యోహాను 12:37-50

యోహాను 12:37-50 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యేసు వారి ఎదుట అనేక అద్భుత కార్యాలను చేసిన తర్వాత కూడ వారు ఆయనను నమ్మలేదు. దానికి కారణం, “ప్రభువా, మా సందేశాన్ని ఎవరు నమ్మారు, ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయింది?” అని యెషయా ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరాలి. అందుకే వారు నమ్మలేకపోయారు, ఎందుకంటే మరొక చోట యెషయా ఇలా అన్నాడు: “ఆయన వారి కళ్ళకు గ్రుడ్డితనాన్ని, వారి హృదయాలకు కాఠిన్యాన్ని కలుగజేశారు. అలా చేసి ఉండకపోతే వారు తమ కళ్లతో చూసి హృదయాలతో గ్రహించి, వారు నా తట్టు తిరిగి ఉండేవారు అప్పుడు నేను వారిని స్వస్థపరచే వానిని.” యెషయా యేసు మహిమను చూశాడు కాబట్టి ఆయనను గురించి ఈ మాట చెప్పాడు. అధికారులలో కూడ చాలామంది ఆయనను నమ్మారు. కాని వారు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకుంటే పరిసయ్యులు తమను సమాజమందిరం నుండి వెలివేస్తారని భయపడ్డారు. ఎందుకంటే వారు దేవుని మెప్పు కన్నా, ప్రజల మెప్పునే ఎక్కువగా ఇష్టపడ్డారు. అప్పుడు యేసు బిగ్గరగా, “ఎవరైతే నన్ను నమ్ముతారో, వారు నన్ను మాత్రమే కాదు, నన్ను పంపినవానిని కూడ నమ్ముతారు. నన్ను చూసేవాడు నన్ను పంపినవానిని చూస్తున్నాడు. నన్ను నమ్మిన ఏ ఒక్కరు చీకటిలో ఉండకూడదని, నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను. “ఎవరైనా నా మాటలు విని వాటిని పాటించకపోతే నేను వానికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికే వచ్చాను తప్ప తీర్పు తీర్చడానికి రాలేదు. నన్ను తిరస్కరించి నా మాటలు స్వీకరించని వాని కోసం ఒక న్యాయాధిపతి ఉన్నాడు; నేను పలికిన ఈ మాటలే చివరి రోజున వాన్ని తీర్పు తీరుస్తాయి. నా అంతట నేను మాట్లాడడం లేదు; నేను ఏమి మాట్లాడాలని నన్ను పంపిన తండ్రి నన్ను ఆజ్ఞాపించాడో దాన్నే నేను మాట్లాడాను. తండ్రి ఆజ్ఞ నిత్యజీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుకే తండ్రి చెప్పమని నాకు చెప్పిన మాటలనే నేను చెప్తున్నాను” అని చెప్పారు.

యోహాను 12:37-50 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు వారి ముందు ఎన్నో సూచక క్రియలు చేసినా, వారు ఆయనను నమ్మలేదు. ప్రభూ, మా సమాచారం ఎవరు నమ్మారు? ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయ్యింది?” అని ప్రవక్త యెషయా చెప్పిన మాట నెరవేరేలా ఇది జరిగింది. ఈ కారణంగా వారు నమ్మలేకపోయారు, ఎందుకంటే యెషయా మరొక చోట ఇలా అన్నాడు, “ఆయన వారి కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. ఆయన వారి హృదయాలను కఠినం చేశాడు. అలా చెయ్యకపోతే వారు తమ కళ్ళతో చూసి, హృదయాలతో గ్రహించి, నా వైపు తిరిగేవారు. అప్పుడు నేను వారిని బాగు చేసేవాణ్ణి.” యెషయా యేసు మహిమను చూశాడు కాబట్టి ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు. అయినా, పాలకవర్గం వారిలో కూడా చాలామంది యేసులో నమ్మకం ఉంచారు, కాని పరిసయ్యులు సమాజ మందిరంలో నుంచి తమను వెలివేస్తారని భయపడి, ఆ విషయం ఒప్పుకోలేదు. వారు దేవుని నుంచి వచ్చే మెప్పుకంటే, మనుషుల నుంచి వచ్చే మెప్పునే ఇష్టపడ్డారు. అప్పుడు యేసు పెద్ద స్వరంతో, “నాలో నమ్మకం ఉంచినవాడు నాలో మాత్రమే కాక నన్ను పంపినవాడిలో కూడా నమ్మకం ఉంచుతాడు. నన్ను చూసినవాడు నన్ను పంపినవాణ్ణి కూడా చూస్తున్నాడు. నాలో నమ్మకం ఉంచేవాడు చీకట్లో ఉండిపోకూడదని, ఈ లోకంలోకి నేను వెలుగుగా వచ్చాను. ఎవరైనా నా మాటలు విని, వాటిని పాటించకపోతే నేను అతనికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను, తీర్పు తీర్చడానికి కాదు. నన్ను తోసిపుచ్చి, నా మాటలు అంగీకరించని వాడికి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. నేను పలికిన వాక్కే చివరి రోజున అతనికి తీర్పు తీరుస్తుంది. ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడడం లేదు. నేనేం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నాకు ఆదేశించాడు. ఆయన ఆదేశం శాశ్వత జీవం అని నాకు తెలుసు. అందుకే నేను ఏ మాట చెప్పినా తండ్రి నాతో చెప్పినట్టే వారితో చెబుతున్నాను” అన్నాడు.

