యోహాను 21:1-25
యోహాను 21:1-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి. సీమోను పేతురు–నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు–మేమును నీతోకూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు– పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా, లేదని వారాయనతో చెప్పిరి . అప్పుడాయన–దోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు–ఆయన ప్రభువు సుమీ అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్ర్తహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను. దరియించుమించు ఇన్నూరు మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను. యేసు–మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను; చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు–రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున–నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలను కూడ పంచిపెట్టెను. యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి. వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి–యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు–నా గొఱ్ఱెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరల ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన–నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. – నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి–ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు – నా గొఱ్ఱెలను మేపుము. నీవు యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీచేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుముకట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణమువలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి–నన్ను వెంబడించుమని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించినవాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని–ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగినవాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి–ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను. యేసు–నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని–నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను. ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరు గుదుము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.
యోహాను 21:1-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ తర్వాత యేసు మరల తన శిష్యులకు తిబెరియ సముద్రం తీరంలో కనిపించారు. సీమోను పేతురు, దిదుమా అని పిలువబడే తోమా, గలిలయలోని కానాకు చెందిన నతనయేలు, జెబెదయి కుమారులు, మరో ఇద్దరు శిష్యులు కలిసి ఉన్ననప్పుడు, సీమోను పేతురు వారందరితో, “నేను చేపలను పట్టడానికి వెళ్తున్నాను” అని చెప్పినప్పుడు వారు, “మేము కూడ నీతో వస్తాము” అన్నారు. గనుక వారు పడవలో ఎక్కి వెళ్లి, రాత్రంతా కష్టపడినా కానీ వారు ఏమీ పట్టుకోలేదు. తెల్లవారుజామున, యేసు సరస్సు ఒడ్డున నిలబడి ఉన్నారు, కానీ శిష్యులు ఆయనను యేసు అని గుర్తించలేదు. ఆయన వారిని పిలిచి, “పిల్లలారా, మీ దగ్గర చేపలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగారు. అందుకు వారు “లేవు” అని జవాబిచ్చారు. ఆయన, “పడవకు కుడి వైపున మీ వలలు వేయండి, మీకు దొరుకుతాయి” అని చెప్పినప్పుడు వారు ఆ విధంగా చేశారు. అప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి కనుక వారు ఆ వలలను లాగలేక పోయారు. యేసు ప్రేమించిన శిష్యుడు సీమోను పేతురుతో, “ఆయన ప్రభువు!” అన్నాడు. “ఆయన ప్రభువు” అని పేతురు విన్న వెంటనే ఇంతకు ముందు తీసి వేసిన పైబట్టను తన చుట్టూ వేసుకొని నీటిలోనికి దూకాడు. పడవలో ఉన్న మిగతా శిష్యులు, చేపలున్న వలను లాగుతూ ఉన్నారు, అప్పుడు వారు ఒడ్డు నుండి సుమారు వంద