యోహాను 5:10-17

యోహాను 5:10-17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అందుకని యూదా నాయకులు స్వస్థత పొందినవానితో, “ఇది సబ్బాతు దినం కనుక నీవు పరుపును మోయడానికి ధర్మశాస్త్రం అనుమతించదు” అన్నారు. అయితే అతడు, “నన్ను స్వస్థపరచినవాడు ‘నీ పరుపెత్తుకొని నడువు’ అని నాతో చెప్పాడని” అన్నాడు. కనుక వారు అతన్ని, “నీకు పరుపెత్తుకొని నడవమని చెప్పింది ఎవరు?” అని అడిగారు. అయితే స్వస్థపడినవానికి ఆయన ఎవరో తెలియలేదు. ఎందుకంటే యేసు అక్కడ ఉన్న గుంపులోనికి వెళ్లిపోయారు. తర్వాత యేసు వానిని దేవాలయంలో చూసి అతనితో, “చూడు, నీవు స్వస్థపడ్డావు. పాపం చేయకు లేకపోతే నీకు ఇంతకన్నా దారుణమైంది జరుగవచ్చు” అని చెప్పారు. అతడు వెళ్లి యూదా నాయకులతో తనను బాగుచేసింది యేసు అని చెప్పాడు. యేసు ఈ కార్యాలను సబ్బాతు దినాన చేశాడని యూదా నాయకులు ఆయనను హింసించారు. యేసు వారికి సమాధానం ఇస్తూ, “నా తండ్రి నేటి వరకు కూడా తన పని చేస్తూనే ఉన్నారు, నేను కూడా చేస్తున్నాను” అని చెప్పారు.

షేర్ చేయి
Read యోహాను 5

యోహాను 5:10-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అందుకని యూదా మత నాయకులు ఆ వ్యక్తితో, “ఈ రోజు విశ్రాంతి దినం. నువ్వు పరుపును మోయకూడదు కదా!” అన్నారు. అందుకు ఆ వ్యక్తి, “నన్ను బాగుచేసిన వాడు ‘నీ చాప ఎత్తుకుని నడువు’ అని నాకు చెప్పాడు” అన్నాడు. అప్పుడు వారు, “నీకసలు నీ పరుపెత్తుకుని నడవమని చెప్పిందెవరు?” అని అతణ్ణి అడిగారు. అయితే తనని బాగు చేసినదెవరో అతనికి తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రజలంతా గుంపు కూడి ఉండడం వలన యేసు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత యేసు దేవాలయంలో అతణ్ణి చూశాడు. “చూడు, నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది. అందుకని ఇక పాపం చేయవద్దు.” అని అతడితో చెప్పాడు. వాడు యూదా నాయకుల దగ్గరికి వెళ్ళి తనను బాగు చేసింది యేసు అని చెప్పేశాడు. ఈ పనులను యేసు విశ్రాంతి దినాన చేశాడు కాబట్టి యూదులు ఆయనను బాధించారు. యేసు వారితో, “నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాను” అన్నాడు.

షేర్ చేయి
Read యోహాను 5

యోహాను 5:10-17 పవిత్ర బైబిల్ (TERV)

తత్కారణంగా యూదులు కోలుకున్న వానితో, “ఇది విశ్రాంతి రోజు, ధర్మశాస్త్రం ప్రకారం నీవు చాపమోసుక వెళ్ళటానికి వీల్లేదు” అని అన్నారు. కాని అతడు, “నాకు నయం చేసిన వ్యక్తి, ‘నీ చాప పట్టుకొని వెళ్ళు’ అని అన్నాడు” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు, “నీ చాప తీసుకొని నడవమన్న వాడెవడు?” అని అడిగారు. ప్రజల గుంపు ఉండటంవల్ల యేసు అక్కడినుండి వెళ్ళిపోయాడు. కనుక తనకు నయం చేసిన వాడెవరో అతడు చూపలేక పోయాడు. ఆ తర్వాత యేసు అతణ్ణి మందిరంలో కలుసుకొని, “చూడు! నీవు తిరిగి ఆరోగ్యవంతుడవు అయ్యావు. పాపాలు చెయ్యటం మానేయి. లేకపోతే ఇంతకన్నా ఎక్కువ కీడు సంభవించవచ్చు!” అని అన్నాడు. ఆ తర్వాత వాడు వెళ్ళి, తనకు నయం చేసిన వ్యక్తి యేసు అని చెప్పాడు. యేసు విశ్రాంతి రోజున యివన్నీ చెశాడని తెలియటం వల్ల యూదులు ఆయన్ని పీడించటం మొదలు పెట్టారు. యేసు వాళ్ళతో, “నా తండ్రి అన్ని వేళలా పని చేస్తాడు. అందువల్ల నేనుకూడా పని చేస్తున్నాను” అని సమాధానం చెప్పాడు.

షేర్ చేయి
Read యోహాను 5

యోహాను 5:10-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు–ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి. అందుకు వాడు– నన్ను స్వస్థపరచినవాడు–నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను. వారు–నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను. అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి– ఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు–నాతండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను.

షేర్ చేయి
Read యోహాను 5