యోహాను 5:2-9

యోహాను 5:2-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెరూషలేములోని గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్ద అనబడే ఒక కోనేరు ఉంది. దాని చుట్టూ అయిదు మండపాలు ఉన్నాయి. ఇక్కడ గ్రుడ్డివారు, కుంటివారు, పక్షవాతం కలవారు, అనేక రకాల రోగాలు కలిగినవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. ఎప్పటికప్పుడు ఒక దేవదూత వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించేవాడు. నీరు కదిలిన ప్రతిసారి ఆ కోనేటిలోనికి ఎవరు మొదట దిగితే వారికి ఏ రోగం ఉన్నా దాని నుండి బాగుపడేవారు. కాబట్టి అక్కడున్నవారు ఆ నీరు ఎప్పుడు కదులుతుందా అని ఎదురు చూసేవారు. ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కదల్లేని స్థితిలో ఉన్న ఒక రోగి అక్కడ ఉన్నాడు. చాలాకాలంగా అతడు అదే స్థితిలో అక్కడ పడి ఉన్నాడని తెలుసుకున్న యేసు, అతన్ని చూసి, “నీవు బాగవ్వాలని కోరుతున్నావా?” అని అడిగారు. ఆ కదల్లేనివాడు, “అయ్యా, నీరు కదిలినప్పుడు కోనేటిలోనికి దిగడానికి నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. నేను దానిలోనికి దిగడానికి ప్రయత్నించేలోపు నాకన్నా ముందు మరొకరు దిగిపోతున్నారు” అని సమాధానం చెప్పాడు. అప్పుడు యేసు వానితో, “లేచి, నీ పరుపెత్తుకొని నడువు” అన్నారు. వెంటనే అతడు స్వస్థత పొంది, తన పరుపెత్తుకొని నడిచాడు. ఇది సబ్బాతు దినాన జరిగింది.

యోహాను 5:2-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలున్నాయి. (కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు. అక్కడ ముప్ఫై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అంగ వైకల్యంతో పడి ఉన్నాడు. యేసు అతనిని చూసి అతడు అక్కడ చాలా కాలం నుండి పడి ఉన్నాడని గ్రహించాడు. అతనిని చూసి, “బాగవ్వాలని కోరిక ఉందా?” అని అడిగాడు. అప్పుడు ఆ రోగి, “అయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి ఎవరూ లేరు. నేను సర్దుకుని దిగేంతలో నాకంటే ముందు మరొకడు దిగుతాడు” అని జవాబిచ్చాడు. యేసు, “నువ్వు లేచి నీ చాప తీసుకుని నడిచి వెళ్ళు” అని అతనితో చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి బాగుపడి తన పడక తీసుకుని నడవడం మొదలు పెట్టాడు. ఆ రోజు విశ్రాంతి దినం.

యోహాను 5:2-9 పవిత్ర బైబిల్ (TERV)

అక్కడ యెరూషలేములో గొఱ్ఱెల ద్వారం దగ్గర ఒక కొలను ఉండేది. దీన్ని హీబ్రూ భాషలో బేతెస్థ అని అంటారు. దీని చుట్టూ ఐదు మండపాలు ఉండేవి. చాలామంది వికలాంగులు, గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్ళు. అక్కడున్న వాళ్ళలో ఒకడు ముప్పైఎనిమిది సంవత్సరాల నుండి రోగంతో బాధ పడ్తూ ఉన్నాడు. యేసు అతడక్కడ ఉండటం చూసాడు. చాలాకాలం నుండి అతడాస్థితిలో ఉన్నాడని గ్రహించి అతనితో, “నీకు నయం కావాలని ఉందా?” అని అడిగాడు. ఆ వికలాంగుడు, “అయ్యా! నీళ్ళు కదిలినప్పుడు ఆ కోనేరులోకి దించటానికి ఎవరూ లేరు: అయినా వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగానే, ఇంకొకడు నాకన్నా ముందు ఆ నీళ్ళలోకి దిగుతాడు” అని అన్నాడు. అప్పుడు యేసు అతనితో, “లే! నీ చాప తీసుకొని నడువు!” అని అన్నాడు. అతనికి వెంటనే నయమైపోయింది. అతడు తన చాపతీసుకొని వెళ్ళిపోయాడు. ఈ సంఘటన విశ్రాంతి రోజున జరిగింది.

యోహాను 5:2-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి–స్వస్థపడ గోరుచున్నావా అని వానినడుగగా ఆ రోగి–అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు–నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.