యోహాను 17:1-19
యోహాను 17:1-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను–తండ్రీ, నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి; వారు నీ వాక్యము గైకొని యున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్ర హించినవన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు. నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్ర హించియున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహిమపరచబడి యున్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగునవారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చియున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడు మని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠచేయబడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.
యోహాను 17:1-19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు ఈ మాటలను చెప్పిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ ఇలా ప్రార్థించారు: “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచేలా నీ కుమారుని మహిమపరచు. నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరికి నిత్యజీవం అనుగ్రహించడానికి ప్రజలందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు. నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం. నీవు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరిచాను. తండ్రీ, ఈ లోక ఆరంభానికి ముందు నీతో నాకు ఉండిన మహిమతో ఇప్పుడు నన్ను నీ సన్నిధిలో మహిమపరచు. “ఈ లోకంలో నుండి నీవు నాకు ఇచ్చిన వారికి నేను నిన్ను తెలియపరిచాను. వారు నీవారు; నీవు వారిని నాకు ఇచ్చావు మరియు వారు నీ వాక్యాన్ని పాటించారు. ఇప్పుడు వారు నీవు నాకు ఇచ్చినవన్ని నీ దగ్గర నుండే వచ్చాయని తెలుసుకొన్నారు. ఎందుకంటే నీవు నాకు ఇచ్చిన మాటలను నేను వారికి ఇచ్చాను, వారు వాటిని అంగీకరించారు. నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చానని వారు తెలుసుకొని నీవు నన్ను పంపావని నమ్మారు. నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నేను లోకం కొరకు ప్రార్థన చేయడం లేదు, కాని నీవు నాకు ఇచ్చిన వారి కొరకు, ఎందుకంటే వారు నీవారు. నాకు ఉన్నవన్ని నీవి, నీకు ఉన్నవన్ని నావి. వారి ద్వారా నాకు మహిమ కలిగింది. నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, కనుక లోకంలో ఇక ఉండను, కాని వారైతే ఇంకా లోకంలోనే ఉన్నారు. పరిశుద్ధ తండ్రీ, నీ పేరిట అనగా నీవు నాకిచ్చిన పేరిట వారిని కాపాడు, అప్పుడు మనం ఏకమైవున్నట్లు వారు ఏకమైవుంటారు. నేను వారితో ఉన్నప్పుడు, నీవు నాకు ఇచ్చిన పేరిట వారిని రక్షించి భద్రంగా ఉంచాను. లేఖనాలు నెరవేరేలా నాశనానికి దిగజారిన ఒక్కడు తప్ప మరి ఎవరు తప్పిపోలేదు. “ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను, అయినా నా ఆనందం వారిలో పరిపూర్ణం అవ్వడానికి, నేను ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ విషయాలను చెప్తున్నాను. నేను నీ వాక్యాన్ని వారికి ఇచ్చాను కనుక లోకం వారిని ద్వేషించింది, ఎందుకనగా వారు కూడా నాలాగే ఈ లోకానికి చెందినవారు కారు. ఈ లోకం నుండి నీవు వారిని తీసుకో అని నేను ప్రార్థన చేయడం లేదు కాని, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. నేను ఈ లోకానికి చెందనట్లే, వారు కూడ ఈ లోకానికి చెందినవారు కారు. సత్యంతో వారిని పవిత్రపరచు; నీ వాక్యమే సత్యం. నీవు నన్ను ఈ లోకానికి పంపించినట్లే, నేను వారిని ఈ లోకానికి పంపించాను. వారు కూడా సత్యంలో ప్రతిష్ఠ చేయబడాలని, వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను.
యోహాను 17:1-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూసి, ఇలా అన్నాడు, “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ కలిగించేలా, నీ కుమారుడికి మహిమ కలిగించు. నువ్వు నీ కుమారుడికి అప్పగించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు. ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం. నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేసి, భూమి మీద నీకు మహిమ కలిగించాను. తండ్రీ, ఈ ప్రపంచం ఆరంభానికి ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండేదో, ఇప్పుడు నీ సముఖంలో ఆ మహిమ మళ్లీ నాకు కలిగించు. లోకంలోనుంచి నువ్వు నాకు అప్పగించిన వారికి నిన్ను వెల్లడి చేశాను. వారు నీ వారు. నువ్వు వారిని నాకు అప్పగించావు. వారు నీ వాక్కు పాటించారు. నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీ దగ్గర నుంచి వచ్చినవే అని ఇప్పుడు వారికి తెలుసు. ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన వాక్కులు నేను వారికి ఇచ్చాను. వారు వాటిని స్వీకరించి, నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చాననీ, నీవే నన్ను పంపావనీ నమ్మారు. “నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకం కోసం కాదు గాని, నువ్వు నాకు అప్పగించిన వారు నీ వారు కాబట్టి, వారి కోసమే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీ నీవి, నీవన్నీ నావి. వారిలో నాకు మహిమ కలిగింది. నేనింక ఈ లోకంలో ఉండను గాని ఈ ప్రజలు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, నువ్వు నాకిచ్చిన నీ నామాన్ని బట్టి, మనం ఏకంగా ఉన్నట్టే వారూ ఏకంగా ఉండేలా వారిని కాపాడు. నేను వారితో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన నీ నామాన్ని బట్టి వారిని కాపాడాను. లేఖనం నెరవేరేలా, నాశనానికి తగినవాడు తప్ప ఏ ఒక్కరూ నశించకుండా, వారిని సంరక్షించాను. ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆనందం వారిలో సంపూర్తి కావాలని లోకంలో ఉండగానే ఈ సంగతులు చెబుతున్నాను. వారికి నీ వాక్కు ఇచ్చాను. నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే, వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు కాబట్టి ఈ లోకం వారిని ద్వేషించింది. నువ్వు ఈ లోకంలో నుంచి వారిని తీసుకు వెళ్ళమని నేను ప్రార్థన చేయడం లేదు గాని, దుర్మార్గుని నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు. సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి. నీ వాక్యమే సత్యం. “నువ్వు నన్ను ఈ లోకంలోకి పంపినట్టే, నేను వారిని ఈ లోకంలోకి పంపించాను. వారు సత్యం ద్వారా పవిత్రులు కావాలని వారి కోసం నన్ను నేను పవిత్రం చేసుకుంటున్నాను.
