యోహాను 14:6-11
యోహాను 14:6-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకు యేసు, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు. మీరు నన్ను నిజంగా తెలుసుకొని ఉంటే, మీకు నా తండ్రి కూడా తెలిసి ఉండేవాడు. ఇప్పటి నుండి మీకు ఆయన తెలుసు, మీరు ఆయనను చూసారు” అన్నారు. అందుకు ఫిలిప్పు, “ప్రభువా, మాకు తండ్రిని చూపించు, అది మాకు చాలు” అన్నాడు. యేసు అతనితో, “ఫిలిప్పూ, నేను ఇంతకాలం ఉన్నాక కూడా నేను నీకు తెలియదా? నన్ను చూసినవాడు తండ్రిని చూసాడు, కనుక ‘తండ్రిని చూపించు’ అని ఎలా అడుగుతున్నావు? నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నీవు నమ్మడం లేదా? నేను మీతో చెప్పే మాటలు నా అధికారంతో నేను చెప్పడం లేదు, కాని నాలో జీవిస్తూ, తన కార్యాలను చేస్తున్న తండ్రియే చెప్తున్నాడు. నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నేను చెప్పినప్పుడు నన్ను నమ్మండి; లేదా కనీసం దానికి రుజువుగా ఉన్న అద్బుత క్రియలమూలంగా నన్ను నమ్మండి.
యోహాను 14:6-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు. మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని కూడా తెలుసుకుని ఉండేవాళ్ళే. ఇప్పటినుంచి మీకు ఆయన తెలుసు. ఆయనను మీరు చూశారు” అన్నాడు. ఫిలిప్పు యేసుతో, “ప్రభూ, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు” అన్నాడు. యేసు అతనితో, “ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ‘తండ్రిని చూపించు’ అని నువ్వు ఎలా అంటున్నావు? నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాం అని నువ్వు నమ్మడం లేదా? నేను మాట్లాడే మాటలు నా సొంత మాటలు కాదు. నాలో నివాసం ఉంటున్న తండ్రి తన పని చేస్తున్నాడు. తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నాం అని నమ్మండి. అదీ కాకపోతే, ఈ క్రియల గురించి అయినా నన్ను నమ్మండి.
యోహాను 14:6-11 పవిత్ర బైబిల్ (TERV)
యేసు, “మార్గము, సత్యము, జీవము, నేనే! నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వరూ రాలేరు. నేను ఎవరో మీకు నిజంగా తెలిసివుంటే నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది. యిప్పుడు ఆయన్ని చూసారు. ఆయనెవరో మీకు తెలుసు” అని సమాధానం చెప్పాడు. ఫిలిప్పు, “ప్రభూ! మాకు తండ్రిని చూపండి. అది చాలు” అని అన్నాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను యింత కాలం మీతో కలిసి ఉన్నాను కదా! అయినా నేనెవరినో నీకు తెలియదా ఫిలిప్పు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. అలాగైతే తండ్రిని చూపుమని ఎందుకు అడుగుతున్నావు? నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నాడని, నీవు నమ్మటం లేదా? నేను చెప్పే మాటలు నా స్వంతవి కావు. నాలో నివసిస్తున్న తండ్రి తన పనిని చేస్తున్నాడు. నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నామని నమ్మండి. లేక మహాత్కార్యాలు చూసైనా నమ్మండి.
యోహాను 14:6-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు–ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు–ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు. తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.