యోహాను 16:1-14
యోహాను 16:1-14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“మీరు విశ్వాసం నుండి తొలగిపోకూడదని నేను మీకు ఈ సంగతులను చెప్పాను. వారు మిమ్మల్ని సమాజమందిరంలో నుండి వెలివేస్తారు; నిజానికి, మిమ్మల్ని చంపినవారు, దేవుని కొరకు మంచి పని చేస్తున్నామని భావించే ఒక సమయం వస్తుంది. వారు నన్ను గాని, తండ్రిని గాని తెలుసుకోలేదు కనుక వారు ఇలాంటి పనులను చేస్తారు. అవి జరిగేటప్పుడు ఇలా జరుగుతుందని నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరించానని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు చెప్పాను. మొదట్లో ఈ సంగతులను మీతో చెప్పలేదు ఎందుకంటే అప్పుడు నేను మీతోనే ఉన్నాను. ఇప్పుడు నేను నన్ను పంపినవాని దగ్గరకు వెళ్తున్నాను, అయినా, ‘నీవు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు. కానీ నేను చెప్పిన ఈ సంగతులను గురించి మీ హృదయాలు దుఖంతో నిండి ఉన్నాయి. అయితే నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, నేను వెళ్లిపోవడం మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్లకుండా ఆదరణకర్త మీ దగ్గరికి రారు. నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు, పాపం గురించి నీతిని గురించి మరియు తీర్పును గురించి లోకస్తులు తప్పులో ఉన్నారని రుజువుపరుస్తాడు. లోకులు నన్ను నమ్మలేదు గనుక వారి పాపం గురించి, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను గనుక ఇక మీరు నన్ను చూడరు కనుక వారి నీతిని గురించి, మరియు ఈ లోకాధికారి ఇప్పుడు తీర్పుపొందినవానిగా ఉన్నాడు గనుక తీర్పు గురించి ఒప్పింపజేస్తాడు. “మీతో ఇంకా చాలా చెప్పాల్సి ఉంది, కాని మీరు ఇప్పుడు వాటిని భరించలేరు. అయితే సత్యమైన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను మాట్లాడడు; తాను విన్నవాటినే ఆయన చెప్తాడు, జరుగబోయే వాటిని మీకు చెప్తాడు. ఆయన నా నుండి వినే వాటినే మీకు తెలియజేస్తూ నన్ను మహిమపరుస్తాడు.
యోహాను 16:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“మీరు తడబడకుండా ఉండాలని ఈ సంగతులు మీతో మాట్లాడాను. వారు మిమ్మల్ని సమాజ మందిరాల్లో నుండి బహిష్కరిస్తారు. మిమ్మల్ని చంపినవారు, దేవుని కోసం మంచి పని చేస్తున్నామని అనుకునే సమయం వస్తుంది. నేను గాని, తండ్రి గాని వారికి తెలియదు కాబట్టి అలా చేస్తారు. అవి జరిగే సమయం వచ్చినప్పుడు, వాటిని గురించి నేను మీతో చెప్పినవి గుర్తు చేసుకోవాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. నేను మీతో ఉన్నాను కాబట్టి మొదట్లో ఈ సంగతులు మీతో చెప్పలేదు. అయితే ఇప్పుడు నన్ను పంపినవాడి దగ్గరికి వెళ్తున్నాను. అయినా, ‘నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు. నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయం నిండా దుఃఖం ఉంది. “అయినప్పటికీ, నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే. నేను వెళ్ళకపోతే, ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. కాని నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పిస్తాడు. ప్రజలు నాలో నమ్మకం ఉంచలేదు గనక పాపం గురించి ఒప్పిస్తాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు ఇంక నన్ను ఎన్నడూ చూడరు గనక నీతిని గురించి ఒప్పిస్తాడు. ఈ లోకపాలకుడు తీర్పు పొందాడు గనక తీర్పును గురించి ఒప్పిస్తాడు. “నేను మీతో చెప్పే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు. అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు. ఆయన నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడు కాబట్టి నాకు మహిమ కలిగిస్తాడు.
యోహాను 16:1-14 పవిత్ర బైబిల్ (TERV)
“మీ విశ్వాసం చెదిరిపోకూడదని ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని సమాజ మందిరాల నుండి వెలి వేస్తారు. నిజం చెప్పాలంటే, మిమ్మల్ని చంపితే దేవుని సేవ చేసిన దానితో సమానంగా భావించే కాలం వస్తుంది. వాళ్ళకు నా గురించి కాని, తండ్రిని గురించి కాని, తెలియదు కనుక అలా చేస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు నేను హెచ్చరించినట్లు మీకు జ్ఞాపకం ఉండాలని ఈ విషయం చెపుతున్నాను. ఇన్నాళ్ళు మీతో ఉన్నాను. కనుక మీకీ విషయం మొదట చెప్పలేదు. “కాని యిప్పుడు నేను నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తున్నాను. కాని మీలో ఒక్కరైనా నేను ఎక్కడికి వెళ్తున్నానని అడగలేదు. నేను ఈ విషయం చెప్పటంవల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. కాని నేను వెళ్ళటం మీ మంచి కోసమే. ఇది నిజం. నేను వెళ్ళకపోతే మీకు సహాయం చెయ్యటానికి ఆదరణకర్త రాడు. నేను వెళ్తే ఆయన్ని పంపగలను. “ఆయన వచ్చాక పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ప్రపంచాన్ని ఒప్పింప చేస్తాడు. ప్రజలు నన్ను విశ్వసించలేదు కనుక వాళ్ళలో ‘పాపం’వుందని రుజువు చేస్తాడు. మీరు చూడలేని చోటికి, అంటే తండ్రి దగ్గరకు, వెళ్తున్నాను. కనుక తండ్రితో నాకున్న సంబంధాన్ని ఆయన రుజువు చేస్తాడు. కనుక నీతి విషయంలో ఈ లోకాధికారియైన సైతానుకు ఇదివరకే శిక్ష విధింపబడింది. కనుక ‘తీర్పు’ విషయంలో ఒప్పింప చేస్తాడు. “నేను మీకు చెప్పవలసిన విషయాలు ఎన్నోఉన్నాయి. కాని వాటికి మీరు ప్రస్తుతం తట్టుకొనలేరు. కాని సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వతహాగ మాట్లాడడు. తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు. నా సందేశం మీకు తెలియజేయుటవల్ల ఆయన నన్ను మహిమ పరుస్తాడు.
యోహాను 16:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు అభ్యంతరపడకుండవలెనని యీ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలమువచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు. అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటినిగూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొనులాగున యీ సంగతులు మీతో చెప్పుచున్నాను; నేను మీతోకూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్లుచున్నాను –నీవు ఎక్కడికి వెళ్లు చున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పాపమునుగూర్చియు నీతిని గూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమునుగూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పునుగూర్చియు ఒప్పుకొన జేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.