యోహాను 9:1-41
యోహాను 9:1-41 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు దారిలో వెళ్తున్నప్పుడు, పుట్టుకతో గ్రుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తిని చూసారు ఆయన శిష్యులు ఆయనను, “రబ్బీ, అతడు గ్రుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు అతడా లేక అతని తల్లిదండ్రులా?” అని అడిగారు. యేసు, “అతడు కానీ అతని తల్లిదండ్రులు కాని పాపం చేయలేదు, కానీ దేవుని కార్యాలు అతనిలో వెల్లడి కావడానికి ఇలా జరిగింది. పగలున్నంత వరకు నన్ను పంపినవాని పనులను మనం చేస్తూ ఉండాలి, రాత్రి వస్తుంది, అప్పుడు ఎవరూ పని చేయలేరు. ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఈ లోకానికి వెలుగు” అని చెప్పారు. ఆయన ఇది చెప్పి, నేల మీద ఉమ్మివేసి, ఆ ఉమ్మితో కొంత బురద చేసి, అతని కళ్ళ మీద దానిని పూసారు. ఆయన అతనితో, “వెళ్లు, సిలోయము అనే కోనేటిలో కడుగుకో” అని చెప్పారు. సిలోయం అనగా “పంపబడెను” అని అర్థం. అందుకతడు వెళ్లి కడుగుకొని, చూపుతో ఇంటికి వచ్చాడు. అతని పొరుగువారు మరియు అంతకు ముందు గ్రుడ్డిభిక్షవానిగా అతన్ని చూసినవారు, “వీడు ఇక్కడ కూర్చుని భిక్షం అడుక్కున్నవాడు కాడా?” అని చెప్పుకొన్నారు. వారిలో కొందరు వాడే అన్నారు. మరికొందరు “కాదు, వాడిలా ఉన్నాడు” అన్నారు. అయితే వాడు “ఆ వానిని నేనే” అని ఒప్పుకొన్నాడు. వారు అతన్ని, “అయితే నీ కళ్ళు ఎలా తెరుచుకున్నాయి?” అని అడిగారు. అతడు వారితో, “యేసు అనే ఆయన కొంత బురదను చేసి దానిని నా కళ్ళ మీద పూసారు. తర్వాత సిలోయము కోనేటికి వెళ్లి కడుగుకో అని చెప్పాడు. కనుక నేను వెళ్లి కడుక్కున్నాను, తర్వాత చూడగలుగుతున్నాను” అని చెప్పాడు. వారు, “ఆయన ఎక్కడ?” అని అతన్ని అడిగారు. వాడు, “నాకు తెలియదు” అని చెప్పాడు. అంతకు ముందు గ్రుడ్డివానిగా ఉండిన వానిని వారు పరిసయ్యుల దగ్గరకు తీసుకువెళ్ళారు. అయితే యేసు బురద చేసి అతని కళ్ళను తెరిచిన రోజు సబ్బాతు దినం. అందుకు పరిసయ్యులు ఎలా చూపు పొందావని వానిని అడిగారు. అందుకు అతడు, “ఆయన నా కళ్ళ మీద బురదను పూసాడు, నేను దానిని కడుక్కొన్నాను, ఇప్పుడు నేను చూడగల్గుతున్నాను” అని చెప్పాడు. పరిసయ్యులలో కొందరు, “ఇతడు సబ్బాతు దినాన్ని పాటించడంలేదు. కనుక ఇతడు దేవుని నుండి రాలేదు” అన్నారు. కానీ మరికొందరు ఒక పాపి ఇలాంటి అద్బుత క్రియలను ఎలా చేయగలుగుతాడు? అన్నారు. కనుక వారిలో భేదాలు ఏర్పడ్డాయి. చివరికి వారు గ్రుడ్డివానితో, “నీ కళ్ళను తెరిచిన ఈ వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు. వాడు, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు. అయినా వారు ఆ గ్రుడ్డివాడు చూపు పొందాడని నమ్మలేదు కనుక వాని తల్లిదండ్రులను పిలిపించారు. వారు తల్లిదండ్రులతో, “ఇతడు మీ కుమారుడేనా? పుట్టు గ్రుడ్డివాడని మీరు చెప్పే కొడుకు వీడేనా? అయితే వీడు ఇప్పుడెలా చూడగలుగుతున్నాడు?” అని అడిగారు. అందుకు వాని తల్లిదండ్రులు, “వీడు మా కొడుకే, వీడు గ్రుడ్డివానిగానే పుట్టాడని మాకు తెలుసు. అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో, వీని కళ్ళను ఎవరు తెరిచారో మాకు తెలియదు. వీడు పెద్దవాడే కాబట్టి వీనినే అడగండి. తన సంగతి తానే చెప్పుకోగలడు” అన్నారు. యేసును క్రీస్తు అని అంగీకరించిన వారిని సమాజమందిరం నుండి బయటకు వెలివేయాలని యూదా అధికారులు ముందుగానే నిర్ణయించారని, అతని తల్లిదండ్రులు