యోహాను 6:22-35

యోహాను 6:22-35 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

తర్వాత రోజు సరస్సు అవతలి వైపు ఉన్న జనసమూహం అక్కడ ఒకే ఒక పడవ ఉండడం చూసి యేసు తన శిష్యులతో కలిసి పడవలో ఎక్కి వెళ్లలేదని కేవలం శిష్యులు మాత్రమే వెళ్లారని గ్రహించారు. ప్రభువు కృతఙ్ఞతలు చెల్లించిన తర్వాత వారు రొట్టెలు తిన్న ప్రాంతానికి కొన్ని చిన్న పడవలు తిబెరియ నుండి వచ్చాయి. ఆ పడవలలో వచ్చిన ఆ జనసమూహం యేసు ఆయన శిష్యులు అక్కడ లేరని గ్రహించి మళ్ళీ పడవలు ఎక్కి యేసును వెదుకుతూ కపెర్నహూముకు వెళ్లారు. వారు ఆయనను సరస్సు అవతలి ఒడ్డున చూసినప్పుడు, “రబ్బీ, నీవు ఇక్కడకు ఎప్పుడు వచ్చావు?” అని వారు ఆయనను అడిగారు. అందుకు యేసు వారితో, “మీరు రొట్టెలు తిని తృప్తి పొందారు కాబట్టి నన్ను వెదుకుతున్నారు తప్ప నేను చేసిన అద్భుత కార్యాలను చూసినందుకు కాదని నేను మీతో చెప్పేది నిజము. మీరు పాడైపోయే ఆహారం కోసం కష్టపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచి ఉండే ఆహారం కోసం కష్టపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేశారు” అని చెప్పారు. అప్పుడు వారు ఆయనను, “దేవుని పనులను చేయడానికి మేమేమి చేయాలి?” అని అడిగారు. అందుకు యేసు, “ఆయన పంపినవానిని నమ్మడమే దేవుని పని” అని చెప్పారు. కాబట్టి వారు, “మేము చూసి నిన్ను నమ్మడానికి నీవు ఏ అద్భుత కార్యాన్ని చేస్తున్నావు? ఏమి చేస్తావు? మన పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారని, ‘తినడానికి వారికి పరలోకం నుండి ఆహారం ఇచ్చారు’ అని వ్రాయబడి ఉంది కదా!” అని ఆయనను అడిగారు. యేసు వారితో, “నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను, మీకు పరలోకం నుండి ఆహారం ఇచ్చింది మోషే కాదు, పరలోకం నుండి నా తండ్రే నిజమైన ఆహారం మీకిస్తారు. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేది దేవుడు ఇచ్చే ఆహారమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు. అందుకు వారు, “అయ్యా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడు ఇవ్వు” అన్నారు. అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు.

షేర్ చేయి
Read యోహాను 6

యోహాను 6:22-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాతి రోజు సముద్రానికి ఇవతల ఉండిపోయిన జన సమూహం అక్కడికి వచ్చారు. అక్కడ ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. మరో పడవ వారికి కనిపించలేదు. శిష్యులు యేసు లేకుండానే పడవలో ప్రయాణమై వెళ్ళారని వారు తెలుసుకున్నారు. అయితే ప్రభువు కృతజ్ఞతలు చెప్పి వారికి రొట్టెలు పంచగా వారు తిన్న స్థలానికి దగ్గరలో ఉన్న తిబెరియ నుండి వేరే చిన్న పడవలు వచ్చాయి. యేసూ ఆయన శిష్యులూ అక్కడ లేక పోవడంతో ప్రజలందరూ ఆ చిన్న పడవలెక్కి యేసును వెతుకుతూ కపెర్నహూముకు వచ్చారు. సముద్రం అవతలి తీరాన వారు ఆయనను చూశారు. “బోధకా, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు?” అని అడిగారు. యేసు, “కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు, రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు. పాడైపోయే ఆహారం కోసం కష్టపడవద్దు, నిత్యజీవం కలగజేసే పాడైపోని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు” అని చెప్పాడు. అప్పుడు వారు, “దేవుని పనులు చేయాలంటే మేమేం చేయాలి?” అని ఆయనను అడిగారు. దానికి యేసు, “దేవుడు పంపిన వ్యక్తి పైన విశ్వాసముంచడమే దేవుని కార్యాలు చేయడమంటే” అన్నాడు. వారు, “అలా అయితే మేము నిన్ను నమ్మడానికి నువ్వు ఏ అద్భుతం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తావు? ‘వారు తినడానికి పరలోకం నుండి ఆయన ఆహారం ఇచ్చాడు’ అని రాసి ఉన్నట్టుగా మన పూర్వీకులు అరణ్యంలో మన్నాను భుజించారు” అని చెప్పారు. అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “పరలోకం నుండి వచ్చే ఆహారాన్ని మోషే మీకివ్వలేదు. పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారాన్ని నా తండ్రే మీకిస్తున్నాడు. అందుచేత దేవుడిచ్చే ఆహారం ఏమిటంటే, పరలోకంనుంచి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే” అని వారితో అన్నాడు.” అందుకు వారు, “ప్రభూ, మాకు ఎప్పుడూ ఈ ఆహారాన్ని ఇస్తూ ఉండు” అన్నారు. దానికి జవాబుగా యేసు, “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు.

