యోబు 2:3-9
యోబు 2:3-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడు, నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు. కారణం లేకుండాా అతణ్ణి నాశనం చెయ్యాలని నువ్వు నన్ను పురికొల్పడానికి ప్రయత్నించినప్పటికీ అతడు ఇప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టకుండా స్ధిరంగా నిలబడ్డాడు” అని అన్నాడు. అప్పుడు సాతాను “మనిషి తన చర్మం కాపాడుకోవడానికి చర్మం ఇస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి తనకున్నదంతా ఇస్తాడు గదా. మరొక్కసారి నువ్వు నీ చెయ్యి చాపి అతని ఎముకల మీదా, దేహం మీదా దెబ్బ కొడితే అతడు నీ ముఖం మీదే నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు” అన్నాడు. అప్పుడు యెహోవా “అతణ్ణి నీకు స్వాధీనం చేస్తున్నాను. అతని ప్రాణం జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు” అని చెప్పాడు. సాతాను యెహోవా సముఖం నుండి బయలుదేరి వెళ్లి, యోబు అరికాలు నుండి నడినెత్తి వరకూ బాధ కలిగించే కురుపులు పుట్టించాడు. అతడు తన ఒళ్లు గోక్కోవడానికి ఒక చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. అతని భార్య వచ్చి అతనితో “నువ్వు ఇంకా నీ నిజాయితీని వదిలిపెట్టవా? దేవుణ్ణి బాగా తిట్టి చచ్చిపో” అంది.
యోబు 2:3-9 పవిత్ర బైబిల్ (TERV)
“నా సేవకుడైన యోబును నీవు గమనిస్తున్నావా? భూమి మీద ఎవ్వరూ అతని వంటివారు లేరు. నిజంగా అతడు మంచి మనిషి. అతడు తన దేవుడనైన నన్ను మాత్రమే ఆరాధిస్తాడు. చెడుకార్యాలకు అతడు దూరంగా ఉంటాడు. అతనికి ఉన్నవాటన్నింటినీ నిష్కారణంగా నాశనం చేయమని నీవు నన్ను అడిగినప్పటికీ, అతడు ఇంకా నమ్మకంగా ఉన్నాడు” అని సాతానుతో యెహోవా అన్నాడు. “చర్మానికి చర్మం బ్రతికి ఉండటానికి మనిషి తనకు ఉన్నదంతా ఇస్తాడు. అతని శరీరానికి హాని చేసేందుకు నీవు నాకు అనుమతిస్తే, అప్పుడు అతడు నీ ముఖం మీదే శపిస్తాడు!” అని సాతాను జవాబు ఇచ్చాడు. “సరే, యోబు నీ అధికారం క్రింద ఉన్నాడు. కాని అతనిని చంపేందుకు నీకు అనుమతి లేదు” అని సాతానుతో యెహోవా చెప్పాడు. అప్పుడు సాతాను యెహోవా దగ్గర నుండి వెళ్లిపోయి, యోబుకు బాధకరమైన పుండ్లు కలిగించాడు. యోబు అరికాలు మొదలుకొని నడినెత్తివరకు, అతని శరీరం అంతటా బాధకరమైన పుండ్లు ఉన్నాయి. కనుక యోబు పెంటకుప్ప దగ్గర కూర్చున్నాడు. అతడు తన పుండ్లను గీకుకొనేందుకు ఒక చిల్లపెంకు ఉపయోగించాడు. యోబు భార్య, “ఇంకా నీవు దేవునికి నమ్మకంగా ఉంటావా? నీ వెందుకు దేవుణ్ణి శపించి, చావకూడదు?” అని అతనితో అంది.
యోబు 2:3-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు యెహోవా–నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతు డునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది–చర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను. అందుకు యెహోవా–అతడు నీ వశముననున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్లపెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా అతని భార్య వచ్చి–నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.
యోబు 2:3-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు గమనించావా? అతనిలాంటి వ్యక్తి భూమి మీద లేడు; అతడు నిర్దోషమైనవాడు, యథార్థవంతుడు, దేవుడంటే భయం కలిగి, చెడుకు దూరంగా ఉండేవాడు. ఏ కారణం లేకుండా నీవు అతన్ని నాశనం చేయడానికి నన్ను ఒప్పించినా అతడు తన యథార్థతను విడువక స్థిరంగా ఉన్నాడు” అని అన్నారు. అప్పుడు సాతాను, “తన చర్మం కాపాడుకోడానికి చర్మాన్ని ఇస్తాడు! మనిషి తన ప్రాణం కోసం తనకున్నదంతా ఇచ్చేస్తాడు. అయితే ఇప్పుడు మీ చేయి చాపి అతని శరీరాన్ని ఎముకలను కొట్టి చూడండి, అతడు ఖచ్చితంగా మీ ముఖం మీద మిమ్మల్ని శపిస్తాడు” అని జవాబిచ్చాడు. యెహోవా, “మంచిది, ఇదిగో యోబు నీ చేతిలో ఉన్నాడు కాని అతని ప్రాణం మాత్రం తీయకూడదు” అని సాతానుతో అన్నారు. కాబట్టి సాతాను యెహోవా సమక్షంలో నుండి వెళ్లి, అరికాలు నుండి నడినెత్తి వరకు బాధకరమైన కురుపులతో యోబును బాధించాడు. అప్పుడు అతడు ఒళ్ళంతా చిల్లపెంకుతో గోక్కుంటూ బూడిదలో కూర్చున్నాడు. అతని భార్య వచ్చి, “నీవు ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా? దేవుని శపించి చనిపోవచ్చు కదా!” అని అన్నది.