యోహాను 14:1-14
యోహాను 14:1-14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“మీ హృదయాలను కలవరపడనీయకండి. దేవుని నమ్మండి; నన్ను కూడా నమ్మండి. నా తండ్రి ఇంట్లో చాలా నివాసస్థలాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే, నేను మీతో మీ కొరకు స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నానని చెప్పివుండేవాడినా? నేను వెళ్లి మీ కొరకు నివాసస్థలాన్ని సిద్ధపరిస్తే, నేను మళ్ళీ వచ్చి నాతో పాటు ఉండడానికి నేను ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ స్థలానికి మార్గం మీకు తెలుసు” అన్నారు. అందుకు తోమా ఆయనతో, “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. అప్పుడు మాకు ఆ మార్గం ఎలా తెలుస్తుంది?” అన్నాడు. అందుకు యేసు, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు. మీరు నన్ను నిజంగా తెలుసుకొని ఉంటే, మీకు నా తండ్రి కూడా తెలిసి ఉండేవాడు. ఇప్పటి నుండి మీకు ఆయన తెలుసు, మీరు ఆయనను చూసారు” అన్నారు. అందుకు ఫిలిప్పు, “ప్రభువా, మాకు తండ్రిని చూపించు, అది మాకు చాలు” అన్నాడు. యేసు అతనితో, “ఫిలిప్పూ, నేను ఇంతకాలం ఉన్నాక కూడా నేను నీకు తెలియదా? నన్ను చూసినవాడు తండ్రిని చూసాడు, కనుక ‘తండ్రిని చూపించు’ అని ఎలా అడుగుతున్నావు? నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నీవు నమ్మడం లేదా? నేను మీతో చెప్పే మాటలు నా అధికారంతో నేను చెప్పడం లేదు, కాని నాలో జీవిస్తూ, తన కార్యాలను చేస్తున్న తండ్రియే చెప్తున్నాడు. నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నేను చెప్పినప్పుడు నన్ను నమ్మండి; లేదా కనీసం దానికి రుజువుగా ఉన్న అద్బుత క్రియలమూలంగా నన్ను నమ్మండి. నన్ను నమ్మేవారు నేను చేస్తూవున్న పనులను చేస్తారు, వీటికన్నా గొప్ప వాటిని వారు చేస్తారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. మీరు నా పేరిట ఏది అడుగుతారో, తండ్రి కుమారునిలో మహిమ పొందునట్లు నేను దాన్ని చేస్తాను. మీరు నా పేరట ఏమి అడిగినా నేను దానిని చేస్తాను.
యోహాను 14:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి. నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు. తోమా యేసుతో, “ప్రభూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. మాకు దారి ఎలా తెలుస్తుంది?” అన్నాడు. యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు. మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని కూడా తెలుసుకుని ఉండేవాళ్ళే. ఇప్పటినుంచి మీకు ఆయన తెలుసు. ఆయనను మీరు చూశారు” అన్నాడు. ఫిలిప్పు యేసుతో, “ప్రభూ, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు” అన్నాడు. యేసు అతనితో, “ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ‘తండ్రిని చూపించు’ అని నువ్వు ఎలా అంటున్నావు? నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాం అని నువ్వు నమ్మడం లేదా? నేను మాట్లాడే మాటలు నా సొంత మాటలు కాదు. నాలో నివాసం ఉంటున్న తండ్రి తన పని చేస్తున్నాడు. తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నాం అని నమ్మండి. అదీ కాకపోతే, ఈ క్రియల గురించి అయినా నన్ను నమ్మండి. నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, నా మీద నమ్మకం ఉంచినవాడు, నేను చేసే క్రియలు కూడా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు. ఎందుకంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. “మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. తద్వారా తండ్రికి తన కుమారుడిలో మహిమ కలుగుతుంది. మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను.
యోహాను 14:1-14 పవిత్ర బైబిల్ (TERV)
“మీరు ఆందోళన చెందకండి. దేవుణ్ణి నమ్మండి. నన్ను కూడా నమ్మండి. నా తండ్రి యింట్లో ఎన్నో గదులున్నాయి. అలా లేక పోయినట్లైతే మీకు చెప్పేవాణ్ణి. మీకోసం ఒక స్థలము నేర్పాటు చేయటానికి అక్కడికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకోసం స్థలం ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండటం నా ఉద్దేశ్యం. నేను వెళ్ళే చోటికి వచ్చే దారి మీకు యిదివరకే తెలుసు” అని యేసు అన్నాడు. తోమా ఆయనతో, “ప్రభూ! మీరు వెళ్ళే చోటు ఎక్కడుందో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకా దారి ఏ విధంగా తెలుస్తుంది?” అని అన్నాడు. యేసు, “మార్గము, సత్యము, జీవము, నేనే! నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వరూ రాలేరు. నేను ఎవరో మీకు నిజంగా తెలిసివుంటే నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది. యిప్పుడు ఆయన్ని చూసారు. ఆయనెవరో మీకు తెలుసు” అని సమాధానం చెప్పాడు. ఫిలిప్పు, “ప్రభూ! మాకు తండ్రిని చూపండి. అది చాలు” అని అన్నాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను యింత కాలం మీతో కలిసి ఉన్నాను కదా! అయినా నేనెవరినో నీకు తెలియదా ఫిలిప్పు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. అలాగైతే తండ్రిని చూపుమని ఎందుకు అడుగుతున్నావు? నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నాడని, నీవు నమ్మటం లేదా? నేను చెప్పే మాటలు నా స్వంతవి కావు. నాలో నివసిస్తున్న తండ్రి తన పనిని చేస్తున్నాడు. నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నామని నమ్మండి. లేక మహాత్కార్యాలు చూసైనా నమ్మండి. “ఇది నిజం. నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నన్ను నమ్మిన ప్రతి ఒక్కడూ నేను చేసిన కార్యాలు చేస్తాడు. వీటికన్నా యింకా గొప్ప కార్యాలే చేస్తాడు. కుమారుని ద్వారా తండ్రి మహిమ పొందటానికి మీరు నా పేరిట ఏమి అడిగినా చేస్తాను. నా పేరిట నన్ను ఏమడిగినా నేను చేస్తాను.
యోహాను 14:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని .యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరునుఉండు లాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసి కొని పోవుదును. నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను. అందుకు తోమా– ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు–ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు–ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు. తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేనుచేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.