యోహాను 8:1-59

యోహాను 8:1-59 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు ఒలీవలకొండకు వెళ్లెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి –బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి–మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి మరల వంగి నేలమీద వ్రాయుచుండెను. వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీమధ్యను నిలువబడియుండెను. యేసు తలయెత్తి చూచి–అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు ఆమె –లేదు ప్రభువా అనెను. అందుకు యేసు–నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. మరల యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు–నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా యేసు– నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను. నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా. నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను. వారు–నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు–మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రిని కూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను. ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. మరియొకప్పుడు ఆయన–నేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనేయుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. అందుకు యూదులు–నేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపు కొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడాయన–మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను. కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను. కాబట్టి వారు–నీ వెవరవని ఆయన నడుగగా యేసు వారితో–మొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే. మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహిం పక పోయిరి. కావున యేసు–మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో–మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు–మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు–పాపముచేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతం త్రులైయుందురు. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో–మా తండ్రి అబ్రాహామనిరి; యేసు–మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు– మేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను–దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. అందుకు యూదులు–నీవు సమరయుడవును దయ్యముపెట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా యేసు–నేను దయ్యముపెట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచు వాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అందుకు యూదులు–నీవు దయ్యము పెట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను –ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడ వని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి. అందుకు యేసు–నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; –మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పు దురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు– నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు–అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను.

షేర్ చేయి
Read యోహాను 8

యోహాను 8:1-59 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అయితే యేసు ఒలీవల కొండకు వెళ్లారు. ఉదయం పెందలకడనే యేసు మళ్ళీ దేవాలయ ఆవరణంలో కనబడినప్పుడు, అక్కడ ప్రజలందరు ఆయన చుట్టు చేరారు, ఆయన వారికి బోధించడానికి కూర్చున్నారు. అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు పరిసయ్యులు వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. వారు ఆమెను గుంపు ముందు నిలబెట్టి, వారు యేసుతో, “బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. అలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని మనకు ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు. ఇప్పుడు నీవేమంటావు?” అని అడిగారు. యేసు మీద నేరం మోపి ఆయనను చిక్కించుకోడానికి, పరీక్షిస్తూ అలా అడిగారు. కానీ యేసు క్రిందికి వంగి తన వ్రేలితో నేలపై వ్రాస్తూ వున్నారు. వారు అలాగే ఆయనను ప్రశ్నిస్తూనే ఉన్నందుకు, ఆయన తన తల పైకెత్తి చూసి వారితో, “మీలో పాపం లేనివాడు, ఆమెపై మొదటి రాయి వేయండి” అని చెప్పి, మళ్ళీ క్రిందకు వంగి నేలపై వ్రాస్తూ వున్నారు. వారు ఆ మాట విని, యేసుతో పాటు అక్కడ నిలబడి ఉన్న స్త్రీ తప్ప, ఒకరి తర్వాత ఒకరిగా మొదట పెద్దవారు వెళ్లిపోయారు. యేసు తన తలయెత్తి ఆమెను, “అమ్మా, వారెక్కడ? ఎవరు నిన్ను శిక్షించలేదా?” అని అడిగారు. ఆమె “అయ్యా ఎవ్వరు లేరు” అన్నది. అందుకు యేసు, “నేను కూడ నిన్ను శిక్షించను. నీవు వెళ్లి, ఇప్పటి నుండి పాపం చేయకుండ బ్రతుకు” అన్నారు. యేసు ప్రజలతో మాట్లాడుతూ, “నేనే లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, కాని వారిలో జీవం కలిగించే వెలుగును కలిగి ఉంటారు” అని చెప్పారు. అందుకు పరిసయ్యులు, “నీ గురించి నీవే సాక్ష్యం చెప్పుకొంటున్నావు; కనుక నీ సాక్ష్యానికి విలువలేదు” అన్నారు. యేసు జవాబిస్తూ, “నా గురించి నేను సాక్ష్యం చెప్పుకొన్నా నా సాక్ష్యం విలువైనదే, ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. మీరు మానవ ప్రమాణాలను బట్టి తీర్పు తీరుస్తారు; కాని నేను ఎవరిని తీర్పు తీర్చను. నేను ఒంటరిగా లేను, నేను నన్ను పంపిన తండ్రితో ఉన్నాను గనుక నేను తీర్పు తీర్చినా, నా నిర్ణయాలు న్యాయమైనవే. ఇద్దరు సాక్ష్యుల సాక్ష్యం విలువైనదని మీ ధర్మశాస్త్రంలోనే వ్రాయబడి ఉంది. నేను నా గురించి సాక్ష్యమిస్తున్నాను; నా మరొక సాక్షి నన్ను పంపిన తండ్రి” అన్నారు. వారు ఆయనను, “నీ తండ్రి ఎక్కడ?” అని అడిగారు. అప్పుడు యేసు, “మీకు నా గురించి కాని నా తండ్రిని గురించి కాని తెలియదు. మీరు నన్ను తెలుసుకొని ఉంటే, నా తండ్రిని తెలుసుకొని ఉండేవారు” అని చెప్పారు. దేవాలయ ఆవరణంలో కానుకలపెట్టె ఉండే స్థలం దగ్గరగా బోధిస్తూ ఈ మాటలను చెప్పారు. అయినా వారెవరు ఆయనను పట్టుకోలేదు, ఎందుకంటే ఆయన గడియ ఇంకా రాలేదు. యేసు మరొకసారి వారితో, “నేను వెళ్లిపోతున్నాను, మీరు నా కొరకు వెదకుతారు, మరియు మీరు మీ పాపంలోనే చస్తారు. నేను వెళ్లే చోటికి మీరు రాలేరు” అన్నారు. అందుకు యూదులు, “తనను తానే చంపుకుంటాడా? అందుకేనా, ‘నేను వెళ్లే చోటికి, మీరు రాలేరు’ అని చెప్తున్నాడు” అని అనుకున్నారు. అప్పుడు ఆయన, “మీరు క్రిందుండే వారు; నేను పైనుండి వచ్చాను. మీరు ఈ లోకానికి చెందినవారు; నేను ఈ లోకానికి చెందిన వాడను కాను. మీరు మీ పాపంలోనే చస్తారు అని నేను చెప్పాను; నేనే ఆయనను అని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాలలోనే చస్తారు” అని వారితో చెప్పారు. వారు, “నీవు ఎవరవు?” అని అడిగారు. అందుకు యేసు, “మొదటి నుండి నేను మీతో ఎవరినని చెప్పుతూ వచ్చానో ఆయననే” అని సమాధానం చెప్పారు. ఆయన, “మిమ్మల్ని గురించి తీర్పు చెప్పడానికి నాకు చాలా సంగతులు ఉన్నాయి, కానీ నన్ను పంపినవాడు నమ్మదగినవాడు, మరియు ఆయన దగ్గర నుండి నేను విన్నవాటినే ఈ లోకానికి చెప్తున్నాను” అన్నారు. ఆయన తన తండ్రి గురించి చెప్తున్నారని వారు గ్రహించలేకపోయారు. కనుక యేసు, “మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు, నేనే ఆయనను, నా అంతట నేనేమి చేయను కాని తండ్రి నాకు బోధించిన వాటినే నేను చెప్తున్నానని మీరు తెలుసుకొంటారు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు; నేనెల్లప్పుడు ఆయనను సంతోషపరచే వాటినే చేస్తున్నాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు” అని చెప్పారు. ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగా, చాలామంది ఆయనను నమ్మారు. తనను నమ్మిన యూదులతో, యేసు, “ఒకవేళ మీరు నా బోధలో స్థిరంగా ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు అవుతారు. అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకొంటారు, ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది” అని చెప్పారు. వారు ఆయనతో, “మేము అబ్రాహాము సంతతివారం, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు. అలాంటప్పుడు మిమ్మల్ని విడుదల చేస్తుంది అని ఎలా చెప్తారు?” అన్నారు. యేసు వారితో, “పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే, అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కుటుంబంలో దాసునికి స్థిరమైన స్థానం ఉండదు, కానీ కుమారుడు ఎల్లప్పుడు కుటుంబ సభ్యునిగానే ఉంటాడు. అందుకే కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే, మీరు నిజంగా విడుదల పొందినవారిగా ఉంటారు. మీరు అబ్రాహాము సంతతివారని నాకు తెలుసు. అయినా మీలో నా మాటకు చోటు లేదు, కనుక మీరు నన్ను చంపడానికి మార్గం కొరకు చూస్తున్నారు. నేను నా తండ్రి సన్నిధిలో చూసినవాటిని మీకు చెప్తున్నాను, మీరు మీ తండ్రి దగ్గరి నుండి విన్నవాటిని చేస్తున్నారు” అన్నారు. దానికి వారు, “అబ్రాహాము మా తండ్రి” అని జవాబిచ్చారు. అందుకు యేసు, “మీరు అబ్రాహాము పిల్లలైతే, మీరు అబ్రాహాము చేసిన వాటిని చేస్తారు. కాని నేను దేవుని నుండి విన్న సత్యాన్ని మీకు చెప్పినందుకు మీరు నన్ను చంపే మార్గం కొరకు చూస్తున్నారు, అబ్రాహాము అలాంటివి చేయలేదు. మీ సొంత తండ్రి చేసిన పనులనే మీరు చేస్తున్నారు” అని వారితో అన్నారు. అందుకు వారు “మేము అక్రమ సంతానం కాదు, మాకు ఉన్న ఏకైక తండ్రి దేవుడే” అని ఎదురు చెప్పారు. యేసు వారితో, “దేవుడు మీ తండ్రియైతే, మీరు నన్ను ప్రేమించేవారు. ఎందుకంటే నేను దేవుని యొద్ద నుండే ఇక్కడికి వచ్చాను. నా అంతట నేను రాలేదు; దేవుడే నన్ను పంపించారు. నా భాష మీకెందుకు స్పష్టంగా లేదు? ఎందుకంటే నేను చెప్తుంది మీరు వినలేకపోతున్నారు. మీరు మీ తండ్రియైన అపవాదికి చెందినవారు, కనుక మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. మొదటి నుండి వాడు హంతకుడే, వానిలో సత్యం లేదు, కనుక వాడు సత్యాన్ని పట్టుకుని ఉండడు. వాడు అబద్ధం చెప్పినప్పుడు, వాడు తన స్వభాషలో మాట్లాడతాడు, ఎందుకంటే వాడు అబద్ధికుడు మరియు అబద్ధాలకు తండ్రి. అయినాసరే నేను మీకు నిజం చెప్తున్నా, మీరు నన్ను నమ్మరు! నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను సత్యాన్ని చెప్తున్నప్పుడు, మీరెందుకు నన్ను నమ్మరు? దేవునికి చెందినవారు దేవుడు చెప్పే మాటలను వింటారు. మీరు దేవునికి చెందినవారు కారు కనుక మీరు ఆయన మాటలను వినరు” అని అన్నారు. అందుకు యూదులు ఆయనతో, “నీవు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవని మేము చెప్పింది నిజం కాదా?” అన్నారు. యేసు, “నేను దయ్యం పట్టినవాడను కాను, నేను నా తండ్రిని ఘనపరుస్తున్నాను, మీరు నన్ను అవమానపరుస్తున్నారు. నేను నా ఘనత కొరకు వెదకడం లేదు; కానీ ఘనత కొరకు వెదికేవాడు ఉన్నాడు, ఆయనే న్యాయమూర్తి. నా మాటలకు లోబడేవాడు ఎన్నడు చావడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని వారికి చెప్పారు. ఈ విధంగా చెప్పగానే యూదులు, “నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు మాకు తెలిసింది! అబ్రాహాము చనిపోయాడు అదే విధంగా ప్రవక్తలు కూడ చనిపోయారు, అయినా, ‘నా మాటలకు లోబడేవాడు ఎన్నడు చావడు’ అని నీవంటున్నావు. మా తండ్రియైన అబ్రాహాము కన్నా నీవు గొప్పవాడవా? అతడు చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. నిన్ను నీవు ఎవరని అనుకుంటున్నావు?” అని అడిగారు. అందుకు యేసు, “నన్ను నేను ఘనపరచుకొంటే, ఆ ఘనత వట్టిదే. మీ దేవుణ్ని మీరు చెప్తున్న, నా తండ్రియే, నన్ను ఘనపరచే వారు. మీకు ఆయన ఎవరో తెలియదు, కాని ఆయన నాకు తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదని నేను చెప్తే, నేను కూడ మీలాగే అబద్ధికునిగా ఉండేవాన్ని, కానీ ఆయన నాకు తెలుసు మరియు నేను ఆయన మాటకు లోబడతాను. మీ తండ్రియైన అబ్రాహాము నేనున్న రోజును చూడాలన్న ఆలోచనకే ఆనందించాడు; అతడు దానిని చూసి, సంతోషించాడు” అని చెప్పారు. అందుకు యూదులు, “నీకు యాభై సంవత్సరాలు కూడ లేవు, నీవు అబ్రాహామును చూశావా!” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “అబ్రాహాము పుట్టక ముందే నేనున్నాను! అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. అప్పుడు వారు ఆయన మీద విసరడానికి రాళ్ళు తీసారు, కానీ యేసు వారికి కనబడకుండా దేవాలయం నుండి బయటకు వెళ్లిపోయారు.

