యోహాను 21:1-12
యోహాను 21:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి. సీమోను పేతురు–నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు–మేమును నీతోకూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు– పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా, లేదని వారాయనతో చెప్పిరి . అప్పుడాయన–దోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు–ఆయన ప్రభువు సుమీ అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్ర్తహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను. దరియించుమించు ఇన్నూరు మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను. యేసు–మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను; చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు–రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున–నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.
యోహాను 21:1-12 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ తర్వాత యేసు మరల తన శిష్యులకు తిబెరియ సముద్రం తీరంలో కనిపించారు. సీమోను పేతురు, దిదుమా అని పిలువబడే తోమా, గలిలయలోని కానాకు చెందిన నతనయేలు, జెబెదయి కుమారులు, మరో ఇద్దరు శిష్యులు కలిసి ఉన్ననప్పుడు, సీమోను పేతురు వారందరితో, “నేను చేపలను పట్టడానికి వెళ్తున్నాను” అని చెప్పినప్పుడు వారు, “మేము కూడ నీతో వస్తాము” అన్నారు. గనుక వారు పడవలో ఎక్కి వెళ్లి, రాత్రంతా కష్టపడినా కానీ వారు ఏమీ పట్టుకోలేదు. తెల్లవారుజామున, యేసు సరస్సు ఒడ్డున నిలబడి ఉన్నారు, కానీ శిష్యులు ఆయనను యేసు అని గుర్తించలేదు. ఆయన వారిని పిలిచి, “పిల్లలారా, మీ దగ్గర చేపలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగారు. అందుకు వారు “లేవు” అని జవాబిచ్చారు. ఆయన, “పడవకు కుడి వైపున మీ వలలు వేయండి, మీకు దొరుకుతాయి” అని చెప్పినప్పుడు వారు ఆ విధంగా చేశారు. అప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి కనుక వారు ఆ వలలను లాగలేక పోయారు. యేసు ప్రేమించిన శిష్యుడు సీమోను పేతురుతో, “ఆయన ప్రభువు!” అన్నాడు. “ఆయన ప్రభువు” అని పేతురు విన్న వెంటనే ఇంతకు ముందు తీసి వేసిన పైబట్టను తన చుట్టూ వేసుకొని నీటిలోనికి దూకాడు. పడవలో ఉన్న మిగతా శిష్యులు, చేపలున్న వలను లాగుతూ ఉన్నారు, అప్పుడు వారు ఒడ్డు నుండి సుమారు వంద గజాల దూరంలో మాత్రమే ఉన్నారు. వారు ఒడ్డుకు రాగానే, అక్కడ నిప్పులో కాలుతుండిన చేపలను మరియు కొన్ని రొట్టెలను చూసారు. యేసు వారితో, “మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్నింటిని తీసుకురండి” అని చెప్పారు. సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలలో నూటా యాభైమూడు పెద్ద చేపలున్నాయి, అన్ని చేపలు ఉన్నా ఆ వలలు చిరిగిపోలేదు. యేసు వారితో, “రండి, భోజనం చేయండి” అని పిలిచారు. ఆయనే ప్రభువని వారికి తెలిసింది కనుక ఆ శిష్యులలో ఎవరు ఆయనను “నీవు ఎవరు?” అని అడగడానికి ధైర్యం చేయలేదు.
