యోహాను 4:5-27
యోహాను 4:5-27 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన పొలానికి దగ్గరగా ఉన్న సమరయలోని సుఖారనే ఊరికి ఆయన వచ్చారు. అక్కడ యాకోబు బావి ఉంది, యేసు, ప్రయాణం వలన అలసి, ఆ బావి ప్రక్క కూర్చున్నారు. అది మిట్టమధ్యాహ్న సమయం. ఒక సమరయ స్త్రీ నీరు తోడుకోడానికి అక్కడికి వచ్చినప్పుడు, యేసు ఆమెతో, “నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వగలవా?” అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్లారు. ఆ సమరయ స్త్రీ ఆయనతో, “నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు నన్ను త్రాగడానికి ఇవ్వుమని ఎలా అడుగుతావు?” అన్నది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసం చేయరు. యేసు, “దేవుని బహుమానం మరియు నిన్ను నీళ్ళు అడిగింది ఎవరో నీకు తెలిస్తే, నీవే ఆయనను అడిగియుండేదానివి, ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడు” అని ఆమెకు జవాబిచ్చారు. అందుకు ఆమె, “అయ్యా, ఈ బావి చాలా లోతు, పైగా నీళ్ళు తోడుకోడానికి నీ దగ్గర ఏమీ లేదు. మరి ఆ జీవజలం నీకు ఎక్కడ దొరుకుతుంది? మా పితరుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళను అతడు, అతని కుమారులు త్రాగారు మరియు అతని పశువులు కూడా త్రాగాయి. నీవు అతనికంటే గొప్పవాడివా?” అని అడిగింది. అందుకు యేసు, “ఈ నీళ్ళు త్రాగిన ప్రతి ఒక్కరికి మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్ళను త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్ళు వారికి నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది” అన్నారు. ఆ స్త్రీ ఆయనతో, “అయ్యా, నాకు దాహం వేయకుండా మరియు నీళ్ళు చేదుకోడానికి ఇంత దూరం రాకుండా ఉండడానికి ఆ నీటిని నాకు ఇవ్వండి” అన్నది. ఆయన ఆమెతో, “వెళ్లి, నీ భర్తను పిలుచుకొనిరా” అని చెప్పారు. అందుకు ఆమె, “నాకు భర్త లేడు” అన్నది. యేసు ఆమెతో, “నీకు భర్త లేడని నీవు చెప్పింది వాస్తవమే. నిజానికి, నీకు ఐదుగురు భర్తలు ఉండేవారు, ఇప్పుడు నీతో ఉన్న వాడు నీ భర్త కాడు. నీవు సత్యమే చెప్పావు” అన్నారు. అప్పుడు ఆ స్త్రీ, “అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ యూదులైన మీరు ఆరాధించవలసిన స్థలం యెరూషలేమని అంటారు” అన్నది. అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా, నన్ను నమ్ము, ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు తండ్రిని ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని ఆరాధించరు. సమరయులైన మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు; మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం, ఎందుకంటే రక్షణ యూదులలో నుండే వస్తుంది. అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది, అది ఇప్పటికే వచ్చేసింది, ఎందుకంటే అలాంటి ఆరాధికుల కొరకే తండ్రి చూసేది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి” అని చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు వస్తాడని నాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు, ఆయన అన్ని విషయాలను మాకు వివరిస్తాడు” అని అన్నది. అప్పుడు యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అని తెలియజేసారు. ఇంతలో ఆయన శిష్యులు అక్కడ చేరుకొని యేసు ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడని చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ, “నీకు ఏమి కావాలి? లేక ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని కాని ఎవరు అడగలేదు.
యోహాను 4:5-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అలా ఆయన సమరయలో ఉన్న సుఖారు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరి దగ్గరే యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు. యాకోబు బావి అక్కడ ఉంది. యేసు ప్రయాణంలో అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం. ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, “తాగడానికి నీళ్ళు ఇస్తావా?” అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, “నువ్వు యూదుడివి. సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు?” ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోరు. దానికి యేసు, “నువ్వు దేవుని బహుమానాన్నీ, తాగడానికి నీళ్ళు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తినీ తెలుసుకుంటే నువ్వే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు” అన్నాడు. అప్పుడా స్త్రీ, “అయ్యా, ఈ బావి చాలా లోతు. తోడుకోడానికి నీ దగ్గర చేద లేదు. ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది? మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?” అంది. దానికి యేసు, “ఈ నీళ్ళు తాగే ప్రతి ఒక్కరికీ మళ్ళీ దాహం వేస్తుంది. కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నేను వారికిచ్చే నీళ్ళు అయితే వారిలో నిత్య జీవానికి ఊరుతూ ఉండే ఊట అవుతాయి” అన్నాడు. అప్పుడు ఆమె ఆయనతో, “అయ్యా, నీళ్ళు చేదుకోడానికి నేను ఇంత దూరం రానవసరం లేకుండా ఆ నీళ్ళు నాకివ్వు” అంది. యేసు ఆమెతో, “నువ్వు వెళ్ళి నీ భర్తను ఇక్కడికి తీసుకురా” అన్నాడు. దానికి ఆ స్త్రీ, “నాకు భర్త లేడు” అంది. యేసు ఆమెతో, “‘భర్త లేడని సరిగ్గానే చెప్పావు. ఎందుకంటే నీకు ఐదుగురు భర్తలున్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు” అన్నాడు. అప్పుడా స్త్రీ, “అయ్యా, నువ్వు ఒక ప్రవక్తవి అని నాకు అర్థమౌతున్నది. మా పూర్వీకులు ఈ కొండ పైన ఆరాధించారు. కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందనీ అందరూ అక్కడికే వెళ్ళి ఆరాధించాలనీ మీరు అంటారు” అంది. అందుకు యేసు ఇలా చెప్పాడు. “అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. నిజమైన ఆరాధికులు తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. తనను ఆరాధించేవారు అలాటివారే కావాలని తండ్రి చూస్తున్నాడు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.” అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు అని పిలిచే మెస్సీయ వస్తున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు అంతా వివరిస్తాడు” అంది. అది విని యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అని చెప్పాడు. ఇదే సమయానికి ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉండడం చూసి ‘ఎందుకు మాట్లాడుతున్నాడా’ అని ఆశ్చర్యపడ్డారు. కానీ ‘నీకేం కావాలని’ గానీ ‘ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు’ అని గానీ ఎవరూ అడగలేదు.
యోహాను 4:5-27 పవిత్ర బైబిల్ (TERV)
ప్రయాణం చేసి సమరయలోని సుఖారు అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూమిని, యాకోబు తన కుమారుడైన యోసేపుకు యిచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండేది. యేసు ప్రయాణంవల్ల అలసి ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకొని వెళ్ళటానికి వచ్చింది. యేసు ఆమెతో, “అమ్మా! నాకు త్రాగటానికి నీళ్ళిస్తావా?” అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనుక్కొని రావటానికి పట్టణంలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ ఆయనతో, “మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్ళివ్వమని అడుగుతున్నారే?” అని అన్నది. యూదులు సమరయులతో స్నేహంగా ఉండరు. యేసు సమాధానం చెబుతూ, “దేవుడు ఏమివ్వగలడో నీకు తెలియదు. నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో నీకు తెలియదు. అది నీకు తెలిసివుంటే నేను అడగటానికి బదులు నీవు నన్ను నీళ్ళు అడిగేదానివి. నేను నీకు జీవజలాన్నీ యిచ్చేవాణ్ణి” అని అన్నాడు. ఆ స్త్రీ, “అయ్యా! బావి లోతుగా ఉంది. పైగా మీ దగ్గర చేదటానికి ఏమిలేదు. ఈ జీవజలం మీకెట్లాలభిస్తుంది? మీరు మా తండ్రి యాకోబు కన్నా గొప్పవారా? అతడు ఈ బావి మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళు అతడు, అతని కుమారులు, అతని గొఱ్ఱెలు త్రాగాయి” అని అన్నది. యేసు, “ఈ నీళ్ళు త్రాగినా మళ్ళీ దాహం వేస్తుంది! కాని నేనిచ్చే నీళ్ళు త్రాగినవానికి మళ్ళీ దాహం కాదు. నేనిచ్చిన నీళ్ళు అతనిలో ఒక సజీవమైన ఊటగా మారి అతనికి అనంత జీవితాన్నిస్తుంది” అని సమాధానం చెప్పాడు. ఆ స్త్రీ, “అయ్యా! నాకు మళ్ళీ దాహం కలుగకుండా, నేను నీళ్ళు చేదటానికి ఇక్కడికి ప్రతిరోజూ రాకుండా ఉండేటట్లు నాకా జలాన్ని ప్రసాదించండి” అని అడిగింది. ఆయన, “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా!” అని ఆమెతో అన్నాడు. “నాకు భర్తలేడు” అని ఆమె తెలియచెప్పింది. యేసు, “నీకు భర్త లేడని సరిగ్గా సమాధానం చెప్పావు. నిజానికి నీకు ఐదుగురు భర్తలుండిరి. ప్రస్తుతం నీవు ఎవరితో నివసిస్తున్నావో అతడు నీ భర్తకాడు. నీవు నిజం చెప్పావు” అని అన్నాడు. ఆమె, “అయ్యా! మీరు ప్రవక్తలా కనిపిస్తున్నారు. మా పూర్వులు ఈ కొండ మీద పూజించారు. కాని మీ యూదులు, ‘మేము పూజించవలసింది యిక్కడ కాదు, యెరూషలేములో పూజించాలి’ అని అంటున్నారు” అని అన్నది. యేసు, “నన్ను నమ్మమ్మా! తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ మీదికి గాని లేక యెరూషలేముకు గాని వెళ్ళవలసిన అవసరం తీరిపోయే సమయం వస్తుంది. మీ సమరయ దేశస్థులు తెలియనిదాన్ని ఆరాదిస్తారు. రక్షణ యూదుల నుండి రానున్నది కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కూడా. ఎందుకంటే తండ్రి అటువంటి ఆరాధికుల కోసమే ఎదురు చుస్తున్నాడు. దేవుడు ఆత్మ అయివున్నాడు. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి” అని అన్నాడు. ఆ స్త్రీ, “క్రీస్తు అనబడే మెస్సీయ రానున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశదంగా చెబుతాడు” అని అన్నది. యేసు, “నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే!” అని అన్నాడు. అదే క్షణంలో ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆయనొక స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడ్డారు. కాని, “మీకేమి కావాలి?” అని కాని, లేక, “ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు” అని కాని వాళ్ళు అడగలేదు.
యోహాను 4:5-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు–నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి. ఆ సమరయ స్ర్తీ–యూదుడ వైన నీవు సమరయ స్ర్తీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు–నీవు దేవుని వరమును– నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడా స్ర్తీ–అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును? తానును తన కుమాళ్లును, పశువులును, యీ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను. అందుకు యేసు –ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి–అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదు కొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా యేసు నీవు వెళ్లి నీ పెనిమి టిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్ర్తీ–నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో– నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే; నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను. అప్పుడా స్ర్తీ–అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను –అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. ఆ స్త్రీ ఆయనతో–క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు–నీతో మాటలాడుచున్ననేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్ర్తీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గానినీకేమికావలెననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావని యైనను ఎవడును అడుగలేదు.