యోహాను 4:4-18
యోహాను 4:4-18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయన సమరయ ప్రాంతం గుండా వెళ్లవలసివచ్చింది. కనుక యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన పొలానికి దగ్గరగా ఉన్న సమరయలోని సుఖారనే ఊరికి ఆయన వచ్చారు. అక్కడ యాకోబు బావి ఉంది, యేసు, ప్రయాణం వలన అలసి, ఆ బావి ప్రక్క కూర్చున్నారు. అది మిట్టమధ్యాహ్న సమయం. ఒక సమరయ స్త్రీ నీరు తోడుకోడానికి అక్కడికి వచ్చినప్పుడు, యేసు ఆమెతో, “నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వగలవా?” అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్లారు. ఆ సమరయ స్త్రీ ఆయనతో, “నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు నన్ను త్రాగడానికి ఇవ్వుమని ఎలా అడుగుతావు?” అన్నది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసం చేయరు. యేసు, “దేవుని బహుమానం మరియు నిన్ను నీళ్ళు అడిగింది ఎవరో నీకు తెలిస్తే, నీవే ఆయనను అడిగియుండేదానివి, ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడు” అని ఆమెకు జవాబిచ్చారు. అందుకు ఆమె, “అయ్యా, ఈ బావి చాలా లోతు, పైగా నీళ్ళు తోడుకోడానికి నీ దగ్గర ఏమీ లేదు. మరి ఆ జీవజలం నీకు ఎక్కడ దొరుకుతుంది? మా పితరుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళను అతడు, అతని కుమారులు త్రాగారు మరియు అతని పశువులు కూడా త్రాగాయి. నీవు అతనికంటే గొప్పవాడివా?” అని అడిగింది. అందుకు యేసు, “ఈ నీళ్ళు త్రాగిన ప్రతి ఒక్కరికి మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్ళను త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్ళు వారికి నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది” అన్నారు. ఆ స్త్రీ ఆయనతో, “అయ్యా, నాకు దాహం వేయకుండా మరియు నీళ్ళు చేదుకోడానికి ఇంత దూరం రాకుండా ఉండడానికి ఆ నీటిని నాకు ఇవ్వండి” అన్నది. ఆయన ఆమెతో, “వెళ్లి, నీ భర్తను పిలుచుకొనిరా” అని చెప్పారు. అందుకు ఆమె, “నాకు భర్త లేడు” అన్నది. యేసు ఆమెతో, “నీకు భర్త లేడని నీవు చెప్పింది వాస్తవమే. నిజానికి, నీకు ఐదుగురు భర్తలు ఉండేవారు, ఇప్పుడు నీతో ఉన్న వాడు నీ భర్త కాడు. నీవు సత్యమే చెప్పావు” అన్నారు.
యోహాను 4:4-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మార్గంలో సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. అలా ఆయన సమరయలో ఉన్న సుఖారు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరి దగ్గరే యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు. యాకోబు బావి అక్కడ ఉంది. యేసు ప్రయాణంలో అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం. ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, “తాగడానికి నీళ్ళు ఇస్తావా?” అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, “నువ్వు యూదుడివి. సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు?” ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోరు. దానికి యేసు, “నువ్వు దేవుని బహుమానాన్నీ, తాగడానికి నీళ్ళు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తినీ తెలుసుకుంటే నువ్వే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు” అన్నాడు. అప్పుడా స్త్రీ, “అయ్యా, ఈ బావి చాలా లోతు. తోడుకోడానికి నీ దగ్గర చేద లేదు. ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది? మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?” అంది. దానికి యేసు, “ఈ నీళ్ళు తాగే ప్రతి ఒక్కరికీ మళ్ళీ దాహం వేస్తుంది. కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నేను వారికిచ్చే నీళ్ళు అయితే వారిలో నిత్య జీవానికి ఊరుతూ ఉండే ఊట అవుతాయి” అన్నాడు. అప్పుడు ఆమె ఆయనతో, “అయ్యా, నీళ్ళు చేదుకోడానికి నేను ఇంత దూరం రానవసరం లేకుండా ఆ నీళ్ళు నాకివ్వు” అంది. యేసు ఆమెతో, “నువ్వు వెళ్ళి నీ భర్తను ఇక్కడికి తీసుకురా” అన్నాడు. దానికి ఆ స్త్రీ, “నాకు భర్త లేడు” అంది. యేసు ఆమెతో, “‘భర్త లేడని సరిగ్గానే చెప్పావు. ఎందుకంటే నీకు ఐదుగురు భర్తలున్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు” అన్నాడు.
