యోహాను 14:23-31
యోహాను 14:23-31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అందుకు యేసు, “ఎవరైనా నన్ను ప్రేమిస్తే వారు నా బోధను పాటిస్తారు. కాబట్టి నా తండ్రి వానిని ప్రేమిస్తాడు మేము వారి దగ్గరకు వచ్చి వారితో నివాసం చేస్తాము. నన్ను ప్రేమించనివారు నా బోధలను పాటించరు. మీరు వింటున్న ఈ మాటలు నా సొంతం కాదు; అవి నన్ను పంపిన తండ్రి మాటలు. “నేను మీ మధ్య ఉన్నప్పుడే ఈ సంగతులను మీతో చెప్పాను. కానీ నా పేరిట తండ్రి పంపించు ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ, మీకు అన్ని విషయాలను బోధిస్తూ నేను మీకు చెప్పిన వాటినన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాడు. నా సమాధానాన్ని మీతో వదిలి వెళ్తున్నాను; నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. నేను ఈ లోకం ఇచ్చినట్టుగా ఇవ్వడం లేదు మీ హృదయాలను కలవరపడనీయకండి, భయపడకండి. “ ‘నేను వెళ్లి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను’ అని నేను చెప్పిన మాటను మీరు విని ఉన్నారు. అయితే మీరు నన్ను ప్రేమిస్తే, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నానని సంతోషించేవారు, ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. అది జరిగినప్పుడు మీరు నమ్మాలని, అది జరుగక ముందే ఇప్పుడే మీకు చెప్పాను. నేను మీతో ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఈ లోకాధికారి వస్తున్నాడు. కానీ అతనికి నా మీద అధికారం లేదు. అయితే నేను తండ్రిని ప్రేమిస్తున్నానని, తండ్రి నాకు ఆజ్ఞాపించిన వాటిని మాత్రమే నేను చేస్తున్నానని ఈ లోకం తెలుసుకోవాలనే అతడు వస్తాడు. “లేవండి, ఇక్కడినుండి వెళ్దాము.
యోహాను 14:23-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు జవాబిస్తూ, “ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ప్రకారం చేస్తాడు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. మేము అతని దగ్గరికి వచ్చి అతనితో నివాసం చేస్తాము. నన్ను ప్రేమించని వాడు నా మాట ప్రకారం చెయ్యడు. మీరు వినే ఈ మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. మీ మధ్య నేను బతికి ఉండగానే ఈ సంగతులు మీతో చెప్పాను. నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు. శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి. ‘నేను వెళ్ళిపోతున్నాను గాని మీ దగ్గరికి తిరిగి వస్తాను’ అని నేను చెప్పడం మీరు విన్నారు. మీరు నన్ను ప్రేమిస్తే, మీరు సంతోషిస్తారు. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి నాకన్నా గొప్పవాడు. ఈ సంగతి జరగక ముందే నేను మీతో చెప్పాను. ఎందుకంటే, ఇది నిజంగా జరిగినప్పుడు మీరు నమ్మాలని నా ఉద్దేశం. ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడను. ఈ లోకాధికారి వస్తున్నాడు. అతనికి నా మీద అధికారం లేదు. నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని ఈ లోకానికి తెలిసేలా, నా తండ్రి నాకు ఆజ్ఞాపించింది ఉన్నది ఉన్నట్టు నేను చేస్తాను. లేవండి, ఇక్కడి నుంచి వెళ్దాం.”
యోహాను 14:23-31 పవిత్ర బైబిల్ (TERV)
యేసు, ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రమించేవాడు నేను చెప్పినట్లు చేస్తాడు. అలాంటివాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. మేము వచ్చి అతనితో నివసిస్తాము. నన్ను ప్రేమించనివాడు నా మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి. “నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. “‘శాంతిని’ మీకు యిస్తున్నాను. అది నాలో ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకివ్వ జాలదు. కనుక చింతించకండి. భయపడకండి. నేను వెళ్తున్నానని, మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పటం మీరు విన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నందుకు మీరు ఆనందిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. ఇది జరిగినప్పుడు మీరు విశ్వసించాలని మీకీ విషయం ముందే చెబుతున్నాను. “ఈ లోకాధికారి రాబోతున్నాడు. అందువలన మీతో ఎక్కువ కాలం మాట్లాడను. వాడు నన్నేమీ చెయ్యలేడు. కాని నాకు తండ్రిపై ప్రేమ ఉందన్న విషయము, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను చేస్తున్న విషయము ప్రపంచానికి తెలియాలి. అందుకే యిలా చేస్తున్నాను. “రండి, యిక్కడి నుండి వెళ్దాం!”
యోహాను 14:23-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు–ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లు చున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు, మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను. లెండి, యిక్కడనుండి వెళ్లుదము.