వారికి భయపడి అలా చెప్పారు. అందుకే అతని తల్లిదండ్రులు, “అతడు పెద్దవాడు అతనినే అడగండి” అన్నారు. గ్రుడ్డివానిగా ఉండిన వానిని యూదా అధికారులు మరలా రెండవ సారి పిలిపించారు. “నీవు సత్యం చెప్పి దేవుని మహిమపరచు, మాకైతే ఆ మనుష్యుడు పాపి అని తెలుసు” అన్నారు. అందుకు అతడు, “ఆయన పాపియో కాడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఒక్కటే. గ్రుడ్డివాడనై ఉండిన నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని చెప్పాడు. అప్పుడు వారు వానిని, “ఆయన నీకేమి చేశాడు? నీ కళ్ళను అతడు ఎలా తెరిచాడు?” అని అడిగారు. వాడు వారితో, “నేను మీకు ముందే చెప్పాను కానీ మీరు వినలేదు. మీరు మరలా ఎందుకు వినాలని అనుకుంటున్నారా? మీరు కూడ ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా?” అని అడిగాడు. అప్పుడు వారు అతన్ని దూషించి, “నీవే వాని శిష్యుడవు. మేము మోషే శిష్యులం! దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చాడో కూడ మాకు తెలియదు” అన్నారు. అందుకు అతడు, “ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మీకు తెలియక పోవడం ఆశ్చర్యమే! అయినా ఆయన నా కళ్ళను తెరిచాడు. దేవుడు పాపుల మనవి వినడని మనకు తెలుసు. తన చిత్తాన్ని చేసే భక్తుల మనవి ఆయన వింటాడు. భూమి మొదలైనప్పటి నుండి ఏ పుట్టు గ్రుడ్డివాని కళ్ళు తెరవబడ్డాయని ఎవరు వినలేదు. ఒకవేళ ఇతడు దేవుని నుండి కానట్లైతే, ఏమి చేయగలిగేవాడు కాదు” అని చెప్పాడు. దానికి వారు, “పుట్టుకతోనే పాపిగా ఉండి నీవు మాకు బోధిస్తున్నావా?” అని వానిని సమాజమందిరం నుండి బయటకు వెలివేసారు. అతన్ని సమాజమందిరం నుండి బయటకు వెలివేసారని యేసు విని, అతన్ని కనుగొని, “నీవు మనుష్యకుమారుని నమ్ముతున్నావా?” అని అడిగారు. అప్పుడు అతడు, “అయ్యా, ఆయన ఎవరు? నాతో చెబితే నేను ఆయనను నమ్ముతానేమో” అన్నాడు. యేసు, “నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అన్నారు. అప్పుడు అతడు “ప్రభువా, నేను నమ్ముతున్నాను” అని చెప్పి, ఆయనను ఆరాధించాడు. అప్పుడు యేసు, “నేను గ్రుడ్డివారు చూసేలా మరియు చూసేవారు గ్రుడ్డివారయ్యేలా, ఈ లోకానికి తీర్పు ఇవ్వడానికి వచ్చాను” అన్నారు. అక్కడ ఉన్న కొందరు పరిసయ్యులు ఆయన చెప్పిన ఈ మాటలను విని, “అయితే మేము కూడ గ్రుడ్డివారమేనా?” అని అడిగారు. అందుకు యేసు, “మీరు గ్రుడ్డివారైతే మీ మీద ఈ పాపం ఉండేది కాదు; కాని చూడగలం అని మీరు చెప్పుకుంటున్నారు, కనుక మీ పాపం నిలిచి వుంటుంది” అని చెప్పారు.
యోహాను 9:1-41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుండీ గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన శిష్యులు, “బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వీడైనా, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. పగలున్నంత వరకూ నన్ను పంపిన వాడి పనులు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది. అప్పుడిక ఎవరూ పని చేయలేరు. ఈ లోకంలో ఉన్నంతవరకూ నేను ఈ లోకానికి వెలుగుని” అని చెప్పాడు. ఆయన ఇలా చెప్పి, నేలపై ఉమ్మి వేసి, దానితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డివాడి కన్నులపై పూశాడు. “సిలోయం కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కో” అని వాడికి చెప్పాడు. సిలోయం అనే మాటకు ‘వేరొకరు పంపినవాడు’ అని అర్థం. వాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కుని