యోహాను 6:26-29
యోహాను 6:26-29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకు యేసు వారితో, “మీరు రొట్టెలను తిని తృప్తి పొందారు కనుక నన్ను వెదుకుతున్నారు తప్ప, నేను చేసిన అద్బుత క్రియలను చూసినందుకు కాదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు పాడైపోయే ఆహారం కొరకు ప్రయాసపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచివుండే ఆహారం కొరకు ప్రయాసపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేసారు” అని చెప్పారు. అప్పుడు వారు ఆయనను, “దేవుని పనులను చేయడానికి మేమేమి చేయాలి?” అని అడిగారు. అందుకు యేసు, “ఆయన పంపినవానిని నమ్మడమే దేవుని పని” అని చెప్పారు.
యోహాను 6:26-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు, “కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు, రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు. పాడైపోయే ఆహారం కోసం కష్టపడవద్దు, నిత్యజీవం కలగజేసే పాడైపోని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు” అని చెప్పాడు. అప్పుడు వారు, “దేవుని పనులు చేయాలంటే మేమేం చేయాలి?” అని ఆయనను అడిగారు. దానికి యేసు, “దేవుడు పంపిన వ్యక్తి పైన విశ్వాసముంచడమే దేవుని కార్యాలు చేయడమంటే” అన్నాడు.
యోహాను 6:26-29 పవిత్ర బైబిల్ (TERV)
యేసు, “ఇది నిజం. అద్భుతాల్ని చూసినందువలన నన్ను మీరు వెతకటం లేదు. రొట్టెలు తిని మీ కడుపులు నింపుకొన్నందుకు నా కోసం వెతుకుతున్నారు. చెడిపోయే ఆహారం కోసం పాటు పడకండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటు పడండి. దాన్ని మనుష్యకుమారుడు మీకిస్తాడు. ఆయన పై తండ్రి ఆయన దేవుడు తన అంగీకార ముద్రవేశాడు” అని చెప్పాడు. వాళ్ళు ఆయన్ని, “దైవకార్యం చెయ్యాలంటే మేము ఏమి చెయ్యాలి?” అని అడిగారు. యేసు, “ఆయన్నిపంపిన వాణ్ణి నమ్మటమే దైవకార్యం” అని సమాధానం చెప్పాడు.
యోహాను 6:26-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు –మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను. వారు–మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా యేసు–ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.