యోహాను 4:4-18 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన సమరయ ద్వారా ప్రయాణం చేయవలసివచ్చింది. ప్రయాణం చేసి సమరయలోని సుఖారు అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూమిని, యాకోబు తన కుమారుడైన యోసేపుకు యిచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండేది. యేసు ప్రయాణంవల్ల అలసి ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకొని వెళ్ళటానికి వచ్చింది. యేసు ఆమెతో, “అమ్మా! నాకు త్రాగటానికి నీళ్ళిస్తావా?” అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనుక్కొని రావటానికి పట్టణంలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ ఆయనతో, “మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్ళివ్వమని అడుగుతున్నారే?” అని అన్నది. యూదులు సమరయులతో స్నేహంగా ఉండరు. యేసు సమాధానం చెబుతూ, “దేవుడు ఏమివ్వగలడో నీకు తెలియదు. నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో నీకు తెలియదు. అది నీకు తెలిసివుంటే నేను అడగటానికి బదులు నీవు నన్ను నీళ్ళు అడిగేదానివి. నేను నీకు జీవజలాన్నీ యిచ్చేవాణ్ణి” అని అన్నాడు. ఆ స్త్రీ, “అయ్యా! బావి లోతుగా ఉంది. పైగా మీ దగ్గర చేదటానికి ఏమిలేదు. ఈ జీవజలం మీకెట్లాలభిస్తుంది? మీరు మా తండ్రి యాకోబు కన్నా గొప్పవారా? అతడు ఈ బావి మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళు అతడు, అతని కుమారులు, అతని గొఱ్ఱెలు త్రాగాయి” అని అన్నది. యేసు, “ఈ నీళ్ళు త్రాగినా మళ్ళీ దాహం వేస్తుంది! కాని నేనిచ్చే నీళ్ళు త్రాగినవానికి మళ్ళీ దాహం కాదు. నేనిచ్చిన నీళ్ళు అతనిలో ఒక సజీవమైన ఊటగా మారి అతనికి అనంత జీవితాన్నిస్తుంది” అని సమాధానం చెప్పాడు. ఆ స్త్రీ, “అయ్యా! నాకు మళ్ళీ దాహం కలుగకుండా, నేను నీళ్ళు చేదటానికి ఇక్కడికి ప్రతిరోజూ రాకుండా ఉండేటట్లు నాకా జలాన్ని ప్రసాదించండి” అని అడిగింది. ఆయన, “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా!” అని ఆమెతో అన్నాడు. “నాకు భర్తలేడు” అని ఆమె తెలియచెప్పింది. యేసు, “నీకు భర్త లేడని సరిగ్గా సమాధానం చెప్పావు. నిజానికి నీకు ఐదుగురు భర్తలుండిరి. ప్రస్తుతం నీవు ఎవరితో నివసిస్తున్నావో అతడు నీ భర్తకాడు. నీవు నిజం చెప్పావు” అని అన్నాడు.
యోహాను 4:4-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు–నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి. ఆ సమరయ స్ర్తీ–యూదుడ వైన నీవు సమరయ స్ర్తీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు–నీవు దేవుని వరమును– నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడా స్ర్తీ–అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును? తానును తన కుమాళ్లును, పశువులును, యీ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను. అందుకు యేసు –ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి–అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదు కొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా యేసు నీవు వెళ్లి నీ పెనిమి టిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్ర్తీ–నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో– నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే; నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.