యోహాను 20:19-23
యోహాను 20:19-23 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆదివారం సాయంకాలాన యూదా నాయకులకు భయపడి తలుపులను మూసుకొని, శిష్యులందరు ఒక్కచోట ఉన్నప్పుడు, యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి వారితో, “మీకు సమాధానం కలుగును గాక!” అని చెప్పారు. ఆయన ఆ విధంగా చెప్పి వారికి తన చేతులను, అతని ప్రక్కను చూపించగా శిష్యులు ప్రభువును చూసి చాలా సంతోషించారు. యేసు మళ్ళీ వారితో, “మీకు సమాధానం కలుగును గాక! నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని చెప్పారు. ఈ మాట చెప్పిన తర్వాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి; మీరు ఎవరిని క్షమించరో వారు క్షమించబడరు” అన్నారు.
యోహాను 20:19-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు. అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు. ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు.
యోహాను 20:19-23 పవిత్ర బైబిల్ (TERV)
ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది. యేసు మళ్ళీ, “మీకు శాంతి కులుగు గాక! తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని అన్నాడు. ఇలా అన్నాక, “పవిత్రాత్మను పొందండి!” అని వాళ్ళపై ఊదాడు. ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు.
యోహాను 20:19-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు–మరల మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది–పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.