యోహాను 4:4-10

యోహాను 4:4-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు–నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి. ఆ సమరయ స్ర్తీ–యూదుడ వైన నీవు సమరయ స్ర్తీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు–నీవు దేవుని వరమును– నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.

షేర్ చేయి
Read యోహాను 4

యోహాను 4:4-10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఆయన సమరయ ప్రాంతం గుండా వెళ్లవలసివచ్చింది. కనుక యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన పొలానికి దగ్గరగా ఉన్న సమరయలోని సుఖారనే ఊరికి ఆయన వచ్చారు. అక్కడ యాకోబు బావి ఉంది, యేసు, ప్రయాణం వలన అలసి, ఆ బావి ప్రక్క కూర్చున్నారు. అది మిట్టమధ్యాహ్న సమయం. ఒక సమరయ స్త్రీ నీరు తోడుకోడానికి అక్కడికి వచ్చినప్పుడు, యేసు ఆమెతో, “నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వగలవా?” అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్లారు. ఆ సమరయ స్త్రీ ఆయనతో, “నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు నన్ను త్రాగడానికి ఇవ్వుమని ఎలా అడుగుతావు?” అన్నది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసం చేయరు. యేసు, “దేవుని బహుమానం మరియు నిన్ను నీళ్ళు అడిగింది ఎవరో నీకు తెలిస్తే, నీవే ఆయనను అడిగియుండేదానివి, ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడు” అని ఆమెకు జవాబిచ్చారు.

షేర్ చేయి
Read యోహాను 4

యోహాను 4:4-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మార్గంలో సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. అలా ఆయన సమరయలో ఉన్న సుఖారు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరి దగ్గరే యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు. యాకోబు బావి అక్కడ ఉంది. యేసు ప్రయాణంలో అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం. ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, “తాగడానికి నీళ్ళు ఇస్తావా?” అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, “నువ్వు యూదుడివి. సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు?” ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోరు. దానికి యేసు, “నువ్వు దేవుని బహుమానాన్నీ, తాగడానికి నీళ్ళు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తినీ తెలుసుకుంటే నువ్వే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు” అన్నాడు.

షేర్ చేయి
Read యోహాను 4

యోహాను 4:4-10 పవిత్ర బైబిల్ (TERV)

ఆయన సమరయ ద్వారా ప్రయాణం చేయవలసివచ్చింది. ప్రయాణం చేసి సమరయలోని సుఖారు అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూమిని, యాకోబు తన కుమారుడైన యోసేపుకు యిచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండేది. యేసు ప్రయాణంవల్ల అలసి ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకొని వెళ్ళటానికి వచ్చింది. యేసు ఆమెతో, “అమ్మా! నాకు త్రాగటానికి నీళ్ళిస్తావా?” అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనుక్కొని రావటానికి పట్టణంలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ ఆయనతో, “మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్ళివ్వమని అడుగుతున్నారే?” అని అన్నది. యూదులు సమరయులతో స్నేహంగా ఉండరు. యేసు సమాధానం చెబుతూ, “దేవుడు ఏమివ్వగలడో నీకు తెలియదు. నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో నీకు తెలియదు. అది నీకు తెలిసివుంటే నేను అడగటానికి బదులు నీవు నన్ను నీళ్ళు అడిగేదానివి. నేను నీకు జీవజలాన్నీ యిచ్చేవాణ్ణి” అని అన్నాడు.

షేర్ చేయి
Read యోహాను 4