గజాల దూరంలో మాత్రమే ఉన్నారు. వారు ఒడ్డుకు రాగానే, అక్కడ నిప్పులో కాలుతుండిన చేపలను మరియు కొన్ని రొట్టెలను చూసారు. యేసు వారితో, “మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్నింటిని తీసుకురండి” అని చెప్పారు. సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలలో నూటా యాభైమూడు పెద్ద చేపలున్నాయి, అన్ని చేపలు ఉన్నా ఆ వలలు చిరిగిపోలేదు. యేసు వారితో, “రండి, భోజనం చేయండి” అని పిలిచారు. ఆయనే ప్రభువని వారికి తెలిసింది కనుక ఆ శిష్యులలో ఎవరు ఆయనను “నీవు ఎవరు?” అని అడగడానికి ధైర్యం చేయలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచారు, అదే విధంగా చేపలను కూడ పంచారు. యేసు తాను చనిపోయి సజీవునిగా లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు కనబడడం ఇది మూడవసారి. వారు తిని ముగించిన తర్వాత యేసు సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోను, వీటన్నింటి కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగారు. అతడు “అవును, ప్రభువా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అన్నాడు. అయితే “నా గొర్రెపిల్లలను మేపుము” అని యేసు చెప్పారు. మరల యేసు, “యోహాను కుమారుడవైన సీమోను, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?” అని రెండవ సారి అడిగారు. అతడు “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని చెప్పాడు. అందుకు యేసు, “నా గొర్రెలను కాయుము” అన్నారు. యేసు మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగారు. యేసు తనని మూడవసారి “నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగినందుకు బాధపడిన పేతురు, “ప్రభువా, నీవు అన్ని తెలిసినవాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అని చెప్పాడు. అందుకు యేసు, “నా గొర్రెలను మేపుము” నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, “నీవు యవ్వనస్థునిగా ఉన్నప్పుడు, నీకు నీవే నీ నడుము కట్టుకొని నీకిష్టమైన స్థలాలకు వెళ్లేవాడివి. కాని నీవు ముసలి వాడవైనప్పుడు నీవు నీ చేతులను చాపుతావు, అప్పుడు మరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టం లేని చోటికి నిన్ను మోసుకువెళ్తాడు” అని చెప్పారు. పేతురు ఎలాంటి మరణం పొంది దేవుని మహిమపరుస్తాడో సూచిస్తూ యేసు ఈ విషయాలను చెప్పారు. ఇలా చెప్పి ఆయన అతనితో, “నన్ను వెంబడించు” అని చెప్పారు. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన శిష్యుడు తమను వెంబడిస్తున్నాడని చూసాడు. భోజనం చేసేప్పుడు యేసు దగ్గరగా ఆనుకొని కూర్చుని, “ప్రభువా, నిన్ను అప్పగించేది ఎవరు?” అని అడిగినవాడు ఇతడే. పేతురు అతన్ని చూసి, “ప్రభువా, అతని సంగతి ఏమిటి?” అని అడిగాడు. అందుకు యేసు, “నేను తిరిగి వచ్చేవరకు అతడు జీవించి ఉండడం నాకు ఇష్టమైతే నీకు ఏమి? నీవు నన్ను వెంబడించాలి” అని జవాబిచ్చారు. అందుకని ఆ శిష్యుడు చనిపోడు అనే మాట విశ్వాసుల మధ్య పాకిపోయింది. అయితే యేసు అతడు చావడు అని చెప్పలేదు కానీ, ఆయన “నేను తిరిగి వచ్చేవరకు అతడు జీవించి ఉండడం నాకు ఇష్టమైతే నీకు ఏమి?” అని మాత్రమే అన్నారు. ఈ విషయాల గురించి సాక్ష్యమిస్తూ వీటిని వ్రాసిన శిష్యుడు ఇతడే. అతని సాక్ష్యం నిజం అని మనకు తెలుసు. యేసు చేసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాస్తే, వ్రాసిన గ్రంథాలను ఉంచడానికి ఈ ప్రపంచమంతా కూడా సరిపోదు అని నేను భావిస్తున్నాను.
