యోహాను 11:30-36

యోహాను 11:30-36 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పటికి ఇంకా యేసు గ్రామం లోపలికి ప్రవేశించలేదు, మార్త తనను కలుసుకొన్న చోటే ఉన్నారు. మరియను ఓదారుస్తూ ఇంట్లో ఉన్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్లడం చూసి ఆమె ఏడ్వడానికి సమాధి దగ్గరకు వెళ్తుందని భావించి ఆమె వెంట వెళ్లారు. మరియ యేసు ఉన్న చోటికి వెళ్లి యేసును చూసి ఆయన పాదాల మీద పడి, “ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు” అన్నది. ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడుస్తూ ఉండడం యేసు చూసి, తన ఆత్మలో ఎంతో బాధతో మూలుగుతూ, “మీరు అతన్ని ఎక్కడ పెట్టారు?” అని వారిని అడిగారు. అప్పుడు వారు, “ప్రభువా, వచ్చి చూడండి” అని అన్నారు. యేసు ఏడ్చారు. అప్పుడు యూదులు, “చూడండి ఆయన అతన్ని ఎంత ప్రేమించాడో!” అని అన్నారు.

యోహాను 11:30-36 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు. మార్తను కలుసుకున్న చోటే ఉన్నాడు. మరియతో ఇంట్లో ఉండి ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్ళడం చూసి ఆమె వెంట వెళ్ళారు. ఆమె ఏడవడానికి సమాధి దగ్గరికి వెళ్తూ ఉందని వారు అనుకున్నారు. అప్పుడు మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూసి ఆయన కాళ్ళ మీద పడి, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు” అంది. ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ, “అతణ్ణి ఎక్కడ పెట్టారు?” అన్నాడు. వారు, “ప్రభూ, వచ్చి చూడు” అన్నారు. యేసు ఏడ్చాడు. అప్పుడు యూదులు, “ఆయన లాజరును ఎంతగా ప్రేమించాడో చూడండి” అని చెప్పుకున్నారు.

యోహాను 11:30-36 పవిత్ర బైబిల్ (TERV)

యేసు గ్రామంలోకి రాలేదు. ఆయనింకా మార్త కులుసుకొన్న చోటే ఉన్నాడు. మరియ యింట్లో ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె హడావుడిగా లేచి బయటకు వెళ్ళటం చూసారు. ఆమె దుఃఖించటానికి సమాధి దగ్గరకు వెళ్తోందని ఆమె వెంట వెళ్ళారు. మరియ యేసు ఉన్న చోటికి వెళ్ళి ఆయన్ని చూసి, కాళ్ళ ముందుపడి, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు!” అని అన్నది. ఆమె, ఆమెతో వచ్చిన యూదులు దుఃఖించటం చూసి యేసు తన ఆత్మలో కలవర పడ్డాడు. ఆయన హృదయం కరిగి పోయింది. “అతన్నెక్కడ సమాధిచేసారు?” అని యేసు అడిగాడు. “వచ్చి చూడండి ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పుడు యూదులు, “యేసు అతన్నెంతగా ప్రేమించాడో చూడండి!” అని అన్నారు.

యోహాను 11:30-36 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను గనుక యింటిలో మరియతోకూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి. అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు–అతని నెక్కడ నుంచితిరని అడుగగా, వారు–ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు–అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.