యోహాను 5:36-47

యోహాను 5:36-47 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

“అయితే యోహాను చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. అదేమంటే పూర్తి చేయమని తండ్రి నాకిచ్చిన పనులు అనగా నేను చేస్తున్న పనులే తండ్రి నన్ను పంపాడని సాక్ష్యంగా ఉన్నాయి. నన్ను పంపిన తండ్రి తానే నా గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మీరు ఆయన స్వరాన్ని ఎప్పుడు వినలేదు, ఆయన రూపాన్ని ఎప్పుడు చూడలేదు, ఆయన పంపినవానిని మీరు నమ్మరు కనుక ఆయన వాక్యం మీలో నివసించదు. మీరు వాటిని జాగ్రత్తగా పఠిస్తున్నారు ఎందుకంటే మీరు లేఖనాల్లో మీకు నిత్యజీవం ఉందని మీరనుకొంటున్నారు. ఈ లేఖనాలే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, కాని జీవం పొందడానికి నా దగ్గరకు రావడానికి మీరు నిరాకరిస్తున్నారు. “నేను మనుష్యుల మెప్పును అంగీకరించను. అయితే నాకు మీ గురించి తెలుసు. మీ హృదయాల్లో దేవుని ప్రేమ లేదని నాకు తెలుసు. నేను నా తండ్రి పేరట వచ్చాను కాని, మీరు నన్ను అంగీకరించలేదు; అయితే మరొకడు తన స్వంత పేరులో వచ్చినప్పుడు మీరు అతన్ని అంగీకరిస్తారు. ఏకైక దేవుని నుండి వచ్చే కీర్తిని వెదకకుండా ఒకరి నుండి ఒకరికి వచ్చే కీర్తిని అంగీకరించే మీరు నన్ను ఎలా నమ్ముతారు? “నేను తండ్రి ముందు మీ మీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీరు నిరీక్షణ ఉంచిన మోషేనే మీ మీద నేరం మోపుతాడు. మీరు మోషేను నమ్మితే, నన్ను నమ్మి ఉండేవారు, ఎందుకంటే అతడు వ్రాసింది నా గురించే. కానీ అతడు వ్రాసిన దానినే మీరు నమ్మడం లేదు, అలాంటప్పుడు నేను చెప్పేది ఎలా నమ్ముతారు?”

షేర్ చేయి
Read యోహాను 5

యోహాను 5:36-47 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అయితే యోహాను నా గురించి చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. నేను చేయడానికి నా తండ్రి నాకిచ్చిన పనులే ఆ సాక్ష్యం. ప్రస్తుతం నేను చేస్తున్న ఈ కార్యాలే తండ్రి నన్ను పంపాడని నా గురించి సాక్ష్యం చెబుతున్నాయి. నన్ను పంపిన తండ్రి తానే నాగురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన స్వరాన్ని మీరు ఏనాడూ వినలేదు. ఆయన స్వరూపాన్నీ ఏనాడూ చూడలేదు. ఆయన పంపించిన వ్యక్తిని మీరు నమ్మలేదు కాబట్టి ఆయన వాక్కు మీలో నిలిచి లేదు. లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే మీకు జీవం కలిగేలా నా దగ్గరికి రావడానికి మీరు ఇష్టపడడం లేదు. మనుషులు ఇచ్చే గౌరవాన్ని నేను స్వీకరించను. ఎందుకంటే దేవుని ప్రేమ మీలో లేదని నాకు తెలుసు. “నేను నా తండ్రి పేరిట వచ్చాను. మీరు నన్ను అంగీకరించలేదు. మరొకడు తన స్వంత పేరు ప్రతిష్టలతో మీ దగ్గరికి వస్తే మీరు వాణ్ణి అంగీకరిస్తారు. ఇతరుల నుండి కలిగే మెప్పును అంగీకరిస్తూ ఏకైక దేవుని నుండి కలిగే మెప్పును వెదకని మీరు ఎలా విశ్వసిస్తారు? నేను తండ్రి ముందు మీమీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీ మీద నేరం మోపడానికి మరో వ్యక్తీ ఉన్నాడు. మీరు మీ ఆశలన్నీ పెట్టుకున్న మోషేయే మీ మీద నేరం మోపుతాడు. మీరు మోషేను నమ్మినట్టయితే నన్ను కూడా నమ్ముతారు. ఎందుకంటే మోషే నా గురించే రాశాడు. మీరు అతడు రాసిందే నమ్మకపోతే ఇక నా మాటలు ఎలా నమ్ముతారు?”

షేర్ చేయి
Read యోహాను 5

యోహాను 5:36-47 పవిత్ర బైబిల్ (TERV)

“నా దగ్గర యోహాను సాక్ష్యాని కన్నా గొప్ప సాక్ష్యం ఉంది. పూర్తి చెయ్యమని తండ్రి నాకు అప్పగించిన కార్యాల్ని నేను పూర్తి చేస్తున్నాను. ఈ కార్యాలు తండ్రి నన్ను పంపాడని నిరూపిస్తాయి. నన్ను పంపిన తండ్రి స్వయంగా నన్ను గురించి చెప్పాడు. మీరాయన స్వరం ఎన్నడూ వినలేదు. ఆయన రూపాన్ని ఎప్పుడూ చూడలేదు. అంతే కాక ఆయన పంపిన వాణ్ణీ మీరు నమ్మటంలేదు. కనుక, ఆయన బోధనలు మీ మనస్సులో నివసించటంలేదు. లేఖనాల ద్వారా అనంత జీవితం లభిస్తుందని మీరు వాటిని పరిశోధిస్తారు. కాని ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం చెపుతున్నాయి. అయినా మీరు నా దగ్గరకు వచ్చి నానుండి క్రొత్త జీవితాన్ని పొందటానికి నిరాకరిస్తున్నారు. “నాకు మానవుల పొగడ్తలు అవసరం లేదు. కాని మీ గురించి నాకు తెలుసు. మీకు దేవునిపట్ల ప్రేమ లేదని నాకు తెలుసు. నేను నా తండ్రి పేరిటవచ్చాను. నన్ను మీరు అంగీకరించలేదు. కాని ఒక వ్యక్తి స్వయంగా తన పేరిట వస్తే అతణ్ణి మీరు అంగీకరిస్తారు. మీరు పరస్పరం పొగడుకుంటారు. కాని దేవుని మెప్పు పొందాలని ప్రయత్నించరు. అలాంటప్పుడు నన్ను ఎట్లా విశ్వసించగలరు? నేను మిమ్మల్ని నా తండ్రి సమక్షంలో నిందిస్తానని అనుకోకండి. మీరు ఆధారంగా చేసుకొన్న మోషే మిమ్మల్ని నిందిస్తున్నాడు. మీరు మోషేను నమ్మినట్లైతే, అతడు నన్ను గురించి వ్రాసాడు కనుక మీరు నన్ను కూడా నమ్మేవాళ్ళు. అతడు వ్రాసింది మీరు నమ్మనప్పుడు నేను చెప్పింది ఎట్లా నమ్మగలరు?” అని అన్నాడు.

షేర్ చేయి
Read యోహాను 5

యోహాను 5:36-47 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అయితే యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు. లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు. నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను. నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీకరింతురు, అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి; మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును. అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను.

షేర్ చేయి
Read యోహాను 5