యోహాను 3:15-17
యోహాను 3:14-17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందునట్లు, అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తిన విధంగా, మనుష్యకుమారుడు ఎత్తబడాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కనుక తన యందు విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుడిని అనుగ్రహించారు. దేవుడు తన కుమారుని ఈ లోకానికి తీర్పు తీర్చుటకు పంపలేదు కానీ, ఆయన ద్వారా లోకాన్ని రక్షించడానికే పంపారు.
యోహాను 3:15-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అలాగే విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా ఆయన వల్ల నిత్యజీవం పొందడానికి మనుష్య కుమారుడు కూడా పైకి ఎత్తబడాలి. “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
యోహాను 3:14-17 పవిత్ర బైబిల్ (TERV)
“ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కడూ నశించకుండా అనంత జీవితం పోందాలంటే, మోషే ఎడారిలో పామును ఎత్తినట్లు మనుష్యకుమారుడు కూడా ఎత్త బడాలి” అని అన్నాడు. దేవుడు ఈ ప్రపంచ ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదని, వాళ్ళు అనంత జీవితం పొందాలనీ ఆయన ఉద్దేశ్యం. దేవుడు తన కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి రక్షణనివ్వటానికే గాని తీర్పు చెప్పటానికి పంపలేదు.
యోహాను 3:14-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.