యోహాను 17:1-19 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత యేసు ఆకాశం వైపు చూసి ఈ విధంగా ప్రార్థించాడు: “తండ్రి! సమయం వచ్చింది. నీ కుమారునికి మహిమ కలిగించు. అప్పుడు కుమారుడు నీకు మహిమ కలిగిస్తాడు. ప్రజలందరిపై కుమారునికి అధికారమిచ్చావు. నీవు అప్పగించిన వాళ్ళకు, ఆయన అనంత జీవితం యివ్వాలని నీ ఉద్దేశ్యం. నీవు మాత్రమే నిజమైన దేవుడవు. నిన్నూ, నీవు పంపిన ‘యేసుక్రీస్తు’ను తెలుసుకోవటమే అనంత జీవితం. పూర్తి చేయుమని నీవు నాకు అప్పగించిన కార్యాన్ని పూర్తిచేసి ఈ ప్రపంచంలో నీకు మహిమ కలిగించాను. తండ్రీ! ఈ ప్రపంచం ఆరంభం కాక ముందు నీతో పాటు నాకు కూడా మహిమ ఉండేది. ఇప్పుడు ఆ మహిమ నీ సమక్షంలో నాకు కలిగేటట్లు చేయుము. “ఈ ప్రపంచంలో నీవు నాకు అప్పగించిన వాళ్ళకు నిన్ను గురించి తెలియ చేసాను. వాళ్ళు నీ వాళ్ళు. కాని వాళ్ళను నీవు నాకు అప్పగించావు. వాళ్ళు నీ సందేశాన్ని పాటించారు. నీవు నాకు ఎన్నోయిచ్చావు. అవన్నీ నాకిచ్చినావని వాళ్ళకిప్పుడు తెలిసింది. ఎందుకంటే, నీవు నాకు చెప్పిన సందేశాన్ని వాళ్ళకు చెప్పాను. వాళ్ళు దాన్ని అంగీకరించారు. నేను నిజంగా నీ నుండి వచ్చానని వాళ్ళకు తెలుసు. నీవు నన్ను పంపావన్న విశ్వాసం యిప్పుడు వాళ్ళలో కలిగింది. నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రపంచాని కోసం ప్రార్థించటం లేదు. నీవు నాకు అప్పగించిన వాళ్ళు నీ వాళ్ళు కావాలని ప్రార్థిస్తున్నాను. నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా వాళ్ళ ద్వారా నాకు మహిమ కలుగుతోంది. “నేనీ ప్రపంచంలో యిక ఉండను. కాని వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. నేను నీ దగ్గరకు రాబోతున్నాను. ఓ తండ్రీ! నీలో పవిత్రత ఉంది. నీవు నాకిచ్చిన, నీ నామంలో ఉన్న మహిమతో వాళ్ళను రక్షించు. అలా చేస్తే మనం ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉంటారు. నేను వాళ్ళతో ఉన్నప్పుడు, నీవు నా కిచ్చిన నామంతో వాళ్ళను రక్షించి కాపాడాను. లేఖనాల్లో వ్రాసినవి నిజం కావటానికి నాశనం కావలసిన వాడు తప్ప మరెవ్వరూ నాశనం కాలేదు. “నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా ఆనందం వాళ్ళ హృదయాల్లో పూర్తిగా నిండి పోవాలని నేనీ ప్రపంచంలో ఉన్నప్పుడే ఈ విషయాలు చెబుతున్నాను. నీ సందేశం నా శిష్యులకు చెప్పాను. నేను ఈ ప్రపంచానికి చెందిన వాణ్ణి కాదు. అదే విధంగా నా శిష్యులు కూడా ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు. కనుక ప్రపంచం వాళ్ళను ద్వేషిస్తుంది. “వాళ్ళనీ ప్రపంచం నుండి తీసుకు వెళ్ళమని నేను ప్రార్థించటం లేదుగాని దుర్మార్గుని నుండి వాళ్ళను రక్షించుమని ప్రార్థిస్తున్నాను. నేను ఏ విధంగా ఈ ప్రపంచానికి చెందనో అదే విధంగా వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి చెందరు. సత్యంలో వారిని పవిత్రపరచు, నీ వాక్యమే సత్యం. నీవు నన్ను ఏ విధంగా పంపావో, అదే విధంగా వాళ్ళను నేను ఈ ప్రపంచంలోనికి పంపాను. వాళ్ళ కోసం నన్ను నేను ప్రత్యేకపరచు కొన్నాను. వాళ్ళు కూడా నిజంగా ప్రత్యేకించబడాలని నా ఉద్దేశ్యం.