యోహాను 5:1-5
యోహాను 5:1-5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కొంత కాలం తర్వాత, యూదుల పండుగకు యేసు యెరూషలేముకు వెళ్లారు. యెరూషలేములోని గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్ద అనబడే ఒక కోనేరు ఉంది. దాని చుట్టూ ఐదు మండపాలు ఉండేవి. ఇక్కడ గ్రుడ్డివారు, కుంటివారు, పక్షవాతం లాంటి రకరకాల రోగాలు కలిగినవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. [ఎప్పటికప్పుడు ఒక దేవదూత వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించేవాడు. నీరు కదిలిన ప్రతిసారి ఆ కోనేటిలోనికి ఎవరు మొదట దిగితే, వారికి ఏ రోగం ఉన్నా దాని నుండి బాగుపడేవారు. కనుక అక్కడున్నవారు ఆ నీరు ఎప్పుడు కదులుతుందా అని ఎదురు చూసేవారు.] ముప్పైఎనిమిది సంవత్సరాలుగా కదలలేని స్థితిలో ఉన్న ఒక రోగి అక్కడ ఉన్నాడు.
యోహాను 5:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇది అయిన తరువాత యూదుల పండగ ఒకటి వచ్చింది. యేసు దానికోసం యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలున్నాయి. (కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు. అక్కడ ముప్ఫై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అంగ వైకల్యంతో పడి ఉన్నాడు.
యోహాను 5:1-5 పవిత్ర బైబిల్ (TERV)
కొద్ది రోజుల తర్వాత యూదుల పండుగ వచ్చింది. యేసు యెరూషలేముకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేములో గొఱ్ఱెల ద్వారం దగ్గర ఒక కొలను ఉండేది. దీన్ని హీబ్రూ భాషలో బేతెస్థ అని అంటారు. దీని చుట్టూ ఐదు మండపాలు ఉండేవి. చాలామంది వికలాంగులు, గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్ళు. అక్కడున్న వాళ్ళలో ఒకడు ముప్పైఎనిమిది సంవత్సరాల నుండి రోగంతో బాధ పడ్తూ ఉన్నాడు.
యోహాను 5:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అటుతరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను. యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.