షేర్ చేయి
Read యోహాను 6

యోహాను 6:22-35 పవిత్ర బైబిల్ (TERV)

తెల్లవారింది. అవతలి ఒడ్డున ఉండి పోయిన ప్రజలకు అక్కడ ఒకే పడవ ఉందని, యేసు శిష్యులతో కలిసి వెళ్ళలేదని, శిష్యులు మాత్రమే వెళ్ళారని, తెలుసు కొన్నారు. వాళ్ళు యేసు, ఆయన శిష్యులు అక్కడ లేరని గ్రహించిన వెంటనే, వెతకటానికి నిశ్చయించుకున్నారు. తిబెరియ నుండి కొన్ని పడవలు వచ్చి ఒడ్డు చేరాయి. ప్రభువు దేవునికి కృతజ్ఞత చెప్పి, రొట్టెల్ని ప్రజలకు పంచిన స్థలం దీని సమీపంలో ఉంది. వాళ్ళు ఆ పడవలెక్కి ఆయన్ని వెదుకుతూ కపెర్నహూము వెళ్ళారు. యేసు అవతలి ఒడ్డున కనిపించగానే, వాళ్ళు ఆయనతో, “రబ్బీ! మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?” అని అడిగారు. యేసు, “ఇది నిజం. అద్భుతాల్ని చూసినందువలన నన్ను మీరు వెతకటం లేదు. రొట్టెలు తిని మీ కడుపులు నింపుకొన్నందుకు నా కోసం వెతుకుతున్నారు. చెడిపోయే ఆహారం కోసం పాటు పడకండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటు పడండి. దాన్ని మనుష్యకుమారుడు మీకిస్తాడు. ఆయన పై తండ్రి ఆయన దేవుడు తన అంగీకార ముద్రవేశాడు” అని చెప్పాడు. వాళ్ళు ఆయన్ని, “దైవకార్యం చెయ్యాలంటే మేము ఏమి చెయ్యాలి?” అని అడిగారు. యేసు, “ఆయన్నిపంపిన వాణ్ణి నమ్మటమే దైవకార్యం” అని సమాధానం చెప్పాడు. కనుక వాళ్ళు ఆయనతో చెప్పారు, “అలాగైతే, మేము నమ్మేటట్లు ఏ అద్భుత కార్యాన్ని చేసి చూపిస్తారు? మా ముత్తాతలు ఎడారుల్లో మన్నాను తిన్నారు. దీన్ని గురించి గ్రంథాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన, వాళ్ళు తినటానికి పరలోకం నుండి ఆహారం యిచ్చాడు.” యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పరలోకం నుండి నిజమైన ఆహారం ఇచ్చింది మోషే కాదు. దాన్ని యిచ్చేవాడు నా తండ్రి. ఆ జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తే. ఆయన లోకానికి జీవాన్నిస్తాడు” అని అన్నాడు. వాళ్ళు, “అయ్యా! యికనుండి ఈ ఆహారం మాకివ్వండి!” అని అన్నారు. యేసు ఈ విధంగా చెప్పాడు: “నేను జీవాన్నిచ్చే ఆహారాన్ని, నా దగ్గరకు వచ్చినవాడు ఆకలితో పోడు. నన్ను నమ్మినవానికి ఎన్నడూ దాహం కలుగదు.

షేర్ చేయి
Read యోహాను 6

యోహాను 6:22-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతోకూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని–బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు –మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను. వారు–మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా యేసు–ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. వారు–అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు–పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు. పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావునవారు–ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను–జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.

షేర్ చేయి
Read యోహాను 6

యోహాను 6:22-35 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)