చూపు పొంది తిరిగి వచ్చాడు. అప్పుడు ఇరుగు పొరుగు వారూ, ఇంతకు ముందు వాడు అడుక్కుంటుంటే చూసిన వారూ, “ఇక్కడ కూర్చుని అడుక్కునే వాడు ఇతడే కదా!” అన్నారు. “వీడే” అని కొందరూ, “వీడు కాదు” అని కొందరూ అన్నారు. ఇక వాడైతే, “అది నేనే” అన్నాడు. వారు, “నీ కళ్ళు ఎలా తెరుచుకున్నాయి?” అని వాణ్ణి అడిగారు. దానికి వాడు, “యేసు అనే ఒకాయన బురద చేసి నా కళ్లపై పూసి సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాకు చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను” అన్నాడు. వారు, “ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?” అని అడిగితే వాడు, “నాకు తెలియదు” అన్నాడు. ఇంతకు ముందు గుడ్డి వాడుగా ఉన్న ఆ మనిషిని వారు పరిసయ్యుల దగ్గరికి తీసుకు వెళ్ళారు. యేసు బురద చేసి వాడి కళ్ళు తెరచిన రోజు విశ్రాంతిదినం. వాడు చూపు ఎలా పొందాడో చెప్పమని పరిసయ్యులు కూడా వాడినడిగారు. వాడు, “ఆయన నా కన్నులపై బురద పూశాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను” అని వారికి చెప్పాడు. “ఈ వ్యక్తి విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు కాబట్టి ఇతడు దేవుని దగ్గర నుండి రాలేదు” అని పరిసయ్యుల్లో కొందరు అన్నారు. మరి కొందరు, “ఇతడు పాపి అయితే ఇలాటి అద్భుతాలు ఎలా చేయగలడు?” అన్నారు. ఈ విధంగా వారిలో భేదాభిప్రాయం కలిగింది. దాంతో వారు గుడ్డివాడుగా ఉన్నవాడితో, “నీ కళ్ళు తెరిచాడు కదా! ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు. అప్పుడు వాడు, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు. వాడు గుడ్డివాడుగా ఉండి చూపు పొందాడని యూదులు మొదట నమ్మలేదు. అందుకని వాడి తల్లిదండ్రులను పిలిపించారు. “గుడ్డివాడుగా పుట్టాడని మీరు చెప్పే మీ కొడుకు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూడగలుగుతున్నాడు?” అని వారిని అడిగారు. దానికి వాడి తల్లిదండ్రులు, “వీడు మా కొడుకే. వీడు గుడ్డివాడిగానే పుట్టాడు. అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలీదు. వీడి కళ్ళు తెరిచినదెవరో మాకు తెలీదు. అయినా వీడికి వయస్సు వచ్చింది. వీడినే అడగండి. తన సంగతి వీడే చెప్పుకోగలడు” అన్నారు. వాడి తల్లిదండ్రులు యూదులకు భయపడి ఆ విధంగా చెప్పారు. ఎందుకంటే యూదులు అప్పటికే ఎవరైనా ఆయనను క్రీస్తు అని ఒప్పుకుంటే వారిని తమ సమాజ మందిరాల్లో నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే వాడి తల్లిదండ్రులు ‘వాడు వయస్సు వచ్చినవాడు, వాడినే అడగండి’ అన్నారు. కాబట్టి వారు అప్పటివరకూ గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని రెండవ సారి పిలిపించారు. “దేవునికి మహిమ చెల్లించు. ఈ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు” అని అతనితో అన్నారు. అందుకు వాడు, “ఆయన పాపాత్ముడో కాదో నాకేం తెలుసు? అయితే నాకు ఒక్కటి తెలుసు. నేను గుడ్డివాడుగా ఉండేవాణ్ణి, ఇప్పుడైతే చూస్తున్నాను” అన్నాడు. దానికి వారు, “అసలు ఆయన నీకేం చేశాడు? నీ కళ్ళు ఎలా తెరిచాడు?” అని మళ్ళీ అడిగారు. దానికి వాడు, “ఇంతకు ముందే మీకు చెప్పాను. మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు వినాలనుకుంటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా ఏంటి?” అని వారితో అన్నాడు. అందుకు వారు “నువ్వే వాడి శిష్యుడివి. మేము మోషే శిష్యులం. దేవుడు మోషేతో మాట్లాడాడని తెలుసు కానీ ఈ మనిషి విషయమైతే అసలు ఇతడు ఎక్కడి నుండి వచ్చాడో కూడా తెలియదు” అంటూ వాణ్ణి బాగా దూషించారు. అయితే వాడు, “ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా ఆయన నా కళ్ళు తెరిచాడు. దేవుడు పాపుల ప్రార్థనలు వినడని మనకు తెలుసు. అయితే దేవునిలో భక్తి కలిగి ఆయన ఇష్టాన్ని జరిగిస్తే అతని ప్రార్థనలు ఆయన వింటాడు. గుడ్డివాడిగా పుట్టిన వ్యక్తి కళ్ళు ఎవరైనా తెరిచినట్టు లోకం మొదలైనప్పటి నుండి ఎవరూ వినలేదు. ఈయన దేవుని దగ్గర నుండి రాకపోతే ఇలాంటివి చేయలేడు” అని చెప్పాడు. దానికి వారు, “పాపిగా పుట్టిన వాడివి, నువ్వు మాకు బోధిస్తున్నావా?” అని చెప్పి వాణ్ణి తమ సమాజ మందిరం నుండి బహిష్కరించారు. పరిసయ్యులు వాణ్ణి బహిష్కరించారని యేసు విన్నాడు. ఆయన వాణ్ణి కలుసుకుని, “నువ్వు దేవుని కుమారుడిలో విశ్వాసముంచుతున్నావా?” అని వాణ్ణి అడిగాడు. అందుకు వాడు, “ప్రభూ, అలా విశ్వాసముంచడానికి ఆయన ఎవరో నాకు తెలియదే” అన్నాడు. యేసు, “ఇప్పుడు నువ్వు ఆయనను చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అన్నాడు. అప్పుడు వాడు, “నేను నమ్ముతున్నాను ప్రభూ” అంటూ ఆయనను ఆరాధించాడు. అప్పుడు యేసు, “‘చూడనివారు చూడాలి. చూసేవారు గుడ్డివారు కావాలి’ అనే తీర్పు జరగడం కోసం నేను ఈ లోకంలోకి వచ్చాను” అన్నాడు. ఆయనకు దగ్గరలో ఉన్న పరిసయ్యుల్లో కొంత మంది ఆ మాట విని, “అయితే మేము కూడా గుడ్డివాళ్ళమేనా?” అని అడిగారు. అందుకు యేసు, “మీరు గుడ్డివారైతే మీకు పాపం ఉండేది కాదు. కానీ ‘మాకు చూపు ఉంది’ అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది” అని చెప్పాడు.
యోహాను 9:1-41 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన వెళ్తూ ఒక పుట్టు గ్రుడ్డి వాణ్ణి చూశాడు. ఆయన శిష్యులు ఆయనతో, “రబ్బీ! యితడు గ్రుడ్డివానిగా పుట్టాడే! ఎవరు పాపం చేసారంటారు? ఇతడా లేక యితని తల్లిదండ్రులా?” అని అడిగారు. యేసు, “ఇతడు కాని, యితని తల్లిదండ్రులు కాని పాపం చెయ్యలేదు! దేవుని శక్తి యితని జీవితం ద్వారా ప్రదర్శింపబడాలని గ్రుడ్డివానిగా పుట్టాడు. సూర్యాస్తమయం అయ్యేలోగా మనం నన్ను పంపిన వాని కార్యం చేయాలి. రాత్రి రాబోతోంది. అప్పుడు ఎవ్వరూ పని చెయ్యలేరు. ఈ ప్రపంచంలో నేను ఉన్నంత కాలం నేను దానికి వెలుగును” అని అన్నాడు. ఈ విధంగా మాట్లాడి నేల మీద ఉమ్మి వేసాడు. ఆ ఉమ్మితో బురద చేసి, ఆ గ్రుడ్డివాని కళ్ళమీద పూసాడు. అతనితో, “వెళ్ళి, సిలోయం కోనేట్లో కడుక్కో!” అని అన్నాడు. సిలోయం అన్న పదానికి అర్థం “పంపబడిన వాడు.” ఆ గ్రుడ్డివాడు వెళ్ళి తన కళ్ళు కడుక్కున్నాడు. అతనికి దృష్టి వచ్చాక తిరిగి వచ్చాడు. అతని ఇరుగు, పొరుగు వాళ్ళు, అతడు భిక్షమెత్తు కుంటుండగా చూసిన వాళ్ళు, “ఈ మనిషి కూర్చొని భిక్షమెత్తు కుంటూవుండే వాడు కదా!” అని అన్నారు. కొందరు, “ఔనన్నారు. మరికొందరు, కాదు ఇతడు అతనిలా కనిపిస్తున్నాడు, అంతే!” అని అన్నారు. కాని అతడు స్వయంగా, “నేనే అతణ్ణి” అని అన్నాడు. “మరి అలాగైతే నీకు దృష్టి ఎట్లా వచ్చింది!” అని వాళ్ళు అడిగారు. అతడు, “యేసు అని పిలుస్తారే ఆయన బురద చేసి నా కళ్ళ మీద పూసాడు. తర్వాత నన్ను వెళ్ళి సిలోయం కొనేరులో కడుక్కోమన్నాడు. నేను అలాగే వెళ్ళి కడుక్కున్నాను. ఆ తర్వాత నాకు దృష్టి వచ్చింది” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు, “అతడెక్కడ ఉన్నాడు?” అని అడిగారు. ఆయన, “నాకు