యోహాను 21:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ తరువాత తిబెరియ సముద్రం ఒడ్డున యేసు తనను మరోసారి కనపరచుకున్నాడు. ఎలాగంటే సీమోను పేతురు, దిదుమ అనే పేరున్న తోమా, గలిలయలోని కానా ఊరివాడైన నతనయేలూ, జెబెదయి కొడుకులూ, ఇంకా ఆయన శిష్యుల్లో మరో ఇద్దరూ కలిసి ఉన్నారు. సీమోను పేతురు, “నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా” అన్నాడు. మిగిలిన వారు, “మేము కూడా నీతో వస్తాం” అన్నారు. వారంతా పడవ ఎక్కి వెళ్ళారు. కానీ ఆ రాత్రంతా వారు ఏమీ పట్టలేదు. తెల్లవారింది. యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టలేదు. యేసు, “పిల్లలూ, చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు. “లేదు” అని వాళ్ళన్నారు.” అప్పుడాయన, “పడవకు కుడి వైపున వలలు వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అన్నాడు. కాబట్టి వారు అలాగే చేశారు. చేపలు నిండుగా పడ్డాయి. దాంతో వారు వల లాగలేకపోయారు. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు, “ఆయన ప్రభువు!” అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే ఇంతకు ముందు తీసివేసిన తన పైబట్ట మళ్ళీ తనపై వేసుకుని సముద్రంలో దూకాడు. ఒడ్డుకి ఇంకా రెండు వందల మూరల దూరం మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన శిష్యులు చేపలు ఉన్న వలని లాగుతూ ఆ చిన్న పడవలో వచ్చారు. ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి. అప్పుడు యేసు, “ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి” అని వారికి చెప్పాడు. సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి. అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు. అప్పుడు యేసు, “రండి, భోజనం చేయండి” అని వారిని పిలిచాడు. అప్పటికి ఆయన ప్రభువని వారికి తెలిసి పోయింది కాబట్టి, “నువ్వు ఎవరు” అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు.
యోహాను 21:1-12 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత తిబెరియ సముద్రం దగ్గర యేసు మళ్ళీ కనిపించాడు. అది ఈ విధంగా జరిగింది: సీమోను పేతురు, దిదుమ అని పిలువబడే తోమా, గలిలయలోని కానా పట్టణానికి చెందిన “నతనయేలు”, జెబెదయి కుమారులు, మరొక యిద్దరు శిష్యులు, అంతా కలిసి ఒక చోట ఉన్నారు. సీమోను పేతురు, “నేను చేపలు పట్టటానికి వెళ్తున్నాను” అని అన్నాడు. మిగతా వాళ్ళు, “మేము కూడా వస్తున్నాము” అని అన్నాక అంతా కలిసి వెళ్ళి పడవనెక్కారు. కాని ఆ రాత్రి వాళ్ళకు చేపలు దొరక లేదు. తెల్లవారే సమయానికి యేసు ఒడ్డున నిలుచొని ఉన్నాడు. కాని శిష్యులు ఆయనే “యేసు” అని గ్రహించలేదు. యేసు, “మిత్రులారా! చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు. “లేదు” అని వాళ్ళన్నారు. ఆయన, “పడవ కుడి వైపు మీ వల వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని అన్నాడు. వాళ్ళు ఆయన చెప్పిన విధంగా వల వేసారు. చేపలు ఎక్కువగా వలలో పడటంవల్ల వాళ్లు ఆ వల లాగలేక పొయ్యారు. యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, “అదిగో చూడు ప్రభువు” అని అన్నాడు. సీమోను పేతురు, “అదిగో ప్రభువు!” అని అతడు అనటం విన్న వెంటనే, యిది వరకు తీసివేసిన తన పై వస్త్రాన్ని నడుముకు చుట్టుకొని నీళ్ళలోకి దూకాడు. మిగతా శష్యులు ఒడ్డుకు వంద గజాల దూరంలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు చేపలతో నిండిన వలను లాగుతూ పడవను నడుపుకుంటూ అతణ్ణి అనుసరిస్తూ ఒడ్డును చేరుకున్నారు. వాళ్ళు పడవ దిగాక కాలుతున్న బొగ్గల మీద చేపలు ఉండటం చూసారు. కొన్ని రొట్టెలు కూడా అక్కడ ఉన్నాయి. యేసు వాళ్ళతో “మీరు పట్టిన కొన్ని చేపలు తీసుకురండీ” అని అన్నాడు. సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలనిండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మొత్తం నూట ఏబది మూడు చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా ఆ వల చినుగలేదు! యేసు వాళ్ళతో, “రండి! వచ్చి భోజనం చెయ్యండి” అని అన్నాడు. “మీరెవరు” అని అడగటానికి శిష్యుల కెవ్వరికీ ధైర్యం చాలలేదు.