యోహాను 8:32-47
యోహాను 8:32-47 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు–మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు–పాపముచేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతం త్రులైయుందురు. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో–మా తండ్రి అబ్రాహామనిరి; యేసు–మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు– మేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను–దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.
యోహాను 8:32-47 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకొంటారు, ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది” అని చెప్పారు. వారు ఆయనతో, “మేము అబ్రాహాము సంతతివారం, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు. అలాంటప్పుడు మిమ్మల్ని విడుదల చేస్తుంది అని ఎలా చెప్తారు?” అన్నారు. యేసు వారితో, “పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే, అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కుటుంబంలో దాసునికి స్థిరమైన స్థానం ఉండదు, కానీ కుమారుడు ఎల్లప్పుడు కుటుంబ సభ్యునిగానే ఉంటాడు. అందుకే కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే, మీరు నిజంగా విడుదల పొందినవారిగా ఉంటారు. మీరు అబ్రాహాము సంతతివారని నాకు తెలుసు. అయినా మీలో నా మాటకు చోటు లేదు, కనుక మీరు నన్ను చంపడానికి మార్గం కొరకు చూస్తున్నారు. నేను నా తండ్రి సన్నిధిలో చూసినవాటిని మీకు చెప్తున్నాను, మీరు మీ తండ్రి దగ్గరి నుండి విన్నవాటిని చేస్తున్నారు” అన్నారు. దానికి వారు, “అబ్రాహాము మా తండ్రి” అని జవాబిచ్చారు. అందుకు యేసు, “మీరు అబ్రాహాము పిల్లలైతే, మీరు అబ్రాహాము చేసిన వాటిని చేస్తారు. కాని నేను దేవుని నుండి విన్న సత్యాన్ని మీకు చెప్పినందుకు మీరు నన్ను చంపే మార్గం కొరకు చూస్తున్నారు, అబ్రాహాము అలాంటివి చేయలేదు. మీ సొంత తండ్రి చేసిన పనులనే మీరు చేస్తున్నారు” అని వారితో అన్నారు. అందుకు వారు “మేము అక్రమ సంతానం కాదు, మాకు ఉన్న ఏకైక తండ్రి దేవుడే” అని ఎదురు చెప్పారు. యేసు వారితో, “దేవుడు మీ తండ్రియైతే, మీరు నన్ను ప్రేమించేవారు. ఎందుకంటే నేను దేవుని యొద్ద నుండే ఇక్కడికి వచ్చాను. నా అంతట నేను రాలేదు; దేవుడే నన్ను పంపించారు. నా భాష మీకెందుకు స్పష్టంగా లేదు? ఎందుకంటే నేను చెప్తుంది మీరు వినలేకపోతున్నారు. మీరు మీ తండ్రియైన అపవాదికి చెందినవారు, కనుక మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. మొదటి నుండి వాడు హంతకుడే, వానిలో సత్యం లేదు, కనుక వాడు సత్యాన్ని పట్టుకుని ఉండడు. వాడు అబద్ధం చెప్పినప్పుడు, వాడు తన స్వభాషలో మాట్లాడతాడు, ఎందుకంటే వాడు అబద్ధికుడు మరియు అబద్ధాలకు తండ్రి. అయినాసరే నేను మీకు నిజం చెప్తున్నా, మీరు నన్ను నమ్మరు! నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను సత్యాన్ని చెప్తున్నప్పుడు, మీరెందుకు నన్ను నమ్మరు? దేవునికి చెందినవారు దేవుడు చెప్పే మాటలను వింటారు. మీరు దేవునికి చెందినవారు కారు కనుక మీరు ఆయన మాటలను వినరు” అని అన్నారు.
యోహాను 8:32-47 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు. అప్పుడు వారు, “మేము అబ్రాహాము వారసులం. మేము ఎప్పుడూ ఎవరికీ బానిసలుగా ఉండలేదే. ‘మీరు విడుదల పొందుతారు’ అని ఎలా అంటున్నావు?” అన్నారు. దానికి యేసు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను, పాపం చేసే ప్రతివాడూ పాపానికి బానిసే. బానిస ఎప్పుడూ ఇంట్లో ఉండడు. కానీ కుమారుడు ఎప్పుడూ ఇంట్లోనే నివాసం ఉంటాడు. కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. మీరు అబ్రాహాము వారసులని నాకు తెలుసు. అయినా మీలో నా వాక్కుకు చోటు లేదు. కాబట్టే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఉపదేశించేదంతా నా తండ్రి దగ్గర నేను చూసినదే. అలాగే మీరు మీ తండ్రి దగ్గర విన్న సంగతుల ప్రకారమే పనులు చేస్తున్నారు” అని చెప్పాడు. దానికి వారు, “మా తండ్రి అబ్రాహాము” అన్నారు. అప్పుడు యేసు, “మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన పనులే చేసేవారు. దేవుని దగ్గర నేను విన్న సత్యాన్ని మీకు చెప్పినందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారుగా. అయితే అబ్రాహాము అలా చేయలేదు. మీరు మీ తండ్రి పనులే చేస్తున్నారు” అని వారితో చెప్పాడు. దానికి వారు, “మేము వ్యభిచారం వల్ల పుట్టినవారం కాదు. మాకు ఒక్కడే తండ్రి. ఆయన దేవుడు” అన్నారు. యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. నేను వచ్చింది దేవుని దగ్గర్నుంచే. నా అంతట నేను రాలేదు. ఆయనే నన్ను పంపించాడు. నా మాటలు మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా మాట వినే మీకు సహనం లేదు. మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి. నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించ గలరు? నేను సత్యాన్నే చెబుతున్నా మీరెందుకు నమ్మడం లేదు? ఒకడు దేవునికి చెందినవాడు అయితే దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు.”
యోహాను 8:32-47 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసు కుంటారు. ఆ సత్యమే మీకు స్వేచ్ఛ కలిగిస్తుంది” అని అన్నాడు. వాళ్ళు, “మేము అబ్రాహాము వంశీయులం. మేమింతవరకు ఎవ్వరికి బానిసలుగా ఉండలేదు. మరి మాకు స్వేచ్ఛ కలుగుతుందని ఎందుకంటున్నావు?” అని అన్నారు. యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పాపం చేసిన ప్రతి ఒక్కడూ పాపానికి బానిస ఔతాడు. బానిసకు కుటుంబంలో శాశ్వతమైన స్థానం ఉండదు. కాని కుమారుడు శాశ్వతంగా ఆ యింటికి చెందినవాడు. కుమారుడు స్వేచ్ఛ కలిగిస్తే మీకు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు. అయినా మీకు నా సందేశం నచ్చలేదు. కనుక నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. నేను నా తండ్రి సమక్షంలో చూసిన దాన్ని చెబుతున్నాను. మీరు మీ తండ్రి నుండి విన్నదాన్ని చేస్తున్నారు” అని అన్నాడు. “అబ్రాహాము మా తండ్రి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము చేసినట్లు చేసేవాళ్ళు! నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవర్తించలేదు. మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” అని అన్నాడు. వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి” అని అన్నారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను ప్రేమించే వాళ్ళు. స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను పంపాడు. మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. మీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చడమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి స్వభావము. కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడుతాడు. వాడు అబద్ధానికి తండ్రి. “నేను నిజం చెప్పటంవల్ల మీరు నమ్మటంలేదు. నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు. దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.”