యోహాను 9:35-41
యోహాను 9:35-41 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అతన్ని సమాజమందిరం నుండి బయటకు వెలివేసారని యేసు విని, అతన్ని కనుగొని, “నీవు మనుష్యకుమారుని నమ్ముతున్నావా?” అని అడిగారు. అప్పుడు అతడు, “అయ్యా, ఆయన ఎవరు? నాతో చెబితే నేను ఆయనను నమ్ముతానేమో” అన్నాడు. యేసు, “నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అన్నారు. అప్పుడు అతడు “ప్రభువా, నేను నమ్ముతున్నాను” అని చెప్పి, ఆయనను ఆరాధించాడు. అప్పుడు యేసు, “నేను గ్రుడ్డివారు చూసేలా మరియు చూసేవారు గ్రుడ్డివారయ్యేలా, ఈ లోకానికి తీర్పు ఇవ్వడానికి వచ్చాను” అన్నారు. అక్కడ ఉన్న కొందరు పరిసయ్యులు ఆయన చెప్పిన ఈ మాటలను విని, “అయితే మేము కూడ గ్రుడ్డివారమేనా?” అని అడిగారు. అందుకు యేసు, “మీరు గ్రుడ్డివారైతే మీ మీద ఈ పాపం ఉండేది కాదు; కాని చూడగలం అని మీరు చెప్పుకుంటున్నారు, కనుక మీ పాపం నిలిచి వుంటుంది” అని చెప్పారు.
యోహాను 9:35-41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పరిసయ్యులు వాణ్ణి బహిష్కరించారని యేసు విన్నాడు. ఆయన వాణ్ణి కలుసుకుని, “నువ్వు దేవుని కుమారుడిలో విశ్వాసముంచుతున్నావా?” అని వాణ్ణి అడిగాడు. అందుకు వాడు, “ప్రభూ, అలా విశ్వాసముంచడానికి ఆయన ఎవరో నాకు తెలియదే” అన్నాడు. యేసు, “ఇప్పుడు నువ్వు ఆయనను చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అన్నాడు. అప్పుడు వాడు, “నేను నమ్ముతున్నాను ప్రభూ” అంటూ ఆయనను ఆరాధించాడు. అప్పుడు యేసు, “‘చూడనివారు చూడాలి. చూసేవారు గుడ్డివారు కావాలి’ అనే తీర్పు జరగడం కోసం నేను ఈ లోకంలోకి వచ్చాను” అన్నాడు. ఆయనకు దగ్గరలో ఉన్న పరిసయ్యుల్లో కొంత మంది ఆ మాట విని, “అయితే మేము కూడా గుడ్డివాళ్ళమేనా?” అని అడిగారు. అందుకు యేసు, “మీరు గుడ్డివారైతే మీకు పాపం ఉండేది కాదు. కానీ ‘మాకు చూపు ఉంది’ అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది” అని చెప్పాడు.
యోహాను 9:35-41 పవిత్ర బైబిల్ (TERV)
అతణ్ణి వెలివేశారని యేసు విన్నాడు. యేసు అతణ్ణి కనుగొని, “నీవు మనుష్యకుమారుణ్ణి నమ్ముచున్నావా?” అని అడిగాడు. ఆ వ్యక్తి, “ఆయనెవరో చెప్పండి ప్రభూ! విశ్వసిస్తాను!” అని అన్నాడు. యేసు, “నీవు ఆయన్ని చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్నవాడాయనే!” అని అన్నాడు. అతడు, “ప్రభూ! నేను నమ్ముతున్నాను!” అని అంటూ ఆయన ముందు మోకరిల్లాడు. యేసు, “నేను తీర్పు చెప్పటానికి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఆ తీర్పేదనగా-గ్రుడ్దివాళ్ళు చూడగలగాలనీ, చూడగలమని అంటున్న వాళ్ళు గ్రుడ్డివాళ్ళు కావాలని నేను వచ్చాను” అని అన్నాడు. ఆయనతో ఉండి ఆయనన్న మాటలు విన్న కొందరు పరిసయ్యులు, “మేము కూడా గ్రుడ్డివాళ్ళ మంటున్నావా?” అని అన్నారు. యేసు, “మీరు గ్రుడ్డి వాళ్ళైనట్లైతే మిమ్ములను దోషులుగా పరిగణించవలసిన అవసరం ఉండదు. కాని మీరు చూడగలము అంటున్నారు. కనుక మిమ్మల్ని దోషులనవలిసిందే!” అని అన్నాడు.
యోహాను 9:35-41 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని–నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు–ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా యేసు – నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు–ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు–చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని–మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు – మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని–చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.