యోహాను 21:1-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ తరువాత తిబెరియ సముద్రం ఒడ్డున యేసు తనను మరోసారి కనపరచుకున్నాడు. ఎలాగంటే సీమోను పేతురు, దిదుమ అనే పేరున్న తోమా, గలిలయలోని కానా ఊరివాడైన నతనయేలూ, జెబెదయి కొడుకులూ, ఇంకా ఆయన శిష్యుల్లో మరో ఇద్దరూ కలిసి ఉన్నారు. సీమోను పేతురు, “నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా” అన్నాడు. మిగిలిన వారు, “మేము కూడా నీతో వస్తాం” అన్నారు. వారంతా పడవ ఎక్కి వెళ్ళారు. కానీ ఆ రాత్రంతా వారు ఏమీ పట్టలేదు. తెల్లవారింది. యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టలేదు. యేసు, “పిల్లలూ, చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు. “లేదు” అని వాళ్ళన్నారు.” అప్పుడాయన, “పడవకు కుడి వైపున వలలు వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అన్నాడు. కాబట్టి వారు అలాగే చేశారు. చేపలు నిండుగా పడ్డాయి. దాంతో వారు వల లాగలేకపోయారు. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు, “ఆయన ప్రభువు!” అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే ఇంతకు ముందు తీసివేసిన తన పైబట్ట మళ్ళీ తనపై వేసుకుని సముద్రంలో దూకాడు. ఒడ్డుకి ఇంకా రెండు వందల మూరల దూరం మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన శిష్యులు చేపలు ఉన్న వలని లాగుతూ ఆ చిన్న పడవలో వచ్చారు. ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి. అప్పుడు యేసు, “ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి” అని వారికి చెప్పాడు. సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి. అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు. అప్పుడు యేసు, “రండి, భోజనం చేయండి” అని వారిని పిలిచాడు. అప్పటికి ఆయన ప్రభువని వారికి తెలిసి పోయింది కాబట్టి, “నువ్వు ఎవరు” అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచి పెట్టాడు. అలాగే చేపలు కూడా ఇచ్చాడు. యేసు చనిపోయి సజీవుడిగా లేచిన తరవాత శిష్యులకి ప్రత్యక్షం కావడం ఇది మూడోసారి. వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు. మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు. ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు. నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు” అని అతనితో చెప్పాడు. దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, “నన్ను అనుసరించు” అని అతనితో అన్నాడు. పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించిన వాడూ, పస్కా పండగ సందర్భంలో భోజన సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఆయన ఛాతీని ఆనుకుంటూ, “ప్రభూ నిన్ను పట్టిచ్చేది ఎవరు” అని అడిగిన శిష్యుడు తమ వెనకే రావడం చూశాడు. పేతురు అతణ్ణి చూసి, “ప్రభూ, మరి ఇతడి విషయం ఏమవుతుంది?” అని ఆయనను అడిగాడు. దానికి యేసు, “నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండడం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు” అన్నాడు. దాంతో ఆ శిష్యుడు మరణించడు అనే మాట శిష్యుల్లో పాకి పోయింది. అయితే అతడు మరణించడు అని యేసు చెప్పలేదు గానీ నేను వచ్చే వరకూ అతడు ఉండడం నాకిష్టమైతే నీకేంటి, అని మాత్రమే అన్నాడు. ఈ సంగతులను గురించి సాక్షమిస్తూ ఇవన్నీ రాసింది ఈ శిష్యుడే. ఇతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు. యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాసే గ్రంథాలకు ఈ భూలోకం సరిపోదని నాకు అనిపిస్తుంది.
యోహాను 21:1-25 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత తిబెరియ సముద్రం దగ్గర యేసు మళ్ళీ కనిపించాడు. అది ఈ విధంగా జరిగింది: సీమోను పేతురు, దిదుమ అని పిలువబడే తోమా, గలిలయలోని కానా పట్టణానికి చెందిన “నతనయేలు”, జెబెదయి కుమారులు, మరొక యిద్దరు శిష్యులు, అంతా కలిసి ఒక చోట ఉన్నారు. సీమోను పేతురు, “నేను చేపలు పట్టటానికి వెళ్తున్నాను” అని అన్నాడు. మిగతా వాళ్ళు, “మేము కూడా వస్తున్నాము” అని అన్నాక అంతా కలిసి వెళ్ళి పడవనెక్కారు. కాని ఆ రాత్రి వాళ్ళకు చేపలు దొరక లేదు. తెల్లవారే సమయానికి యేసు ఒడ్డున నిలుచొని ఉన్నాడు. కాని శిష్యులు ఆయనే “యేసు” అని గ్రహించలేదు. యేసు, “మిత్రులారా! చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు. “లేదు” అని వాళ్ళన్నారు. ఆయన, “పడవ కుడి వైపు మీ వల వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని అన్నాడు. వాళ్ళు ఆయన చెప్పిన విధంగా వల