యోహాను 6:23-27
యోహాను 6:23-27 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రభువు కృతఙ్ఞతలు చెల్లించిన తర్వాత వారు రొట్టెలను తిన్న ప్రాంతానికి కొన్ని చిన్న పడవలు తిబెరియ నుండి వచ్చాయి. ఆ పడవలలో వచ్చిన ఆ జనసమూహం యేసు మరియు ఆయన శిష్యులు అక్కడ లేరని గ్రహించి, వారు మళ్ళీ పడవలను ఎక్కి యేసును వెదుకుతూ కపెర్నహూముకు వెళ్లారు. వారు ఆయనను సరస్సు అవతలి ఒడ్డున చూసినప్పుడు, “రబ్బీ, నీవు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు?” అని వారు ఆయనను అడిగారు. అందుకు యేసు వారితో, “మీరు రొట్టెలను తిని తృప్తి పొందారు కనుక నన్ను వెదుకుతున్నారు తప్ప, నేను చేసిన అద్బుత క్రియలను చూసినందుకు కాదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు పాడైపోయే ఆహారం కొరకు ప్రయాసపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచివుండే ఆహారం కొరకు ప్రయాసపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేసారు” అని చెప్పారు.
యోహాను 6:23-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే ప్రభువు కృతజ్ఞతలు చెప్పి వారికి రొట్టెలు పంచగా వారు తిన్న స్థలానికి దగ్గరలో ఉన్న తిబెరియ నుండి వేరే చిన్న పడవలు వచ్చాయి. యేసూ ఆయన శిష్యులూ అక్కడ లేక పోవడంతో ప్రజలందరూ ఆ చిన్న పడవలెక్కి యేసును వెతుకుతూ కపెర్నహూముకు వచ్చారు. సముద్రం అవతలి తీరాన వారు ఆయనను చూశారు. “బోధకా, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు?” అని అడిగారు. యేసు, “కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు, రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు. పాడైపోయే ఆహారం కోసం కష్టపడవద్దు, నిత్యజీవం కలగజేసే పాడైపోని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు” అని చెప్పాడు.
యోహాను 6:23-27 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళు యేసు, ఆయన శిష్యులు అక్కడ లేరని గ్రహించిన వెంటనే, వెతకటానికి నిశ్చయించుకున్నారు. తిబెరియ నుండి కొన్ని పడవలు వచ్చి ఒడ్డు చేరాయి. ప్రభువు దేవునికి కృతజ్ఞత చెప్పి, రొట్టెల్ని ప్రజలకు పంచిన స్థలం దీని సమీపంలో ఉంది. వాళ్ళు ఆ పడవలెక్కి ఆయన్ని వెదుకుతూ కపెర్నహూము వెళ్ళారు. యేసు అవతలి ఒడ్డున కనిపించగానే, వాళ్ళు ఆయనతో, “రబ్బీ! మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?” అని అడిగారు. యేసు, “ఇది నిజం. అద్భుతాల్ని చూసినందువలన నన్ను మీరు వెతకటం లేదు. రొట్టెలు తిని మీ కడుపులు నింపుకొన్నందుకు నా కోసం వెతుకుతున్నారు. చెడిపోయే ఆహారం కోసం పాటు పడకండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటు పడండి. దాన్ని మనుష్యకుమారుడు మీకిస్తాడు. ఆయన పై తండ్రి ఆయన దేవుడు తన అంగీకార ముద్రవేశాడు” అని చెప్పాడు.
యోహాను 6:23-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని–బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు –మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.