యోహాను 12:37-50 పవిత్ర బైబిల్ (TERV)

యేసు ఇన్ని మహాత్కార్యాలు వాళ్ళ సమక్షంలో చేసినా వాళ్ళలో ఆయన పట్ల విశ్వసం కలుగలేదు. ప్రవక్త యెషయా చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి యిలా జరిగింది: “ప్రభూ! మా సందేశం ఎవరు విశ్వసించారు? ప్రభువు తన శక్తిని ఎవరికి చూపాడు?” అందుచేత వాళ్ళు విశ్వసించలేక పోయారు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త మరొక చోట చెప్పినది నెరవేరునట్లు యిలా జరిగింది: “ప్రభువు వాళ్ళ కళ్ళు కప్పి, వాళ్ళ హృదయాలు మూసి వేశాడు. వాళ్ళు చూడరాదని, వాళ్ళు అర్థం చేసుకోరాదని ఆయన ఉద్దేశ్యం. అలా చేయకపోతే వాళ్ళు నా వైపు మళ్లుతారు వాళ్ళకు నేను నయం చేయవలసివస్తుంది.” యెషయా యేసు మహిమను చూసాడు. కనుకనే ఆయన్ని గురించి ఆ విధంగా మాట్లాడాడు. ఈ పరిస్థితుల్లో కూడా యూదుల నాయకుల్లో కొందరు యేసును విశ్వసించారు. కాని పరిసయ్యులు తమను సమాజం నుండి బహిష్కరిస్తారనే భయం వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. ఎందుకంటే, వీళ్ళకు దేవుని మెప్పుకన్నా ప్రజల పొగడ్తలంటే ఎక్కవ యిష్టం. యేసు, “నన్ను విశ్వసించేవాడు, నన్నే కాక నన్ను పంపిన వానియందు కూడా విశ్వసిస్తాడు. అతడు నన్ను చూసేటప్పుడు నన్ను పంపిన వానిని చూస్తున్నట్లే! నేను ఈ ప్రపంచంలోకి వెలుగ్గా వచ్చాను! ఎందుకంటే నన్ను విశ్వసించేవాడు చీకటిలో ఉండ కూడదని. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రీ నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే. “ఎవడైనను నా మాటలు విని వాటిని అనుసరించని వానికి నేను తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ ప్రపంచానికి తీర్పు తీర్చటానికి రాలేదు, కాని నేను రక్షించటానికి వచ్చాను. నన్ను, నా మాటల్ని ఇష్టపడక వ్యతిరేకించేవానిపై ఒక న్యాయాధిపతి ఉన్నాడు. నేను పలికిన మాటయే చివరి దినమున వానికి తీర్పుతీరుస్తుంది. నేను నా యిష్ట ప్రకారం మాట్లాడలేదు, గాని నా తండ్రి ఏమి చెప్పుమని నాకు ఆజ్ఞాపించాడో అలాగే చెప్పాను. ఆయన ఆజ్ఞ నిత్య జీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రి నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే” అని అన్నాడు.

యోహాను 12:37-50 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి. – ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచ బడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా–వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండు నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసివారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను. అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములోనుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను–నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినయెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను.