవు ఎప్పుడైనా వెళ్లావా? మహా సముద్రపు అట్టడుగున నీవు ఎప్పుడైనా నడిచావా? యోబూ, మరణపు చీకటి చోటు ఎదుట నిలిచే ద్వారాలను ఎవరైనా, ఎన్నడయినా నీకు చూపించారా? యోబూ, భూమి ఎంత పెద్దదో నిజంగా నీవు గ్రహిస్తున్నావా? ఇదంతా నీకు తెలిస్తే నాతో చెప్పు.
యోబు 38:1-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను– జ్ఞానములేని మాటలు చెప్పి–ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు –నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించునట్లును అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కన బడును. దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసినయెడల చెప్పుము.
యోబు 38:1-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు: “తెలివిలేని మాటలతో నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు? పురుషునిగా నీ నడుము కట్టుకో; నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబు చెప్పాలి. “నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు? నీకు వివేకము ఉంటే, నాకు జవాబు చెప్పు. దాని కొలమానాన్ని ఎవరు నిర్ణయించారు? నీకు ఖచ్చితంగా తెలుసు! దాని చుట్టూ కొలత రేఖను వేసిందెవరు? వేకువ చుక్కలన్ని కలిసి గానం చేస్తుంటే దేవదూతలంతా ఆనంద కేకలు వేస్తుంటే దాని పాదాలు దేనిపై మోపబడ్డాయి? దానికి మూలరాయి వేసింది ఎవరు? “భూగర్భం నుండి సముద్రం పొంగి వచ్చినప్పుడు తలుపుల వెనుక దానిని మూసి ఉంచింది ఎవరు? నేను మేఘాలను దానికి వస్త్రంగా చేసి కటిక చీకటిలో దానిని చుట్టిపెట్టినప్పుడు, నేను దానికి హద్దులను నిర్ణయించి తలుపులు గడియలు అమర్చినప్పుడు, ఇక్కడి వరకు నీవు రావచ్చు ఇంతకు మించి కాదు; నీ అహంకార అలలు ఇక్కడే ఆగిపోవాలి, “భూమి అంచుల వరకు వ్యాపించి దానిలో నుండి దుష్టులను దులిపివేసేలా నీవెపుడైనా ఉదయాన్ని ఆజ్ఞాపించావా? తెల్లవారుజాముకు దాని స్థలమేదో ఎప్పుడైనా తెలియచేశావా? ముద్ర వేయబడిన బంకమట్టిలా భూమి రూపం మారుతుంది; దాని లక్షణాలు వస్త్రం యొక్క లక్షణాల్లా ఉంటాయి. దుర్మార్గుల దగ్గర నుండి వారి వెలుగు తొలగించబడింది, పైకెత్తబడిన వారి చేయి విరగ్గొట్టబడింది. “నీవెప్పుడైనా సముద్రపు ఊటలలోనికి ప్రవేశించావా? సముద్రపు అడుగుభాగంలో నడిచావా? మృత్యుద్వారాలు నీకు చూపించబడ్డాయా? లోతైన చీకటి ద్వారాలను నీవు చూశావా? భూమి వైశాల్యం ఎంతో నీకు గ్రహించగలవా? ఒకవేళ ఇవన్నీ నీకు తెలిస్తే, నాకు చెప్పు.