యోహాను 3:26-30
యోహాను 3:26-30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు యోహాను దగ్గరకు వచ్చి అతనితో, “రబ్బీ, యోర్దాను నదికి అవతల నీతో పాటు ఉన్న వాడు, నీవు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చావో, అతడు కూడా బాప్తిస్మమిస్తున్నాడు మరియు అందరు అతని దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు. అందుకు యోహాను ఈ విధంగా జవాబిచ్చాడు, “పరలోకం నుండి వారికి ఇవ్వబడితేనే గాని ఏ వ్యక్తి పొందుకోలేడు. ‘నేను క్రీస్తును కాను, నేను ఆయన కంటే ముందుగా పంపబడిన వాడను’ అని నేను చెప్పిన మాటలకు మీరే సాక్షులు. పెండ్లికుమార్తె పెండ్లికుమారునికే చెందుతుంది. పెండ్లికుమారుని దగ్గర ఉండి చూసుకొనే స్నేహితుడు అతడు ఏమైనా చెబితే వినాలని ఎదురుచూస్తాడు, పెండ్లికుమారుని స్వరాన్ని విన్నప్పుడు అతడు ఎంతో సంతోషిస్తాడు. నా సంతోషం కూడా అలాంటిదే, ఇప్పుడు అది సంపూర్ణమయ్యింది. ఆయన హెచ్చింపబడాలి; నేను తగ్గించబడాలి.”
యోహాను 3:26-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు యోహాను దగ్గరికి వచ్చారు. “బోధకా, యొర్దాను నది అవతల నీతో ఒక వ్యక్తి ఉన్నాడే, ఆయన గురించి నువ్వు సాక్ష్యం కూడా చెప్పావు. చూడు, ప్రస్తుతం ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు. అందరూ ఆయన దగ్గరకే వెళ్తున్నారు” అని చెప్పారు. అందుకు యోహాను ఇలా అన్నాడు, “పరలోకం నుండి ఇస్తేనే గానీ ఎవరూ ఏదీ పొందలేరు. నేను క్రీస్తును కాననీ ఆయన కంటే ముందుగా నన్ను పంపడం జరిగిందనీ నేను చెప్పాను. దానికి మీరే సాక్షులు. పెళ్ళి కొడుక్కే పెళ్ళి కూతురు ఉంటుంది. అయితే పెళ్ళి కొడుకు స్నేహితుడు నిలబడి పెళ్ళికొడుకు స్వరం వింటూ ఎంతో సంతోషిస్తాడు. అందుకే నా సంతోషం సంపూర్ణం అయింది. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి.”
యోహాను 3:26-30 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళు యోహాను దగ్గరకు వచ్చి, “రబ్బీ! యొర్దాను నదికి అవతలి వైపున మీతో ఉన్నవాడు, మీరు ఎవర్ని గురించి సాక్ష్యము చెప్పారో ఆయన బాప్తిస్మము నిస్తున్నాడు. అందరూ అయన దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు. యోహాను సమాధానం చెబుతూ, “దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్నీ పొందలేరు. నేను క్రీస్తును కానని, ఆయన కన్నా ముందు పంపబడిన వాణ్ణి మాత్రమేనని నేను ముందే చెప్పాను. దీనికి మీరు సాక్ష్యం. పెళ్ళి కూతురు పెళ్ళి కుమారుని సొత్తు. కాని పెళ్ళి కుమారుని స్నేహితుడు పెళ్ళికుమారుని మాట వినాలని కాచుకొని ఉంటాడు. అతని స్వరం వినిపించగానే ఆనందిస్తాడు. నాదీ అలాంటి ఆనందమే. ఆ ఆనందం నాకిప్పుడు సంపూర్ణంగా కలిగింది. ఆయన ప్రాముఖ్యత పెరగాలి. నా ప్రాముఖ్యత తరగాలి.
యోహాను 3:26-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
గనుక వారు యోహాను నొద్దకు వచ్చి–బోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతోకూడ ఉండెనో, నీ వెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను–తనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొంద నేరడు. నేను క్రీస్తును కాననియు, ఆయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లికుమార్తెగలవాడు పెండ్లికుమారుడు; అయితే నిలువబడి పెండ్లికుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లికుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమై యున్నది. ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది.