యోహాను 15:12-27
యోహాను 15:12-27 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నేను ఇచ్చే ఆజ్ఞ ఇదే: నేను మిమ్మల్ని ప్రేమించినట్లే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఒకడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టే ప్రేమ కంటే గొప్ప ప్రేమ లేదు. నా ఆజ్ఞల ప్రకారం మీరు చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు. నేను మిమ్మల్ని సేవకులని ఇక పిలువను. ఎందుకంటే ఏ సేవకునికైనా తన యజమానుడు చేసే పనులు తెలియవు. నేనైతే మిమ్మల్ని స్నేహితులనే పిలిచాను. ఎందుకంటే నేను నా తండ్రి నుండి విన్న విషయాలన్నింటిని మీకు తెలియజేసాను. మీరు నన్ను ఎంచుకోలేదు, కాని నేనే మిమ్మల్ని ఎంచుకొని మీరు వెళ్లి నిలిచివుండే ఫలం ఫలించాలని, మిమ్మల్ని నియమించాను. కనుక మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇవ్వాలని ఇలా చేశాను. ఇది నా ఆజ్ఞ: ఒకరిని ఒకరు ప్రేమించండి. “ఈ లోకం మిమ్మల్ని ద్వేషించినా, అది ముందుగా నన్ను ద్వేషించిందని మీరు గ్రహించాలి. మీరు ఈ లోకానికి చెందినవారైతే, అది మిమ్మల్ని స్వంతవారిలా ప్రేమించేది. కానీ మీరు ఈ లోకానికి చెందినవారు కారు, నేను మిమ్మల్ని ఈ లోకం నుండి ప్రత్యేకించాను; అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. నేను మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసికొండి: ‘ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాడు,’ వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా బోధకు లోబడి ఉంటే, వారు మీ బోధకు కూడా లోబడుతారు. నా నామంను బట్టి వారు మీ పట్ల ఇలా ప్రవర్తిస్తారు, ఎందుకంటే వారికి నన్ను పంపినవారెవరో తెలియదు అందుకే ఇలా చేస్తారు. నేను వచ్చి వారితో ఈ విషయాలను మాట్లాడి ఉండకపోతే, పాపం చేసామన్న అపరాధ భావన వారిలో ఉండేది కాదు; కాని ఇప్పుడు వారు పాపం చేయలేదని తప్పించుకునే అవకాశం లేదు. నన్ను ద్వేషిస్తున్న వారు, నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నారు. ఎవరూ చేయని ఈ అద్బుత క్రియలను నేను వారి మధ్యలో చేసి ఉండకపోతే, వారు నమ్మనందుకు వారిపై పాపదోషం నిలిచి ఉండేది కాదు. అయితే ఇప్పుడు వారు వాటిని చూసి కూడా నన్ను, నా తండ్రిని ద్వేషిస్తున్నారు. ‘కారణం లేకుండా వారు నన్ను ద్వేషించారు’ అని ధర్మశాస్త్రంలో వ్రాయబడినది నెరవేరడానికి ఇది జరిగింది. “తండ్రి నుండి నేను పంపబోయే ఆదరణకర్త అనగా సత్యమైన ఆత్మ తండ్రి దగ్గరి నుండి వచ్చినప్పుడు నా గురించి ఆయన సాక్ష్యం ఇస్తారు. మీరు మొదటి నుండి నాతో ఉన్నవారే, కనుక మీరు కూడ తప్పక నా గురించి సాక్ష్యం ఇవ్వాలి.
యోహాను 15:12-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ. స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు. నేను మీకు ఆజ్ఞాపించినట్టు చేస్తే మీరు నాకు స్నేహితులు. “నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను. ఎందుకంటే దాసుడికి యజమాని చేసేది తెలియదు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే, నా తండ్రి నుంచి నేను విన్నవన్నీ మీకు తెలియజేశాను. మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్ళి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను. మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. “ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకోండి. మీరు ఈ లోకానికి చెందిన వారైతే ఈ లోకం దాని సొంతవాళ్ళలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. కాని, మీరు లోకానికి చెందిన వారు కాదు. ఎందుకంటే, నేను మిమ్మల్ని ఈ లోకంలోనుంచి వేరు చేశాను. అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. “‘దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు’ అని నేను మీతో చెప్పిన మాట గుర్తు చేసుకోండి. వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా మాట ప్రకారం చేస్తే, మీ మాట ప్రకారం కూడా చేస్తారు. వారికి నన్ను పంపిన వాడు తెలియదు కాబట్టి, నా పేరిట ఇవన్నీ మీకు చేస్తారు. నేను వచ్చి వారితో మాట్లాడి ఉండకపోతే, వారికి పాపం ఉండేది కాదు. కాని, ఇప్పుడు వారి పాపం నుండి తప్పించుకునే అవకాశం వారికి లేదు. “నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. ఎవ్వరూ చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకపోతే వారికి పాపం ఉండేది కాదు. కాని, వారు నా కార్యాలు చూసినా నన్నూ, నా తండ్రినీ ద్వేషిస్తున్నారు. ‘కారణం లేకుండా నన్ను ద్వేషించారు’ అని వారి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది. “తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరికి నేను పంపబోయే ఆదరణకర్త, సత్యమైన ఆత్మ వచ్చినపుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. మీరు మొదటి నుంచి నాతో ఉన్నవాళ్ళే కాబట్టి మీరు కూడా సాక్షులుగా ఉంటారు.
యోహాను 15:12-27 పవిత్ర బైబిల్ (TERV)
నా ఆజ్ఞ యిది: నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో, అదే విధంగా మీరు కూడా పరస్పరం ప్రేమతో ఉండండి. స్నేహితుల కోసం ప్రాణాలివ్వటం కన్నా గొప్ప ప్రేమ లేదు. నేను ఆజ్ఞాపించినట్లు చేస్తే మీరు నా స్నేహితులు. నేను యిక మీదటి నుండి మిమ్మల్ని సేవకులుగా భావించను. ఎందుకంటే, సేవకునికి తన యజమాని చేస్తున్నదేమిటో తెలియదు. కాని నేను నా తండ్రి నుండి విన్న వాటినన్నిటిని మీకు చెప్పాను. అందుకే మీరు నా స్నేహితులని అన్నాను. “మీరు నన్ను ఎన్నుకో లేదు. నేను మిమ్మల్ని ఎన్నుకొన్నాను. మీరు వెళ్ళి చిరకాలం ఉండే ఫలమివ్వాలని మిమ్మల్ని ఎన్నుకొని నియమించాను. మీరు నా పేరిట ఏది అడిగినా నా తండ్రి మీకిస్తాడు. ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇది నా ఆజ్ఞ. “ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆ ప్రపంచం మీకన్నా ముందు నన్ను ద్వేషించిందన్న విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ప్రపంచానికి చెందిన వాళ్ళైతే ఆ ప్రపంచంలోని ప్రజలు మిమ్మల్ని తమ వాళ్ళుగా ప్రేమిస్తారు. నేను మిమ్మల్ని ఈ ప్రపంచంనుండి ఎన్నుకొన్నాను. కనుక యిప్పుడు మీరు ఈ ప్రపంచానికి చెందరు. అందుకే ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తుంది. “‘యజమాని కంటే సేవకుడు గొప్పకాదు’ అని నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళు నన్నే హింసించారు. కనుక మిమ్మల్ని కూడా హింసిస్తారు. వాళ్ళు నా సందేశం పాటించి ఉంటే మీ సందేశం కూడా పాటిస్తారు. నన్ను పంపింది ఎవరో వాళ్ళకు తెలియదు. కనుక నా పేరిట వెళ్ళిన మీ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తారు. నేను రాకుండా, వాళ్ళకు బోధించకుండా ఉండివుంటే పాపదోషము వాళ్ళ మీద ఉండేది కాదు. కాని ఇప్పుడు వాళ్ళు తమ పాపాల నుండి తప్పించుకోలేరు. “నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషించిన వానిగా పరిగణింపబడతాడు. నేను వాళ్ళ కోసం ఎవరూ చేయని ఈ మహాత్కార్యాలు చేసివుండక పోయినట్లైతే వాళ్ళకు ఈ పాపం అంటి ఉండేది కాదు. కాని యిప్పుడు వాళ్ళు నా అద్భుతాన్ని చూసారు. అయినా నన్ను, నా తండ్రిని ద్వేషిస్తున్నారు. కాని ధర్మశాస్త్రంలో, ‘వాళ్ళు నిష్కారణంగా నన్ను ద్వేషించారు’ అని వ్రాయబడింది. నెరవేరటానికి యిలా జరిగింది. “నేను నా తండ్రి నుండి సత్య స్వరూపియైన ఆత్మను మీకు ఆదరణకర్తగా పంపుతాను. తండ్రిలో నుండి వచ్చిన ఈ ఆత్మ నన్ను గురించి సాక్ష్యమిస్తాడు. మీరు నాతో మొదటి నుండి ఉన్న వాళ్ళు కనుక మీరు కూడా సాక్ష్యం చెప్పాలి.
యోహాను 15:12-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. నేను మీ కాజ్ఞాపించువాటినిచేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైనయెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. – దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీ మాట కూడ గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడ ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు. అయితే –నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెర వేరునట్లు ఈలాగు జరిగెను. తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటనుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.