వేసారు. చేపలు ఎక్కువగా వలలో పడటంవల్ల వాళ్లు ఆ వల లాగలేక పొయ్యారు. యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, “అదిగో చూడు ప్రభువు” అని అన్నాడు. సీమోను పేతురు, “అదిగో ప్రభువు!” అని అతడు అనటం విన్న వెంటనే, యిది వరకు తీసివేసిన తన పై వస్త్రాన్ని నడుముకు చుట్టుకొని నీళ్ళలోకి దూకాడు. మిగతా శష్యులు ఒడ్డుకు వంద గజాల దూరంలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు చేపలతో నిండిన వలను లాగుతూ పడవను నడుపుకుంటూ అతణ్ణి అనుసరిస్తూ ఒడ్డును చేరుకున్నారు. వాళ్ళు పడవ దిగాక కాలుతున్న బొగ్గల మీద చేపలు ఉండటం చూసారు. కొన్ని రొట్టెలు కూడా అక్కడ ఉన్నాయి. యేసు వాళ్ళతో “మీరు పట్టిన కొన్ని చేపలు తీసుకురండీ” అని అన్నాడు. సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలనిండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మొత్తం నూట ఏబది మూడు చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా ఆ వల చినుగలేదు! యేసు వాళ్ళతో, “రండి! వచ్చి భోజనం చెయ్యండి” అని అన్నాడు. “మీరెవరు” అని అడగటానికి శిష్యుల కెవ్వరికీ ధైర్యం చాలలేదు. యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, రొట్టెను తీసుకొని వాళ్ళకిచ్చాడు. అదే విధంగా చేపల్ని కూడా యచ్చాడు. ఆయన బ్రతికింపబడ్డాక తన శిష్యులకు కనిపించడం యిది మూడవసారి. వాళ్ళు భోజనం చెయ్యటం ముగించాక యేసు, సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోనూ! వీళ్ళకన్నా నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. “ఔను ప్రభూ! ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు. యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు!” అని అన్నాడు. యేసు, “యోహాను కుమారుడవైన సీమోనూ! నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?” అని మళ్ళీ అడిగాడు. అతడు, “ఔను ప్రభూ! నేను ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు. యేసు, “నా గొఱ్ఱెల్ని జాగ్రత్తగా చూసుకో!” అని అన్నాడు. మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోనూ! నన్ను ప్రేమిస్తున్నావా?” అని అన్నాడు. మూడవసారి, “నన్ను ప్రేమిస్తున్నావా” అని అడిగినందుకు పేతురు మనస్సు చివుక్కుమన్నది. అతడు, “ప్రభూ! మీకన్నీ తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కూడా తెలుసు” అని అన్నాడు. యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు! ఇది నిజం. వయస్సులో ఉన్నప్పుడు నీ దుస్తులు నీవు వేసుకొని నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళే వాడవు. కాని వయస్సు మళ్ళిన తర్వాత నీవు చేతులు చాపితే మరొకళ్ళు నీకు దుస్తులు తొడిగించి నీకు యిష్టం లేదన్న చోటికి తీసుకు వెళ్తారు” అని అన్నాడు. పేతురు ఎలాంటి మరణం పొంది దేవునికి మహిమ తెస్తాడో సూచించటానికి యేసు ఇలా అన్నాడు. ఆ తర్వాత అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు. పేతురు వెనక్కు తిరిగి చూసాడు. యేసు ప్రేమించిన శిష్యుడు వెంట రావటం గమనించాడు. రాత్రి భోజనాలప్పుడు యేసుకు ఆనుకొని, “ప్రభూ! మీకు ఎవరు ద్రోహం చేస్తారు!” అని ప్రశ్నించిన వాడు యితడే. పేతురు అతణ్ణి చూసి యేసుతో, “ప్రభూ! అతని సంగతి ఏమిటి?” అని అడిగాడు. యేసు సమాధానంగా, “నేను తిరిగి వచ్చే వరకు అతడు బ్రతికి ఉండాలని నాకిష్టమైతే! ఆ సంగతి నీ కెందుకు. నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు. యేసు ఈ విధంగా అనటంవల్ల ఈ శిష్యుడు చనిపోడనే వదంతి సోదరుల్లో వ్యాపించింది. కాని యేసు అతడు చనిపోడని అనలేదు. అతడు, “నేను తిరిగి వచ్చేవరకు అతడు బ్రతికి ఉండాలని నా ఉద్దేశ్యమైతే ఆ సంగతి నీకెందుకు?” అని అన్నాడు, అంతే. వీటిని గురించి సాక్ష్యం చెప్పిన వాడు, వ్రాసిన వాడు ఈ శిష్యుడే. అతని సాక్ష్యం నిజమైనదని మనకు తెలుసు. యేసు యింకా ఎన్నో కార్యాలు చేసాడు. వాటన్నిటిని గురించి వ్రాస్తే ఈ గ్రంథాలకు ఈ ప్రపంచంలో ఉన్న స్థలమంతా కూడా సరిపోదని నేననుకుంటాను.