తెలియదు” అని అన్నాడు. వాళ్ళు యింతకు పూర్వం గ్రుడ్డివానిగా ఉన్న వాణ్ణి పరిసయ్యుల దగ్గరకు పిలుచుకు వచ్చారు. బురద చేసి ఆ గ్రుడ్డివానికి నయం చేసింది విశ్రాంతి రోజు. పరిసయ్యులు దృష్టి ఎట్లా వచ్చిందని అతణ్ణి ప్రశ్నించారు. అతడు, “ఆయన నా కళ్ళమీద బురద పూసాడు. నేను వెళ్ళి కడుక్కొన్నాను. నాకు దృష్టి వచ్చింది” అని అన్నాడు. కొందరు పరిసయ్యులు, “అతడు విశ్రాంతి రోజును పాటించడు. కనుక అతడు దేవుని నుండి రాలేదు!” అని అన్నారు. మరికొందరు, “ఇతడు పాపాత్ముడైతే ఇలాంటి అద్భుతాలు చేయగలడా?” అని అన్నారు. అలా వారిలో వారికి వివాదం కలిగింది. వాళ్ళు మళ్ళీ గ్రుడ్డివానితో, “నీవు అతని గురించి ఏమనుకొంటున్నావు” అని అడిగారు. “ఆయన ఒక ప్రవక్త!” అని ఆ నయమైన వాడు సమాధానం చెప్పాడు. ఇదివరలో గ్రుడ్డివానిగా ఉన్నవాడు యితడేనని; యిప్పుడతనికి దృష్టి వచ్చిందని, అతని తల్లిదండ్రుల్ని పిలువనంపే దాకా యూదులు నమ్మలేదు. అతని తల్లిదండ్రులతో, “ఇతడు మీ కుమారుడా! గ్రుడ్డి వానిగా జన్మించింది ఇతడేనా? ఇతడు ఇప్పుడెట్లా చూడగలుగుతున్నాడు?” అని అడిగారు. అతని తల్లిదండ్రులు, “అతుడు మా కుమారుడని, గ్రుడ్డివానిగా జన్నించాడని మాకు తెలుసు. కాని అతడు ఇప్పుడేవిధంగా చూడగలుగు తున్నాడో. అతనికి దృష్టి ఎవరిచ్చారో మాకు తెలియదు. అతణ్ణే అడగండి! తనను గురించి సమాధానం చెప్పుకోగల వయస్సు అతనికి ఉంది” అని అన్నారు. యేసే, “క్రీస్తు” అన్న ప్రతి ఒక్కణ్ణి సమాజ మందిరం నుండి బహిష్కరించాలని యూదులు యిది వరకే నిశ్చయించారు. కనుక వాళ్ళకు భయపడి అతని తల్లిదండ్రులు ఈ విధంగా సమాధానం చెప్పారు. అందుకే వాళ్ళు, “అతనికి వయస్సు వచ్చింది. అతణ్ణే అడగండి!” అని అన్నారు. యూదులు గ్రుడ్డివానిగా ఉన్నవాణ్ణి రెండవసారి పిలువనంపారు. అతనితో, “దేవుణ్ణి స్తుతించు, అతణ్ణి కాదు. అతడు పాపాత్ముడని తెలుసు!” అని అన్నారు. “ఆయన పాపాత్ముడో, కాదో నాకు తెలియదు. నాకు ఒకటి తెలుసు. నేనిదివరలో గ్రుడ్డి వాణ్ణి. ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని అతడు సమాధానం చెప్పాడు. “అతడు ఏమి చేసాడు? ఏ విధంగా నీకు దృష్టి కలిగించాడు?” అని వాళ్ళు అడిగారు. అతుడు, “నేను యిది వరకే చెప్పాను. కాని మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలని అనుకుంటున్నారా?” అని అన్నాడు. వాళ్ళు అతణ్ణి అవమానపరచారు. అతనితో, “నువ్వు అతని శిష్యుడివి. మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. ఇక ఇతని గురించా? ఇతడెక్కడినుండి వచ్చాడో కూడా మాకు తెలియదు” అని అన్నారు. అతడు, “ఇది చాలా విచిత్రం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియదు. అయినా ఆయన నాకు దృష్టి కలిగించాడు. దేవుడు పాపాత్ముల మాటలు వినడని, తన ఆజ్ఞలను పాటిస్తున్న విశ్వాసుల మాటలు వింటాడని మాకు తెలుసు. పుట్టు గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించటం ఇది వరకు ఎవ్వరూ వినలేదు. ఇతడు దేవుని నుండి రానట్లైతే ఏమి చెయ్యలేకపొయ్యేవాడు” అని అన్నాడు. ఇది విని వాళ్ళు, “నీవు పాపంలో పుట్టావు. పాపంలో పెరిగావు. మాకు ఉపదేశించటానికి నీకెంత ధైర్యం?” అని అంటూ అతణ్ణి వెలివేశారు. అతణ్ణి వెలివేశారని యేసు విన్నాడు. యేసు అతణ్ణి కనుగొని, “నీవు మనుష్యకుమారుణ్ణి నమ్ముచున్నావా?” అని అడిగాడు. ఆ వ్యక్తి, “ఆయనెవరో చెప్పండి ప్రభూ! విశ్వసిస్తాను!” అని అన్నాడు. యేసు, “నీవు ఆయన్ని చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్నవాడాయనే!” అని అన్నాడు. అతడు, “ప్రభూ! నేను నమ్ముతున్నాను!” అని అంటూ ఆయన ముందు మోకరిల్లాడు. యేసు, “నేను తీర్పు చెప్పటానికి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఆ తీర్పేదనగా-గ్రుడ్దివాళ్ళు చూడగలగాలనీ, చూడగలమని అంటున్న వాళ్ళు గ్రుడ్డివాళ్ళు కావాలని నేను వచ్చాను” అని అన్నాడు. ఆయనతో ఉండి ఆయనన్న మాటలు విన్న కొందరు పరిసయ్యులు, “మేము కూడా గ్రుడ్డివాళ్ళ మంటున్నావా?” అని అన్నారు. యేసు, “మీరు గ్రుడ్డి వాళ్ళైనట్లైతే మిమ్ములను దోషులుగా పరిగణించవలసిన అవసరం ఉండదు. కాని మీరు చూడగలము అంటున్నారు. కనుక మిమ్మల్ని దోషులనవలిసిందే!” అని అన్నాడు.
యోహాను 9:1-41 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు – బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా యేసు–వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనముచేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి –నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారును–వీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతే–నేనే యనెను. వారు–నీ కన్నులేలాగు తెరవబడెనని వానినడుగగా వాడు–యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి–నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను. వారు, ఆయన ఎక్కడనని అడుగగావాడు, నేనెరుగననెను. అంతకుముందు గ్రుడ్డియైయుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి. యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు–నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను. కాగా పరిసయ్యులలో కొందరు–ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు–పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు–ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి, –గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తలిదండ్రులు–వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి. కావున వాని తలిదండ్రులు–వాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి. కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి –దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా వాడు–ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాననెను. అందుకు వారు–ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా వాడు–ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను. అందుకు వారు–నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము; దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు –ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు–నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని–నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు–ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా యేసు – నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు–ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు–చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని–మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు – మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని–చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.