యోబు 12:1-6
యోబు 12:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు, నిజంగా లోకంలో ఉన్న ప్రజలంతా మీరేనా? మీతోనే జ్ఞానం కడతేరి పోతుందా? మీకున్నట్టు నాక్కూడా తెలివితేటలు ఉన్నాయి. నేను మీకంటే జ్ఞానం గలవాణ్ణి. మీరు చెప్పే విషయాలు ఎవరికి తెలియదు? దేవుణ్ణి వేడుకుని ఈవులు పొందిన నేను ఇప్పుడు నా స్నేహితుని ఎదుట నవ్వులపాలు కావలసి వచ్చింది. నీతి నిజాయితీలు కలిగిన నేను ఇతరులు చేసే ఎగతాళి భరించాల్సి వస్తుంది. క్షేమస్థితిలో ఉన్నవాళ్ళు దుర్దశలో ఉన్న వాళ్ళను తృణీకరించడం మంచిదని భావిస్తారు. కాళ్ళు జారుతున్న వారికి మరింత దురదృష్టం జత చేసే మార్గాలు వారు వెతుకుతారు. దోపిడీ దొంగల నివాసాలు వర్ధిల్లుతాయి. దేవునికి కోపం పుట్టించేవాళ్ళు భయం లేకుండా సంచరిస్తారు. తమ శక్తి యుక్తులనే తమ దేవుళ్ళుగా భావించుకుంటారు.
యోబు 12:1-6 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు యోబు జోఫరుకు ఇలా జవాబు ఇచ్చాడు: “సందేహము లేకుండ, మీరు మాత్రమే జ్ఞానం గల వాళ్లని మీరు తలస్తారు. మీరు చనిపోయినప్పుడు మీతో బాటు జ్ఞానం గతిస్తుందని మీరు తలస్తారు. అయితే మీరు ఎంత జ్ఞానంగలవాళ్లో నేనూ అంత జ్ఞానంగలవాడిని. నేను మీకంటే తక్కువేమి కాదు. ఇది సత్యం అని ఇతరులకు కూడా తెలుసు. “ఇప్పుడు నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతారు. వారిలా అంటారు: ‘వీడు దేవుణ్ణి ప్రార్థించాడు. వీనికి ఆయన జవాబు ఇచ్చాడు.’ కానీ నేను మంచివాణ్ణి, నిర్దోషిని. అయినప్పటికీ ఇంకా నన్ను చూసి నా స్నేహితులు నవ్వుతూనే ఉన్నారు. కష్టాలు లేని మనుష్యులు కష్టాలు ఉన్న వాళ్లను హేళన చేస్తారు. అలాంటి వాళ్లు పడిపోతున్న వాళ్లను కొట్టేస్తారు. దొంగల గుడారాలకు ఇబ్బంది లేదు. దేవునికి కోపం రప్పించే వాళ్లు శాంతిగా జీవిస్తారు. వారి ఒకే దేవుడు వారి స్వంత బలమే.
యోబు 12:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తర . మిచ్చెను– నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగి యున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసివచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పద ముగా నుండవలసి వచ్చెను. దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమనుకొందురు. కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురువారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.
యోబు 12:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు యోబు ఇచ్చిన జవాబు: నిస్సందేహంగా లోకంలో మీరే జ్ఞానులు, మీతో పాటే జ్ఞానం అంతరిస్తుంది! అయినా మీకున్నట్లే నాకు కూడా గ్రహించే మనస్సు ఉంది, నేను మీకేమి తీసిపోను. ఈ విషయాలు తెలియనివారు ఎవరు? నేను దేవునికి ప్రార్థించగా ఆయన సమాధానం ఇచ్చినప్పటికీ, నా స్నేహితుల ముందు నేను నవ్వులపాలయ్యాను, నీతిగా నిందారహితంగా ఉన్న నేను నవ్వులపాలయ్యాను. నిశ్చింతగా ఉన్నవారు అభాగ్యులను తిరస్కరిస్తారు, పాదాలు జారిపోతున్న వారి విధిని చూసి ఎగతాళి చేస్తారు. బందిపోటు దొంగల గుడారాలు ప్రశాంతంగా ఉంటాయి, దేవునికి కోపం పుట్టించే వారు సురక్షితంగా ఉంటారు, వారి దేవుడు వారి చేతిలోనే ఉన్నాడు.