యోబు 2:1-13

యోబు 2:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మరో రోజు దేవదూతలు యెహోవా సముఖంలో ఉండేందుకు సమకూడారు. సాతాను కూడా వాళ్ళతో యెహోవా ఎదుట నిలబడేందుకు వచ్చాడు. యెహోవా “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని అపవాదిని అడిగాడు. అందుకు అతడు “భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను” అని యెహోవాకు జవాబిచ్చాడు. అందుకు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడు, నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు. కారణం లేకుండాా అతణ్ణి నాశనం చెయ్యాలని నువ్వు నన్ను పురికొల్పడానికి ప్రయత్నించినప్పటికీ అతడు ఇప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టకుండా స్ధిరంగా నిలబడ్డాడు” అని అన్నాడు. అప్పుడు సాతాను “మనిషి తన చర్మం కాపాడుకోవడానికి చర్మం ఇస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి తనకున్నదంతా ఇస్తాడు గదా. మరొక్కసారి నువ్వు నీ చెయ్యి చాపి అతని ఎముకల మీదా, దేహం మీదా దెబ్బ కొడితే అతడు నీ ముఖం మీదే నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు” అన్నాడు. అప్పుడు యెహోవా “అతణ్ణి నీకు స్వాధీనం చేస్తున్నాను. అతని ప్రాణం జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు” అని చెప్పాడు. సాతాను యెహోవా సముఖం నుండి బయలుదేరి వెళ్లి, యోబు అరికాలు నుండి నడినెత్తి వరకూ బాధ కలిగించే కురుపులు పుట్టించాడు. అతడు తన ఒళ్లు గోక్కోవడానికి ఒక చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. అతని భార్య వచ్చి అతనితో “నువ్వు ఇంకా నీ నిజాయితీని వదిలిపెట్టవా? దేవుణ్ణి బాగా తిట్టి చచ్చిపో” అంది. అప్పుడు యోబు “నువ్వు తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. మనం దేవుడిచ్చే మేళ్ళు మాత్రమే అనుభవిస్తామా? కీడు కూడా అనుభవించాలి గదా” అన్నాడు. జరుగుతున్న ఈ విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు తన నోటిమాటతో ఎలాంటి పాపమూ చేయలేదు. తేమానీయుడు ఎలీఫజు, షూహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విన్నారు. అతనితో కలిసి దుఃఖించడానికి, అతణ్ణి ఓదార్చడానికి వెళ్లాలని నిర్ణయించుకుని తమ ప్రాంతాలు విడిచి యోబు దగ్గరికి వచ్చారు. వారు వచ్చి కొంత దూరంగా నిలబడి అతణ్ణి చూశారు. యోబును పోల్చుకోలేక తమ బట్టలు చింపుకున్నారు. ఆకాశం వైపు తల మీదికి దుమ్ము చల్లుకుని బిగ్గరగా ఏడ్చారు. అతడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడు రోజులపాటు రాత్రీ పగలూ అతనితో కలిసి నేలపై కూర్చున్నారు.

షేర్ చేయి
Read యోబు 2

యోబు 2:1-13 పవిత్ర బైబిల్ (TERV)