షేర్ చేయి
Read యోహాను 8

యోహాను 8:1-59 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు ఒలీవ కొండకు వెళ్ళాడు. ఉదయం పెందలకడనే యేసు తిరిగి దేవాలయంలోకి వచ్చాడు. అప్పుడు ప్రజలంతా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన కూర్చుని వారికి ఉపదేశించడం మొదలుపెట్టాడు. అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వారు ఆమెను వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. ఆమెను అందరి మధ్య నిలబెట్టారు. వారు ఆయనతో, “బోధకా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు. ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. దాంతో ఆయన తల ఎత్తి చూసి, “మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు” అని వారితో చెప్పి మళ్ళీ వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు. ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది. యేసు తలెత్తి ఆమెను చూశాడు. “నీమీద నిందారోపణ చేసిన వారంతా ఎక్కడమ్మా? నీకు ఎవరూ శిక్ష వేయలేదా?” అని అడిగాడు. ఆమె, “లేదు ప్రభూ” అంది. దానికి యేసు, “నేను కూడా నీకు శిక్ష వేయను. వెళ్ళు, ఇంకెప్పుడూ పాపం చేయకు” అన్నాడు. మళ్ళీ యేసు ఇలా అన్నాడు, “నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. జీవపు వెలుగు కలిగి ఉంటాడు.” అప్పుడు పరిసయ్యులు, “నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం సరైనది కాదు” అన్నారు. జవాబుగా యేసు, “నా గురించి నేను సాక్ష్యం చెప్పినా అది సత్యమే అవుతుంది. ఎందుకంటే నేను ఎక్కణ్ణించి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. నేను ఎక్కణ్ణించి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. మీరు శరీర సంబంధంగా తీర్పు తీరుస్తారు. నేను ఎవరికీ తీర్పు తీర్చను. అయినా నేను ఒంటరిని కాదు. నేను నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నేను తీర్పు తీర్చినా అది సత్యమే అవుతుంది. ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం సత్యం అవుతుందని మీ ధర్మశాస్త్రంలోనే రాసి ఉంది కదా! నా గురించి సాక్ష్యం నేను చెప్పుకొంటాను. నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు” అన్నాడు. వారు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. అందుకు యేసు, “మీకు నేను గానీ నా తండ్రి గానీ తెలియదు. ఒకవేళ నేను మీకు తెలిస్తే నా తండ్రి కూడా తెలిసే ఉంటాడు” అన్నాడు. ఆయన దేవాలయంలో ఉపదేశిస్తూ చందా పెట్టె ఉన్నచోట ఈ మాటలు చెప్పాడు. ఆయన సమయం రాలేదు కాబట్టి ఎవరూ ఆయనను పట్టుకోలేదు. మరోసారి ఆయన, “నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళాక మీరు నాకోసం వెతుకుతారు. కానీ మీ పాపాల్లోనే మీరు మరణిస్తారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు” అని వారితో చెప్పాడు. దానికి యూదులు, “‘నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు’ అంటున్నాడేమిటి? ఆత్మహత్య చేసుకుంటాడా ఏమిటి?” అని చెప్పుకున్నారు. అప్పుడు ఆయన, “మీరు కింద ఉండేవారు. నేను పైన ఉండేవాణ్ణి. మీరు ఈ లోకానికి సంబంధించిన వారు. నేను ఈ లోకానికి సంబంధించిన వాణ్ణి కాదు. కాబట్టి మీరు మీ పాపాల్లోనే మరణిస్తారని చెప్పాను. ఎందుకంటే నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే మరణిస్తారు” అని వారితో చెప్పాడు. కాబట్టి వారు “అసలు నువ్వు ఎవరు?” అని అడిగారు. అప్పుడు ఆయన వారితో ఇలా చెప్పాడు. “నేను ప్రారంభం నుండి ఎవరినని మీకు చెబుతూ ఉన్నానో ఆయననే. మీ గురించి చెప్పడానికీ మీకు తీర్పు తీర్చడానికీ నాకు చాలా సంగతులు ఉన్నాయి. అయితే నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన దగ్గర విన్న విషయాలనే ఈ లోకానికి బోధిస్తున్నాను.” తండ్రి అయిన దేవుని గురించి ఆయన తమకు చెబుతున్నాడని వారు అర్థం చేసుకోలేక పోయారు. కాబట్టి యేసు, “మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు ‘ఉన్నవాడు’ అనేవాణ్ణి నేనే అని తెలుసుకుంటారు. నా స్వంతగా నేను ఏమీ చేయననీ తండ్రి నాకు చెప్పినట్టుగానే ఈ సంగతులు మాట్లాడుతున్నాననీ మీరు గ్రహిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన వాటినే నేను చేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన నన్ను విడిచి పెట్టలేదు” అని చెప్పాడు. ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగానే చాలామంది ఆయనలో నమ్మకముంచారు. కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు. అప్పుడు వారు, “మేము అబ్రాహాము వారసులం. మేము ఎప్పుడూ ఎవరికీ బానిసలుగా ఉండలేదే. ‘మీరు విడుదల పొందుతారు’ అని ఎలా అంటున్నావు?” అన్నారు. దానికి యేసు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను, పాపం చేసే ప్రతివాడూ పాపానికి బానిసే. బానిస ఎప్పుడూ ఇంట్లో ఉండడు. కానీ కుమారుడు ఎప్పుడూ ఇంట్లోనే నివాసం ఉంటాడు. కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. మీరు అబ్రాహాము వారసులని నాకు తెలుసు. అయినా మీలో నా వాక్కుకు చోటు లేదు. కాబట్టే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఉపదేశించేదంతా నా తండ్రి దగ్గర నేను చూసినదే. అలాగే మీరు మీ తండ్రి దగ్గర విన్న సంగతుల ప్రకారమే పనులు చేస్తున్నారు” అని చెప్పాడు. దానికి వారు, “మా తండ్రి అబ్రాహాము” అన్నారు. అప్పుడు యేసు, “మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన పనులే చేసేవారు. దేవుని దగ్గర నేను విన్న సత్యాన్ని మీకు చెప్పినందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారుగా. అయితే అబ్రాహాము అలా చేయలేదు. మీరు మీ తండ్రి పనులే చేస్తున్నారు” అని వారితో చెప్పాడు. దానికి వారు, “మేము వ్యభిచారం వల్ల పుట్టినవారం కాదు. మాకు ఒక్కడే తండ్రి. ఆయన దేవుడు” అన్నారు. యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. నేను వచ్చింది దేవుని దగ్గర్నుంచే. నా అంతట నేను రాలేదు. ఆయనే నన్ను పంపించాడు. నా మాటలు మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా మాట వినే మీకు సహనం లేదు. మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి. నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించ గలరు? నేను సత్యాన్నే చెబుతున్నా మీరెందుకు నమ్మడం లేదు? ఒకడు దేవునికి చెందినవాడు అయితే దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు.” అందుకు యూదులు, “నువ్వు సమరయ వాడివి, నీకు దయ్యం పట్టింది అని మేము చెబుతున్న మాట నిజమే!” అన్నారు. అప్పుడు యేసు, “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తున్నాను. మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను నా పేరు ప్రతిష్టల కోసం వెతకడం లేదు. అలా వెదికే వాడూ, తీర్పు తీర్చే వాడూ వేరే ఉన్నాడు. మీకు కచ్చితంగా చెబుతున్నాను. నా మాటలు అంగీకరించిన వాడు మరణం రుచి చూడడు” అని జవాబిచ్చాడు. అందుకు యూదులు, “నీకు దయ్యం పట్టిందని ఇప్పుడు మేము స్పష్టంగా తెలుసుకున్నాం. అబ్రాహామూ, ప్రవక్తలూ చనిపోయారు. ‘నా మాట విన్న వాడు మరణం రుచి చూడడు’ అని నువ్వు అంటున్నావు. మన తండ్రి అబ్రాహాము చనిపోయాడు కదా! నువ్వు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలూ చనిపోయారు. అసలు నువ్వు ఎవరినని చెప్పుకుంటున్నావు?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “నన్ను నేనే గౌరవించుకుంటే ఆ గౌరవం అంతా ఒట్టిది. ఎవరిని మా దేవుడు అని మీరు చెప్పుకుంటున్నారో ఆయనే నా తండ్రి. ఆయనే నన్ను మహిమ పరుస్తున్నాడు. మీకు ఆయన ఎవరో తెలియదు. నాకు ఆయన తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదు అని నేను చెబితే మీలాగా నేనూ అబద్ధికుడిని అవుతాను. కానీ నాకు ఆయన తెలుసు. ఆయన మాటను నేను పాటిస్తాను. నా రోజును చూడడం మీ తండ్రి అబ్రాహాముకు సంతోషం. అతడు దాన్ని చూసి ఎంతో సంతోషించాడు” అన్నాడు. అందుకు యూదులు, “నీకింకా యాభై సంవత్సరాలు కూడా లేవు. నువ్వు అబ్రాహామును చూశావా?” అన్నారు. దానికి జవాబుగా యేసు “మీతో కచ్చితంగా చెబుతున్నాను. అబ్రాహాము పుట్టక ముందు నుంచీ నేను ఉన్నాను” అన్నాడు. అప్పుడు వారు ఆయన మీద విసరడానికి రాళ్ళు తీశారు. కానీ యేసు దేవాలయంలో దాగి అక్కడనుంచి బయటకు వెళ్ళిపోయాడు.

షేర్ చేయి
Read యోహాను 8

యోహాను 8:1-59 పవిత్ర బైబిల్ (TERV)

యేసు మళ్ళీ ఒలీవల చెట్ల కొండ మీదికి వెళ్ళాడు. సూర్యోదయం అవుతుండగా ఆయన మళ్ళీ మందిరంలో కనిపించాడు. అక్కడ ప్రజలు ఆయన చుట్టూ సమావేశమయ్యారు. వాళ్ళకు బోధించటానికి ఆయన కూర్చున్నాడు. వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు కలిసి అక్కడికి తీసుకొని వచ్చారు. ఆమెను అందరి ముందు నిలుచో బెట్టి యేసుతో, “బోధకుడా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. మోషే, ధర్మశాస్త్రంలో యిలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపుమని ఆజ్ఞాపించాడు. మీరేమంటారు?” అని అడిగారు. ఆయన్ని పరీక్షించటానికి ఈ ప్రశ్న వేసారు. ఆయన్ని శిక్షించటానికి కారణం దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. కాని యేసు వంగి, నేలపై తన వ్రేలితో వ్రాయటం మొదలు పెట్టాడు. వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. యేసు తలెత్తి చూస్తూ, “మీలో పాపం చెయ్యనివాడు ఎవరైనా ఉంటే, అతడు ఆమెపై మొదటిరాయి విసర వచ్చు!” అని అన్నాడు. ఇలా అన్నాక, మళ్ళీ క్రిందికి వంగి నేలపై వ్రాస్తూ ఉన్నాడు. ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు. యేసు తలెత్తి చూస్తూ, “వాళ్ళెక్కడమ్మా! నిన్నెవ్వరూ శిక్షించ లేదా?” అని అడిగాడు. “లేదు ప్రభూ!” అని ఆమె అన్నది. “నేను కూడా శిక్ష విధించను. వెళ్ళు! ఇకనుండి పాపం చెయ్యకు!” అని అన్నాడు. యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించినవాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్ళకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు. పరిసయ్యులు సవాలు చేస్తూ, “నీ పక్షాన నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం పనికి రాదు” అని అన్నారు. యేసు సమాధానం చెబుతూ, “నేను నా పక్షాన సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు. ఎందుకంటే, నేనెక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కాని నేను ఎక్కడినుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. మీరు అందరి మానవులవలె తీర్పుచెబుతారు. నేను ఎవరిపైనా తీర్పు చెప్పను. కాని నేను ఒక వేళ తీర్పు చెబితే నా తీర్పు సత్యసమ్మతమైనది. ఎందుకంటే, నేను ఒంటరిగా తీర్పు చెప్పటం లేదు. నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. ఇద్దరు కలసి సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చని మీ ధర్మశాస్త్రంలో వ్రాసారు. నేను నా పక్షాన సాక్ష్యం చెబుతున్నాను. నా యింకొక సాక్షి నన్ను పంపిన ఆ తండ్రి” అని అన్నాడు. అప్పుడు వాళ్ళు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. యేసు, “మీకు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో తెలియదు. నేనెవరినో తెలిస్తే, నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు. ఆయనీ విషయాలన్నీ మందిరంలో కానుకలు వేసే చోట నిలుచొని బోధిస్తూ మాట్లాడాడు. అయినా ఆయన్నెవరూ బంధించలేదు; కారణం? ఆయన ఘడియ యింకా రాలేదు! యేసు మరొకసారి వాళ్ళతో, “నేను వెళ్తున్నాను. మీరు నా కోసం వెతుకుతారు. కాని నేను వెళ్ళేచోటికి మీరు రాలేరు. ఎందుకంటే మీరు మీ పాపాల్లో మరణిస్తారు” అని అన్నాడు. యూదులు, “ఆత్మహత్య చేసుకొంటాడా? అందుకేనా, ‘నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు’ అని అంటున్నాడు” అని అన్నారు. యేసు, “మీరు యిక్కడి వాళ్ళు. నేను పైనుండి వచ్చిన వాణ్ణి. మీరు ఈలోకపు వాళ్ళు. నేను ఈ లోకపు వాణ్ణి కాదు. మీరు మీ పాపాలతో మరణిస్తారు” అని అన్నాడు. వాళ్ళు, “అది సరే కాని, నీవెవరు?” అని అడిగారు. యేసు, “నేను యింతవరకు ఎవర్నని చెబుతున్నానో ఆయన్నే” అని అన్నాడు. “నేను మీ తీర్పు విషయంలో ఎన్నో సంగతులు చెప్పగలను. కాని దానికి మారుగా నన్ను పంపిన వాని నుండి విన్న వాటిని మాత్రమే ప్రపంచానికి చెబుతున్నాను. ఆయన నమ్మదగినవాడు” అని అన్నాడు. ఆయన తన తండ్రిని గురించి చెబుతున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోలేదు. అందువలన యేసు వాళ్ళతో, “మనుష్యకుమారుణ్ణి పైకి లేపినప్పుడు ఆయన నేనేనని మీరు తెలుసుకుంటారు. అంతేకాక స్వతహాగా నేను ఏమీ చెయ్యనని, నా తండ్రి బోధించిన వాటిని మాత్రమే చెబుతానని తెలుసుకుంటారు. నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను అన్ని వేళలా ఆయనకు యిష్టమైనవే చేస్తాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలి వేయడు” అని అన్నాడు. ఆయన చెప్పిన విషయాలు విని అనేకులు ఆయన విశ్వాసులైయ్యారు. తనను నమ్మిన యూదులతో యేసు, “మీరు నా బోధనలు పాటిస్తే, మీరు నా నిజమైన శిష్యులు. అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసు కుంటారు. ఆ సత్యమే మీకు స్వేచ్ఛ కలిగిస్తుంది” అని అన్నాడు. వాళ్ళు, “మేము అబ్రాహాము వంశీయులం. మేమింతవరకు ఎవ్వరికి బానిసలుగా ఉండలేదు. మరి మాకు స్వేచ్ఛ కలుగుతుందని ఎందుకంటున్నావు?” అని అన్నారు. యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పాపం చేసిన ప్రతి ఒక్కడూ పాపానికి బానిస ఔతాడు. బానిసకు కుటుంబంలో శాశ్వతమైన స్థానం ఉండదు. కాని కుమారుడు శాశ్వతంగా ఆ యింటికి చెందినవాడు. కుమారుడు స్వేచ్ఛ కలిగిస్తే మీకు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు. అయినా మీకు నా సందేశం నచ్చలేదు. కనుక నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. నేను నా తండ్రి సమక్షంలో చూసిన దాన్ని చెబుతున్నాను. మీరు మీ తండ్రి నుండి విన్నదాన్ని చేస్తున్నారు” అని అన్నాడు. “అబ్రాహాము మా తండ్రి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము చేసినట్లు చేసేవాళ్ళు! నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవర్తించలేదు. మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” అని అన్నాడు. వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి” అని అన్నారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను ప్రేమించే వాళ్ళు. స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను పంపాడు. మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. మీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చడమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి స్వభావము. కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడుతాడు. వాడు అబద్ధానికి తండ్రి. “నేను నిజం చెప్పటంవల్ల మీరు నమ్మటంలేదు. నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు. దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.” “నీవు సమరయ దేశస్థుడవని, నీకు దయ్యం పట్టిందని మేమనటంలో నిజం లేదా?” అని వాళ్ళు ప్రశ్నించారు. యేసు, “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తాను. మీరు నన్ను అగౌరవ పరుస్తున్నారు. నేను నా కీర్తిని కోరటం లేదు. కాని నా కీర్తి కోరేవాడొకాయన ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి. ఇది నిజం. నా బోధ అనుసరించిన వాడు ఎన్నటికీ చావుచూడడు” అని అన్నాడు. ఇది విని యూదులు బిగ్గరగా, “నీకు దయ్యం పట్టిందని మాకిప్పుడు తెలిసింది! అబ్రాహాము చనిపోయాడు. అలాగే ప్రవక్తలు చనిపోయారు. అయినా నీ బోధన అనుసరించిన వాడు చనిపోడని అంటున్నావు. నీవు మా తండ్రి అబ్రాహాము కన్నాగొప్ప వాడవా? అతడు చనిపొయ్యాడు. ప్రవక్తలు కూడా చనిపొయ్యారు. నీ మనస్సులో నీవెవరవనుకుంటున్నావు?” అని అన్నారు. యేసు, “నన్ను నేను పొగుడుకుంటే ఆ పొగడ్తకు అర్థం లేదు. నన్ను పొగిడేవాడు నా తండ్రి. ఆయన మీ దేవుడని మీరే అంటున్నారు. ఆయన మీకు తెలియదు. కాని నాకాయన తెలుసు. ఆయన నాకు తెలియదని అంటే, నేను మీలాగే అబద్ధాలాడినట్లవుతుంది. కాని ఆయన నాకు తెలుసు. ఆయన మాట నేను పాటిస్తాను. మీ తండ్రి అబ్రాహాము నా కాలాన్ని చూడగలనని గ్రహించిన వెంటనే ఆనందపడ్డాడు. అతడు చూశాడు: ఆనంద పడ్డాడు” అని అన్నాడు. ఆ కారణంగా యూదులు, “నీకింకా యాభై ఏళ్ళైనా నిండలేదు. నీవు అబ్రాహామును చూసావా?” అని అన్నారు. యేసు, “ఇది నిజం. అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను” అని అన్నాడు. ఇది విని వాళ్ళు ఆయన్ని కొట్టాలని రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. కాని యేసు వాళ్ళకు కనిపించకుండా దాక్కొని ఆ గుంపు నుండి వెళ్ళి పోయాడు.

షేర్ చేయి
Read యోహాను 8