యోహాను 8:7-12

యోహాను 8:7-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి–మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి మరల వంగి నేలమీద వ్రాయుచుండెను. వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీమధ్యను నిలువబడియుండెను. యేసు తలయెత్తి చూచి–అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు ఆమె –లేదు ప్రభువా అనెను. అందుకు యేసు–నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. మరల యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.

షేర్ చేయి
Read యోహాను 8

యోహాను 8:7-12 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

వారు అలాగే ఆయనను ప్రశ్నిస్తూనే ఉన్నందుకు, ఆయన తన తల పైకెత్తి చూసి వారితో, “మీలో పాపం లేనివాడు, ఆమెపై మొదటి రాయి వేయండి” అని చెప్పి, మళ్ళీ క్రిందకు వంగి నేలపై వ్రాస్తూ వున్నారు. వారు ఆ మాట విని, యేసుతో పాటు అక్కడ నిలబడి ఉన్న స్త్రీ తప్ప, ఒకరి తర్వాత ఒకరిగా మొదట పెద్దవారు వెళ్లిపోయారు. యేసు తన తలయెత్తి ఆమెను, “అమ్మా, వారెక్కడ? ఎవరు నిన్ను శిక్షించలేదా?” అని అడిగారు. ఆమె “అయ్యా ఎవ్వరు లేరు” అన్నది. అందుకు యేసు, “నేను కూడ నిన్ను శిక్షించను. నీవు వెళ్లి, ఇప్పటి నుండి పాపం చేయకుండ బ్రతుకు” అన్నారు. యేసు ప్రజలతో మాట్లాడుతూ, “నేనే లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, కాని వారిలో జీవం కలిగించే వెలుగును కలిగి ఉంటారు” అని చెప్పారు.

షేర్ చేయి
Read యోహాను 8

యోహాను 8:7-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. దాంతో ఆయన తల ఎత్తి చూసి, “మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు” అని వారితో చెప్పి మళ్ళీ వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు. ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది. యేసు తలెత్తి ఆమెను చూశాడు. “నీమీద నిందారోపణ చేసిన వారంతా ఎక్కడమ్మా? నీకు ఎవరూ శిక్ష వేయలేదా?” అని అడిగాడు. ఆమె, “లేదు ప్రభూ” అంది. దానికి యేసు, “నేను కూడా నీకు శిక్ష వేయను. వెళ్ళు, ఇంకెప్పుడూ పాపం చేయకు” అన్నాడు. మళ్ళీ యేసు ఇలా అన్నాడు, “నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. జీవపు వెలుగు కలిగి ఉంటాడు.”

షేర్ చేయి
Read యోహాను 8

యోహాను 8:7-12 పవిత్ర బైబిల్ (TERV)

వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. యేసు తలెత్తి చూస్తూ, “మీలో పాపం చెయ్యనివాడు ఎవరైనా ఉంటే, అతడు ఆమెపై మొదటిరాయి విసర వచ్చు!” అని అన్నాడు. ఇలా అన్నాక, మళ్ళీ క్రిందికి వంగి నేలపై వ్రాస్తూ ఉన్నాడు. ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు. యేసు తలెత్తి చూస్తూ, “వాళ్ళెక్కడమ్మా! నిన్నెవ్వరూ శిక్షించ లేదా?” అని అడిగాడు. “లేదు ప్రభూ!” అని ఆమె అన్నది. “నేను కూడా శిక్ష విధించను. వెళ్ళు! ఇకనుండి పాపం చెయ్యకు!” అని అన్నాడు. యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించినవాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్ళకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు.

షేర్ చేయి
Read యోహాను 8