మరో రోజు దేవదూతలు యెహోవాను కలుసు కొనేందుకు వచ్చారు. సాతాను వారితో కూడా ఉన్నాడు. సాతాను యెహోవాను కలుసుకొనేందుకు వచ్చాడు. “ఎక్కడికి వెళ్లావు?” అని సాతానును యెహోవా అడిగాడు. “నేను భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాను” అని సాతాను యెహోవాకు జవాబు ఇచ్చాడు. “నా సేవకుడైన యోబును నీవు గమనిస్తున్నావా? భూమి మీద ఎవ్వరూ అతని వంటివారు లేరు. నిజంగా అతడు మంచి మనిషి. అతడు తన దేవుడనైన నన్ను మాత్రమే ఆరాధిస్తాడు. చెడుకార్యాలకు అతడు దూరంగా ఉంటాడు. అతనికి ఉన్నవాటన్నింటినీ నిష్కారణంగా నాశనం చేయమని నీవు నన్ను అడిగినప్పటికీ, అతడు ఇంకా నమ్మకంగా ఉన్నాడు” అని సాతానుతో యెహోవా అన్నాడు. “చర్మానికి చర్మం బ్రతికి ఉండటానికి మనిషి తనకు ఉన్నదంతా ఇస్తాడు. అతని శరీరానికి హాని చేసేందుకు నీవు నాకు అనుమతిస్తే, అప్పుడు అతడు నీ ముఖం మీదే శపిస్తాడు!” అని సాతాను జవాబు ఇచ్చాడు. “సరే, యోబు నీ అధికారం క్రింద ఉన్నాడు. కాని అతనిని చంపేందుకు నీకు అనుమతి లేదు” అని సాతానుతో యెహోవా చెప్పాడు. అప్పుడు సాతాను యెహోవా దగ్గర నుండి వెళ్లిపోయి, యోబుకు బాధకరమైన పుండ్లు కలిగించాడు. యోబు అరికాలు మొదలుకొని నడినెత్తివరకు, అతని శరీరం అంతటా బాధకరమైన పుండ్లు ఉన్నాయి. కనుక యోబు పెంటకుప్ప దగ్గర కూర్చున్నాడు. అతడు తన పుండ్లను గీకుకొనేందుకు ఒక చిల్లపెంకు ఉపయోగించాడు. యోబు భార్య, “ఇంకా నీవు దేవునికి నమ్మకంగా ఉంటావా? నీ వెందుకు దేవుణ్ణి శపించి, చావకూడదు?” అని అతనితో అంది. యోబు తన భార్యతో, “నీవు తెలివి తక్కువ స్త్రీలా మాట్లాడుతున్నావు! దేవుడు మనకు మంచి వాటిని ఇచ్చినప్పుడు, మనం వాటిని స్వీకరిస్తున్నాం. కనుక కష్టాల్ని కూడా మనం స్వీకరించాలి గాని ఆరోపణ చేయకూడదు” అని జవాబిచ్చాడు. ఇవన్ని జరిగినప్పటికీ కూడా యోబు పాపం చేయలేదు. దేవునికి విరుద్ధంగా ఏమియు మాట్లాడనూలేదు. తేమాను వాడైన ఎలీఫజు, షూహీవాడైన బిల్దదు, నయమాతీవాడైన జోఫరు అనే ముగ్గురు యోబుకు స్నేహితులు. యోబుకు సంభవించిన చెడు సంగతులు అన్నింటిని గూర్చి ఈ ముగ్గురు స్నేహితులూ విన్నారు. ఈ ముగ్గురు స్నేహితులూ వారి ఇండ్లు విడిచి ఒకచోట సమావేశమయ్యారు. వారు వెళ్లి యోబుకు సానుభూతి చూపించి, ఆదరించాలని తీర్మానించుకున్నారు. కాని ఆ స్నేహితులు ముగ్గురూ యోబును దూరమునుండి చూచి, అతడు చాలా వేరుగా కనబడటం చేత అతడు యోబు అని సరిగ్గా గుర్తించ లేక పోయారు. వారు గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టారు. వారు తమ వస్త్రాలు చింపుకొని, తాము విచారంగాను, కలవరంగాను ఉన్నట్టు తెలియ చేయడానికి తమ తలల మీద దుమ్మెత్తి పోసుకొన్నారు. తరువాత ఆ ముగ్గురు స్నేహితులూ యోబుతో పాటు ఏడు రాత్రుళ్లు, ఏడు పగళ్లు నేలమీద కూర్చున్నారు. యోబు చాలా శ్రమ పడుతూ ఉన్న కారణంగా వారిలో ఏ ఒక్కరూ యోబుతో ఒక్క మాట కూడా పలుకలేదు.

షేర్ చేయి
Read యోబు 2

యోబు 2:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా –నీవు ఎక్కడనుండి వచ్చితివని వానినడుగగా అపవాది –భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా–నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతు డునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది–చర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను. అందుకు యెహోవా–అతడు నీ వశముననున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్లపెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా అతని భార్య వచ్చి–నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు–మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటిమాటతోనైనను పాపము చేయలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమతమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు, అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశముతట్టు తలలమీద ధూళి చల్లుకొని యెలుగెత్తి యేడ్చిరి. అతని బాధ అత్యధికముగానుండెనని గ్రహించి యెవరును అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితోకూడ నేలను కూర్చుండిరి.

షేర్ చేయి
Read యోబు 2

యోబు 2:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

దేవదూతలు యెహోవా సమక్షంలో నిలబడవలసిన రోజున, యెహోవా ఎదుట నిలబడడానికి వారితో పాటు సాతాను కూడా వచ్చాడు. యెహోవా, “ఎక్కడ నుండి వస్తున్నావు?” అని సాతానును అడిగాడు. “భూమి మీద అటూ ఇటూ తిరుగుతూ భూమంతా తిరిగి వస్తున్నాను” అని సాతాను చెప్పాడు. అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు గమనించావా? అతనిలాంటి వ్యక్తి భూమి మీద లేడు; అతడు నిర్దోషమైనవాడు, యథార్థవంతుడు, దేవుడంటే భయం కలిగి, చెడుకు దూరంగా ఉండేవాడు. ఏ కారణం లేకుండా నీవు అతన్ని నాశనం చేయడానికి నన్ను ఒప్పించినా అతడు తన యథార్థతను విడువక స్థిరంగా ఉన్నాడు” అని అన్నారు. అప్పుడు సాతాను, “తన చర్మం కాపాడుకోడానికి చర్మాన్ని ఇస్తాడు! మనిషి తన ప్రాణం కోసం తనకున్నదంతా ఇచ్చేస్తాడు. అయితే ఇప్పుడు మీ చేయి చాపి అతని శరీరాన్ని ఎముకలను కొట్టి చూడండి, అతడు ఖచ్చితంగా మీ ముఖం మీద మిమ్మల్ని శపిస్తాడు” అని జవాబిచ్చాడు. యెహోవా, “మంచిది, ఇదిగో యోబు నీ చేతిలో ఉన్నాడు కాని అతని ప్రాణం మాత్రం తీయకూడదు” అని సాతానుతో అన్నారు. కాబట్టి సాతాను యెహోవా సమక్షంలో నుండి వెళ్లి, అరికాలు నుండి నడినెత్తి వరకు బాధకరమైన కురుపులతో యోబును బాధించాడు. అప్పుడు అతడు ఒళ్ళంతా చిల్లపెంకుతో గోక్కుంటూ బూడిదలో కూర్చున్నాడు. అతని భార్య వచ్చి, “నీవు ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా? దేవుని శపించి చనిపోవచ్చు కదా!” అని అన్నది. అందుకతడు, “నీవు ఒక మూర్ఖురాలిగా మాట్లాడుతున్నావు. దేవుని దగ్గర నుండి మేలును మాత్రమే అంగీకరించాలా, కీడును అంగీకరించకూడదా?” అని సమాధానం ఇచ్చాడు. ఈ సంగతుల్లో ఏ విషయంలోను మాటల ద్వారా యోబు పాపం చేయలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి వచ్చిన కష్టాలన్నిటి గురించి విని తమ స్నేహితుడిని కలిసి సానుభూతి చూపించి ఆదరించడానికి వెళ్లాలని వారు నిర్ణయించుకొని, తమ ఇళ్ళ నుండి బయలుదేరి వచ్చారు. వారు దూరం నుండి చూసినప్పుడు యోబును సరిగా గుర్తుపట్టలేకపోయారు; దానితో వారు బట్టలు చింపుకొని తమ తలలపై దుమ్ము వేసుకుంటూ గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టారు. వారు ఏడు రోజులు రాత్రింబగళ్ళు అతనితో పాటు నేలమీద కూర్చుండిపోయారు. అతడు పడుతున్న తీవ్రమైన బాధను చూసి అతనితో ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

షేర్ చేయి
Read యోబు 2